‘అనారోగ్య లక్ష్మి’! | Sakshi
Sakshi News home page

‘అనారోగ్య లక్ష్మి’!

Published Mon, Jul 20 2015 2:38 AM

‘అనారోగ్య లక్ష్మి’! - Sakshi

* నిష్ఫలమవుతున్న ఆరోగ్యలక్ష్మి పథకం
* అంగన్‌వాడీల్లో భోజనానికి లబ్ధిదారుల విముఖత

* 30 శాతానికి మించని గర్భిణులు, బాలింతల హాజరు
* మహిళా సంక్షేమ శాఖ  కొత్త నిబంధనే కారణం
* పాత విధానంలోనే అందించాలని కోరుతున్న లబ్ధిదారులు

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గర్భిణులు, బాలింతలకు సమృద్ధిగా పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆరోగ్యలక్ష్మి’ పథకం సత్ఫలితాలను ఇవ్వడం లేదు. ఈ పథకం కింద సర్కారు ప్రకటించిన ఆహార పదార్థాలేవీ లబ్ధిదారులకు సంపూర్ణంగా చేరడం లేదు. పథకం అమలుకు సంబంధించి పెట్టిన కొత్త నిబంధనే దీనికి కారణమని తెలుస్తోంది. వాస్తవానికి గత జనవరి 1 నుంచి ఆరోగ్యలక్ష్మి పథకం కింద పౌష్టికాహార దినుసుల(పాలు, కందిపప్పు, బియ్యం.. తదితరాలు)ను ప్రతి బాలింతకు, గర్భిణికీ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించేవారు.
 
 అయితే.. జూన్ 1 నుంచి బాలింతలు, గర్భిణులు తప్పనిసరిగా అంగన్‌వాడీ కేంద్రాల్లోనే పౌష్టికాహారాన్ని(భోజనం) తీసుకోవాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు కొత్త నిబంధన విధించారు. దీంతో నెలరోజులుగా పౌష్టికాహారం కోసం అంగన్‌వాడీలకు వచ్చే లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం అంగన్‌వాడీలకు వచ్చి, అక్కడ వండిన ఆహారాన్ని తినేందుకు కనీసం 30 శాతం మంది కూడా రావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యలక్ష్మి పథకం కింద 5,18,215 మంది లబ్ధిదారులు ఉండగా.. ఇందులో గర్భిణులు 2,60,241 మంది, బాలింతలు 2,57,974 మంది ఉన్నారు.
 
 పౌష్టికాహారం ఎందుకంటే..
 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. పౌష్టికాహారం అందని కారణంగా ఏటా ప్రసవ సమస్యలతో ప్రతి వెయ్యి మందిలో 110 మంది గర్భిణులు మరణిస్తున్నారు. 43 శాతం మంది ఐదేళ్లలోపు చిన్నారులు, 33.50 శాతం మంది మహిళలు తక్కువ బరువు కలిగి ఉంటున్నారు. రాష్ట్రంలోనూ గర్భిణులు, బాలింతలు తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ చూపని కారణంగా పోషకాహార లోపాలు, తద్వారా కలిగే దుష్ర్పరిణామాల బారిన పడుతున్నారు. వీరి ఆరోగ్య సంరక్షణ నిమిత్తం పోషణ స్థాయిలను మెరుగుపర్చేందుకు సమగ్ర శిశు సంరక్షణ సేవల(ఐసీడీఎస్) ద్వారా ఆరోగ్యలక్ష్మి పథకం అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో మాతా, శిశు మరణాల రేటును తగ్గించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.
 
 విలువ పెంచినా నిష్ఫలమే..
 ఈ పథకం కింద గర్భిణులు, బాలింతలకు అందించే పోషకాహార పరిమాణాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1నఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రోజుకు రూ.15 విలువైన పోషకాహారం మాత్రమే లబ్ధిదారులకు ఇస్తుండగా, తాజా ఉత్తర్వుల మేరకు ప్రతిరోజూ రూ.21 విలువైన ఆహారాన్ని అందించాలి. అయితే.. ఆహార పదార్థాలను ఇంటికి ఇచ్చే విధానానికి స్వస్తి పలికి, అంగన్‌వాడీల్లోనే ఒక పూట పోషకాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలన్న నిబంధన పట్ల ఎక్కువ మంది గర్భిణులు, బాలింతలు విముఖత వ్యక్తం చేస్తున్నారు.  
 
జిల్లాలవారీగా లబ్ధిదారులు

 

Advertisement
Advertisement