సౌదీలో మళ్లీ క్షమాభిక్ష అమలు | Sakshi
Sakshi News home page

సౌదీలో మళ్లీ క్షమాభిక్ష అమలు

Published Sun, Aug 9 2015 2:28 AM

Again Clemency Implemented In Saudi

చట్టవిరుద్ధంగా ఉన్నవారికి ఊరట
మోర్తాడ్: సౌదీ అరేబియాలో నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న కార్మికులకు మరోసారి వెసులుబాటు కలిగింది. అలాంటి కార్మికులు స్వేచ్ఛగా ఇంటికి వెళ్లిపోయే అవకాశాన్ని అక్క డి ప్రభుత్వం కల్పించింది. రెండేళ్ల విరామం తర్వాత సౌదీ ప్రభుత్వం క్షమాభిక్షను మరోసారి అమల్లోకి తీసుకువచ్చింది. తెలంగాణ ప్రాంతం నుంచి విజిట్ వీసాపై సౌదీ ఆరేబియా వెళ్లి వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉంటూ పనులు చేసుకుంటున్న వారితో పాటు..

కంపెనీ వీసాలపై వెళ్లి కంపెనీల్లో పని నచ్చక బయటకు వచ్చి కల్లివిల్లిగా మారిన కార్మికులు కలుపుకొని సుమారు 30 వేల మందికిపైగా ఉంటారని స్వచ్ఛంద సం స్థలు అంచనా వేస్తున్నాయి. అయితే, సౌదీలో నిబంధనలకు విరుద్ధంగా ఉంటూ పనులు చేస్తున్న కార్మికుల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో అక్కడి ప్రభుత్వం రెండేళ్ల కిందట నతాఖా చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

ఈ చట్టం ప్రకారం వర్క్ పర్మిట్ లేకుండా చట్టవిరుద్ధంగా సౌదీలో ఉంటున్న కార్మికులు రాయభార కార్యాలయంలోగానీ, సౌదీ పోలీసులకు గానీ లొంగిపోయి ఇళ్లకు వెళ్లిపోవాలి. గల్ఫ్ వెళ్లేందుకు చేసిన అప్పులు సైతం తీరకపోవడం.. వచ్చిన కొద్దీరోజులకే ఇంటికి వెళ్తే పరిస్థితులు పూర్తిగా విషమిస్తాయన్న భయంతో చాలా మంది మొండిధైర్యంతో అక్కడే ఉండి ఏదో ఒక పని చేస్తూ కాలం గడుపుతున్నారు. క్షణక్షణం భయం.. భయంగా బతుకున్న వీరు పోలీసుల కంటపడకుండా ఉండిపోయారు. ఇలాంటి వారి కోసం సౌదీ ప్రభుత్వం మరోసారి క్షమాభిక్షను అమలులోకి తీసుకొచ్చింది.

ఈనెల 3 నుంచి క్షమాభిక్షను అమలులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం వచ్చేనెల (సెప్టెంబర్) 30 వరకు గడవు విధించింది. నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న కార్మికులు ఈసారి స్వచ్ఛందంగా ఇళ్లకు వెళ్లిపోకపోతే కఠిన శిక్షలను అమలు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. పాస్‌పోర్టులు లేని వారు విదేశాంగ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే మూడు రోజుల్లో తాత్కాలి పాస్‌పోర్టును జారీ చేయనుంది. అయితే, కార్మికులే విమాన చార్జీలను భరించాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement