‘ఆప్’ కూడా ఆ తాను ముక్కే! | Sakshi
Sakshi News home page

‘ఆప్’ కూడా ఆ తాను ముక్కే!

Published Fri, Nov 22 2013 1:29 AM

‘ఆప్’ కూడా ఆ తాను ముక్కే! - Sakshi

బదార్‌పూర్ టికెట్ రూ. 2 కోట్లకు అమ్మకం!
 ‘ఇండియా న్యూస్’ కథనంతో వెలుగులోకి...
అక్రమ మార్గాల్లో సొమ్ము వసూళ్లు
 ‘మీడియా సర్కార్’ స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడి

 
 న్యూఢిల్లీ: అవినీతి వ్యతిరేక ఉద్యమం పునాదులపై అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా ఆ తాను ముక్కేనని తాజా కథనాలు చెబుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా బరిలోకి దిగిన ‘ఆప్’పై కూడా టికెట్ల అమ్మకం ఆరోపణలు గుప్పుమంటున్నాయి. బదర్‌పురా నియోజకవర్గం టికెట్టును కేజ్రీవాల్ రూ.2 కోట్లకు అమ్ముకున్నట్లు ‘ఇండియా న్యూస్’ టీవీ చానల్ గురువారం బయటపెట్టింది. మరోవైపు, ‘ఆప్’ అక్రమ మార్గాల్లో సొమ్ము వసూళ్లకు పాల్పడుతున్న వైనాన్ని ‘మీడియా సర్కార్’ మీడియా సంస్థ తన స్టింగ్ ఆపరేషన్‌తో వెలుగులోకి తెచ్చింది.
 
 తన వెబ్‌సైట్‌లో వీడియో ఆధారాలతో కథనాన్ని ప్రచురించింది. అవినీతి వ్యతిరేక ఉద్యమ కాలంలో వసూలు చేసిన విరాళాలను పార్టీ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘ఆప్’, ఈ కథనాలతో మరింత ఇరకాటంలో పడింది. కాగా, పార్టీ మార్గదర్శకాల ప్రకారం నిర్వహించిన ఆన్‌లైన్ ఓటింగులో దాదాపు 60-70 శాతం ఓట్లు లభించిన అమ్రీష్ చౌదరిని కాదని కేజ్రీవాల్ బదార్‌పూర్ స్థానం నుంచి పోటీ చేసేందుకు టికెట్టును నారాయణ్‌దత్ తివారీకి కట్టబెట్టారు. చౌదరికే టికెట్టు లభిస్తుందని కార్యకర్తలంతా ఆశించగా, బదార్‌పూర్ అభ్యర్థిగా తివారీ పేరును అనూహ్యంగా ప్రకటించారు. ‘ఇండియా న్యూస్’ కథనం ప్రకారం... దీనిపై కినుక వహించిన చౌదరి, ‘బదార్‌పూర్ సీటును ఎంతకు అమ్మేశారు?’ అని ప్రశ్నిస్తూ కేజ్రీవాల్‌కు ఎస్‌ఎంఎస్ చేశారు. ‘రూ2 కోట్లు’ అని కేజ్రీవాల్ బదులిచ్చారు. ఇదిలా ఉండగా, ‘ఆప్’ అక్రమ మార్గాల ద్వారా సొమ్ము వసూళ్లకు పాల్పడుతున్న వైనాన్ని ‘మీడియా సర్కార్’ గురువారం తన స్టింగ్ ఆపరేషన్ కథనం ద్వారా వెలుగులోకి తెచ్చింది.
 
 షాజియా ఇల్మీ, దినేష్ మోహనియా, ఇర్ఫాన్ ఉల్లాఖాన్, కుమార్ విశ్వాస్ సహా తొమ్మిది మంది పార్టీ నేతలపై ‘మీడియా సర్కార్’ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి, వీడియో ఆధారాలను బయటపెట్టింది. స్టింగ్ ఆపరేషన్‌లో భాగంగా ఆ సంస్థకు చెందిన రిపోర్టర్ ఒకరు తానొక ప్రైవేటు కంపెనీ ఉద్యోగినని ఆర్‌కే పురం నుంచి పోటీ చేస్తున్న ‘ఆప్’ అభ్యర్థి షాజియా ఇమ్లీకి పరిచయం చేసుకున్నారు. తమ ప్రత్యర్థి కంపెనీ ప్రతిష్టను దెబ్బతీయడంలో సహకరించాలని కోరారు. ప్రత్యర్థి కంపెనీకి చెందిన కొన్ని పత్రాలు ఇస్తేనే సహకరించగలనని ఇమ్లీ చెప్పారు. అయితే, ఈ పని చేసేందుకు విరాళంగా డబ్బు ఇవ్వజూపడంతో ఎలాంటి పత్రాలు లేకుండానే రిపోర్టర్‌కు సాయం చేసేందుకు అంగీకరించారు. తనకు ఏ పద్ధతుల్లో డబ్బు చెల్లించాలో కూడా ఆమె వివరించారు. ఇదంతా వీడియోలో రికార్డయింది. కోండ్లీ స్థానం నుంచి పోటీచేస్తున్న ‘ఆప్’ అభ్యర్థి మనోజ్‌కుమార్ అయితే, తనకు ఓట్లు వేయిస్తే చాలు, తన నియోజకవర్గంలోని ఒక వ్యక్తి నుంచి బాకీ సొమ్మును వసూలు చేయించి పెడతానని రిపోర్టర్‌కు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిస్తే, ఒక వ్యక్తికి సంబంధించిన ఆస్తి తగాదాను తనవైన పద్ధతుల్లో ఇట్టే పరిష్కరిస్తానని సంగమ్‌విహార్ ‘ఆప్’ అభ్యర్థి దినేష్ మోహనియా హామీ ఇచ్చారు. రిపోర్టర్‌కు సంబంధించిన డబ్బు వివాదాన్ని చట్టపరమైన మార్గాల్లోనైనా, చట్టవిరుద్ధమైన మార్గాల్లోనైనా పరిష్కరిస్తానని ఓఖ్లా నుంచి పోటీ చేస్తున్న ‘ఆప్’ నేత ఇర్ఫాన్ ఉల్లాఖాన్ భరోసా ఇచ్చారు. వీరంతా రహస్య కెమెరాలకు చిక్కారు.
 
 అంతా కుట్ర: కేజ్రీవాల్
 తమ పార్టీ నేతలపై నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ అంతా కుట్ర అని ‘ఆప్’ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిం చారు. అవినీతి వ్యతిరేక పోరాటంలో తాము రాజీపడే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు తేలితే వారిని ఉపేక్షించేది లేదన్నారు. అయితే, ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తనకు తెలుసునన్నారు. మరోవైపు, ‘స్టింగ్’ ఆపరేషన్‌లో ఆరోపణలు ఎదుర్కొన్న ఆర్‌కే పురం అభ్యర్థి ఇమ్లీ, ఎన్నికల పోటీ నుంచి వైదొలగేం దుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆరోపణల నుంచి బయటపడేంత వరకు తానుపోటీ చేయబోనని ఆమె చెప్పారు. ‘ఆప్’ అసలు రంగును స్టింగ్ ఆపరేషన్ బట్టబయలు చేసిందని బీజేపీ నేత వీకే మల్హోత్రా పేర్కొన్నారు.

Advertisement
Advertisement