విద్యుత్‌కు కొత్త దారి! | Sakshi
Sakshi News home page

విద్యుత్‌కు కొత్త దారి!

Published Sat, Sep 19 2015 3:04 AM

విద్యుత్‌కు కొత్త దారి! - Sakshi

* వరంగల్-నరోరా-కర్నూలు కారిడార్‌కు టెండర్లు పిలిచిన కేంద్రం
* 4,500 మెగావాట్ల సరఫరా సామర్థ్యం.. మూడేళ్ల గడువు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొరతతో సతమతమయ్యే దక్షిణాది రాష్ట్రాల సమస్యను తీర్చేలా  కొత్త విద్యుత్ కారిడార్ అందుబాటులోకి రానుంది. మహారాష్ట్రలోని నరోరా నుంచి వరంగల్ వరకు, చిలకలూరిపేట నుంచి హైదరాబాద్ మీదుగా కర్నూలు వరకు 765 కేవీ విద్యుత్ సరఫరా లైన్లను నిర్మించనున్నారు.  4,500 మెగావాట్ల విద్యుత్‌ను దిగుమతి చేసుకోగలిగే ఈ కారిడార్ నిర్మాణం కోసం కేంద్ర విద్యుత్‌శాఖ తాజాగా టెండర్లు పిలిచింది.
 
ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ కొరత ఉండగా... ఉత్తరాదిన  మిగులు విద్యుత్ ఉంది. కానీ ఉత్తర, దక్షిణ విద్యుత్ సరఫరా గ్రిడ్‌ల మధ్య సరిపడే స్థాయిలో కారిడార్ (విద్యుత్ సరఫరా వ్యవస్థ) లేక ఆ మిగులు విద్యుత్‌ను దక్షిణాది రాష్ట్రాలు దిగుమతి చేసుకోలేకపోతున్నాయి. దక్షిణాది గ్రిడ్ విద్యుత్ దిగుమతి సామర్థ్యం 9 వేల మెగావాట్లే ఉండడంతో... దీని పరిధిలోని ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల అవసరాలను ఏమాత్రం తీర్చలేకపోతోంది. దక్షిణాదిన 2014-15లో 3,270 మెగావాట్ల కొరత ఏర్పడింది.

దీనికి తోడు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం, గ్యాస్ కొరత వల్ల 2018-19 నాటికి దక్షిణ గ్రిడ్ విద్యుత్ దిగుమతి అవసరాలు 16 వేల మెగావాట్లకు పెరగనున్నాయి. ఈ క్రమంలో దక్షిణాది గ్రిడ్ బలోపేతం కోసం కేంద్ర విద్యుత్ శాఖ వరంగల్-నరోరా-కర్నూలు గ్రిడ్ కారిడార్‌ను నిర్మించాలని నిర్ణయించింది. తాజాగా ఈ పనులకు టెండర్లను ఆహ్వానించింది.

ఇందులో భాగంగా మహారాష్ట్రలోని నరోరా నుంచి వరంగల్ వరకు, చిలకలూరిపేట నుంచి హైదరాబాద్ మీదుగా కర్నూలు వరకు 765 కేవీ విద్యుత్ సరఫరా లైన్లను నిర్మించనున్నారు. మూడేళ్లలో ఈ పనులను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కారిడార్ నిర్మాణం పూర్తయితే దక్షిణాది గ్రిడ్ మరో 4,500 మెగావాట్లను దిగుమతి చేసుకోగలదు. అయితే సాధారణంగా అంతర్రాష్ట విద్యుత్ సరఫరా లైన్ల నిర్మాణం పనులు ‘పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పీజీసీఎల్)’ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. విద్యుత్ సరఫరా రంగంలో ప్రైవేటు పోటీతత్వాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం వరంగల్-నరోరా-కర్నూలు కారిడార్ పనులకు బీవోటీ  (బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్) విధానంలో టెండర్లను ఆహ్వానించింది.
 
మూడేళ్లలో మూడింతలు
దక్షిణాది గ్రిడ్ విద్యుత్ దిగుమతి సామర్థ్యం 2019 నాటికి ఏకంగా మూడింతలు పెరిగి 33,000 మెగావాట్లకు చేరనుంది. ప్రస్తుతం దక్షిణాది గ్రిడ్ బయటి నుంచి 9 వేల మెగావాట్లకు మించి విద్యుత్‌ను దిగుమతి చేసుకునే పరిస్థితి లేదు. షోలాపూర్-రాయచూర్-కర్నూలు కారిడార్ ద్వారా 4,500 మెగావాట్లు, చందాపూర్-రామగుండం-హైదరాబాద్ కారిడార్ ద్వారా 1,000 మెగావాట్లు, జైపూర్-గాజువాక-విజయవాడ-ఖమ్మం కారిడార్ ద్వారా 1,000 మెగావాట్లు, తాల్చేర్-కోలార్ కారిడార్ ద్వారా 2,500 మెగావాట్ల విద్యుత్ దక్షిణాది గ్రిడ్‌కు దిగుమతి అవుతోంది.

అయితే నిర్మాణంలో ఉన్న మరో ఐదు లైన్లు పూర్తయితే 24,000 మెగావాట్ల సామర్థ్యమున్న కారిడార్ అందుబాటులోకి వస్తుంది. దీంతో దక్షిణాది గ్రిడ్ విద్యుత్ దిగుమతి సామర్థ్యం 33 వేల మెగావాట్లకు చేరనుంది. నిర్మాణంలో ఉన్న కొల్హాపూర్-బెంగళూరు లైన్ల ద్వారా ఈ ఏడాది చివరిలో 4,500 మెగావాట్ల దిగుమతి సామర్థ్యం పెరగనుంది. ఇటీవల పనులు ప్రారంభమైన వార్దా-హైదరాబాద్ కారిడార్ 2016 డిసెంబర్ చివరిలోగా పూర్తికావాల్సి ఉంది.

దీని ద్వారా 4,500 మె.వా., తాజాగా టెండర్లు పిలిచిన నరోరా-కర్నూలు లైన్ల ద్వారా 4,500మె.వా. సామర్థ్యం జతకానుంది. ఈ కారిడార్ 2019 డిసెంబర్‌లోగా అందుబాటులోకి రావాల్సి ఉంది. ఇక అంగుల్-కడప లైన్ల ద్వారా 4,500 మె.వా. కారిడార్ 2016 డిసెంబర్ చివరిలోగా, రాయగడ్-పుగలూరు లైన్ల ద్వారా 2018 డిసెంబర్‌లోగా 6,000 మె.వా. కొత్త కారిడార్‌లు అందుబాటులోకి రానున్నాయి.
 
ఉత్తరాది విద్యుత్‌పై ఆశలు..
రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉన్న సమయంలో ఉత్తరాది నుంచి 2,000 మె.వా. విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు. ఉత్తర-దక్షిణ గ్రిడ్లను అనుసంధానం చేస్తున్న లైన్లను ఇతర రాష్ట్రాలు ముందే బుక్ చేసుకుని పెట్టుకున్నాయి. ప్రస్తుతం తాల్చేరు-కోలారు లైన్ల ద్వారా తెలంగాణకు 260 మెగావాట్ల ఉత్తరాది విద్యుత్ సరఫరా అవుతోంది.

రాష్ట్రంలో విద్యుత్‌కు డిమాండ్ పెరిగితే మళ్లీ కారిడార్ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,000 మెగావాట్ల రోజువారీ డిమాండ్ ఉండగా... జెన్‌కో ద్వారా 2వేల మెగావాట్లు, కేంద్ర విద్యుత్ కేంద్రాల నుంచి 2వేల మె.వా. లభ్యమవుతోంది. మిగతా 2వేల మెగావాట్లను దక్షిణ గ్రిడ్ పరిధిలోని ప్రైవేటు సంస్థల నుంచి అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో యూనిట్‌కు రూ.5.50 నుంచి 6 వరకు చెల్లిస్తున్నారు. అదే ఉత్తర గ్రిడ్ నుంచి తీసుకునేందుకు కారిడార్ లభిస్తే యూనిట్ విద్యుత్ రూ.4కే లభించనుంది.

Advertisement
Advertisement