అట్లాంటి'క్' ఇట్లాంటి హీరోలు కాదు వీళ్లు! | Sakshi
Sakshi News home page

అట్లాంటి'క్' ఇట్లాంటి హీరోలు కాదు వీళ్లు!

Published Thu, Nov 19 2015 12:15 AM

అట్లాంటి'క్' ఇట్లాంటి హీరోలు కాదు వీళ్లు!

ఫొటోలో ఉన్న ఇద్దరి పేర్లు రాబిన్ ఊల్ఫ్, డేవీ డూప్లెసీ. తల్లీ, కుమారులు. వీరిద్దరు ఈ నెలాఖరులో దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ నుంచి బ్రెజిల్‌లోని రియో డీ జెనీరో వరకు వెళ్లాలనుకుంటున్నారు. అంటే రెండింటికి మధ్య ఉన్న అట్లాంటిక్ మహాసముద్రం దాటాలన్న మాట. అయితే విమానంలోనో.. షిప్‌లోనో కాదు.. పడవలో. అది కూడా తొక్కుడు పడవలో. ఈ పడవకు ఇంజన్, మోటార్ వంటివి ఏమీ ఉండవు కాబట్టి వాళ్ల కాళ్ల బలాన్ని నమ్ముకోవాల్సిందే.. ఇంతకీ ఆ రెండు ఊళ్ల మధ్య దూరం ఎంతో తెలుసా.. దాదాపు 6,450 కిలోమీటర్లు. అంత దూరం ఆ తొక్కుడు పడవలోనే వెళ్లాలన్నది వారి సంకల్పం.

అంటే వీరు ఓ సాహస యాత్ర చేస్తున్నారన్న మాట.. మరి అంత కష్టపడి అక్కడికి వెళ్లాల్సిన అవసరం వారికేముందనే కదా మీ అనుమానం! జీవ జాతులు అంతరించిపోతున్నాయన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలన్నది వారి ఆకాంక్ష. వాటిని కాపాడుకోకుంటే మన మనుగడకూ ముప్పు తప్పదని వారు హెచ్చరించేందుకే ఈ సాహస యాత్ర. కాగా, డూప్లెసీకి సాహస యాత్రలు చేయడం కొత్తేమీ కాదు. మూడేళ్ల కింద కయాకింగ్ బోటుపై అమెరికాలోని అమెజాన్ నదిపై సాహస యాత్ర చేశాడు. ఆ సమయంలో కొందరు దుండగులు అతడిపై కాల్పులు జరపగా, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడి ఎలాగోలా బతికి బయటపడ్డాడు.

ఇప్పుడు మరో సాహస యాత్రకు పూనుకున్నాడు. ఈ యాత్రలో తన తల్లి కూడా తోడు కావడం సంతోషంగా ఉందని డూప్లెసీ పేర్కొన్నాడు. ఈ యాత్రను నాలుగు నెలల్లోపు  పూర్తి చేస్తానని ధీమాగా చెబుతున్నాడు. ఇటీవలే తన సాహసయాత్రలపై ‘చూసింగ్ టు లివ్’ అనే పుస్తకం కూడా రాశాడు.  

ఇటీవలి కాలంలో అంతరించిపోతున్న జీవజాతుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. భూ చరిత్రలో మొత్తం ఇప్పటివరకు 5 సార్లు దాదాపు అన్ని జీవులు అంతరించిపోయి మళ్లీ పునరుద్ధరణ అయ్యాయని శాస్త్రవేత్తల అంచనా. మానవ చర్యల కారణంగా జీవ జాతులు కనుమరుగవుతున్నాయన్నది నగ్న సత్యం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకో 35 ఏళ్లలో భూమి మీదున్న సగం జీవజాతులు అంతరించిపోయే ప్రమాదముంది.

Advertisement
Advertisement