భంగపడ్డ ములాయం.. ఇప్పుడేం చేస్తారు? | Sakshi
Sakshi News home page

భంగపడ్డ ములాయం.. ఇప్పుడేం చేస్తారు?

Published Mon, Jan 16 2017 7:52 PM

భంగపడ్డ ములాయం.. ఇప్పుడేం చేస్తారు? - Sakshi

న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తు కోసం ఈసీ వేదికగా జరిగిన పోరాటంలో భంగపాటుకు గురైన ములాయం సింగ్‌ యాదవ్‌ ఇప్పుడేం చేస్తారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేల మద్దతుతో పార్టీ అధ్యక్షుడైన అఖిలేశ్‌కు సైకిల్‌ గుర్తు దక్కకుండా చివరి వరకూ పోరాడిన(!) ములాయం.. కొత్త పార్టీ పెట్టి కొడుకును ఢీకొంటారా? బీజేపీ అనుకూలుడిగా మారతారా? లేక అఖిలేశ్‌ అందించే సముచిత గౌరవాన్ని(పార్టీ మార్గదర్శి పదవిని) స్వీకరిస్తారా? అనే ప్రశ్నలు యూపీ ఓటర్ల మదిని తొలిచేస్తున్నాయి. ఈసీ నిర్ణయం వెలువడిన వెంటనే మహా కూటమిని ఏర్పాటుచేస్తామని అఖిలేశ్‌ యాదవ్‌ ప్రకటించింది. ఆ మేరకు చర్చలు మొదలైనట్లు రాంగోపాల్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఇటు ములాయం వర్గం మాత్రం ఈసీ నిర్ణయంపై ఎలాంటి ప్రకటన చెయ్యలేదు.
(అఖిలేశ్‌కే సైకిల్‌ గుర్తు)

ఈసీ నిర్ణయానికి ముందు, సోమవారం మధ్యాహ్నం కార్యకర్తలతో భేటీ అయిన ములాయం.. తన కుమారుడిని ఉద్దేశించి తీవ్రవ్యాఖ్యలు చేశారు. 'సీఎం అఖిలేశ్‌ ముస్లిం వ్యతిరేకి. ముస్లిం అధికారిని డీజీపీగా నియమించడానికి నిరాకరించాడు'అని బాంబు పేల్చారు. అంతేకాదు, ఎన్నికల్లో అఖిలేశ్‌కు పోటీగా నిలబడతానని ప్రకటనచేశారు. అంతర్గత కలహాలు మొదలైనతర్వాత అఖిలేశ్‌ను ఉద్దేశించి ములాయం ఇంత ఘాటుగా మాట్లాడటం ఇదే మొదటిసారి కావడంతో 'ముస్లిం వ్యతిరేకి' వ్యాఖ్యలు ప్రాధాన్యం అయ్యాయి. సైకిల్‌ గుర్తు తనకు దక్కదన్న సమాచారంతోనే ములాయం అఖిలేశ్‌ను టార్గెట్‌ చేశారని కొందరు మాట్లాడగా, ఇంకొందరు మాత్రం.. నేతాజీ వ్యూహాత్మకంగా అఖిలేశ్‌ను బలపరుస్తున్నారని, తన వ్యాఖ్యల ద్వారా ముస్లింల పట్ల నిబద్ధతను చాటుకునే అవకాశం అఖిలేశ్‌కు కల్పించారని అభిప్రాయపడ్డారు.
(అఖిలేష్‌పై నేనే పోటీ చేస్తా: ములాయం)

తమకు నేతాజీ మార్గనిర్దేశం ఎంతో అవసరమని మొదటి నుంచీ చెబుతోన్న అఖిలేశ్‌ వర్గం, సోమవారం నాటి ఈసీ నిర్ణయం తర్వాత కూడా అదే మాట చెప్పింది. కోలాహలం మధ్య పలు టీవీ చానళ్లు అడిగి ప్రశ్నలకు ఎస్పీ కార్యకర్తలంతా ఒకటే సమాధానం చెప్పారు.. 'నేతాజీ మా వెంటే ఉండాలి'అని! రాంమనోహర్‌ లోహియా, జయప్రకాశ్‌ నారాయణ్‌ల స్పూర్తితో నాలుగు దశాబ్ధాల కిందట రాజకీయాల్లోకి ప్రవేశించిన ములాయం సింగ్‌ యాదవ్‌ తన సుదీర్ఘ అనుభవంలో ఎన్నో కీలక పదవులు, అంతకుమించి ఒడిదుడుకులు ఎదుర్కున్నారు. కాగా, తాజా పరిస్థితిని ఎలా డీల్‌ చేస్తారో వేచి చూడాల్సిందే!

Advertisement

తప్పక చదవండి

Advertisement