స్టింగ్‌ ఆపరేషన్: ఆ గొంతు నాది కాదు! | Sakshi
Sakshi News home page

స్టింగ్‌ ఆపరేషన్: ఆ గొంతు నాది కాదు!

Published Tue, Jun 13 2017 6:11 PM

స్టింగ్‌ ఆపరేషన్: ఆ గొంతు నాది కాదు!

చెన్నై: అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఓటు వేసేందుకు ముడుపులు అందుకున్న వ్యవహారం తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తోంది. మీడియా స్టింగ్‌ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిపోయిన శాసనసభ్యుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అయితే దీనిపై స్పందించేందుకు అన్నాడీఎంకే వర్గాలు ముందుకు రావడంలేదు. ఈ వ్యవహారంపై మాజీ సీఎం పన్నీర్ సెల్వం నో కామెంట్స్‌ అని జారుకున్నారు. తమిళనాడు మంత్రి డి. జయకుమార్‌ను దీనిపై ప్రశ్నించగా... విషయం కోర్టు పరిధిలో ఉందని దాటవేశారు.

ఇక ముడుపుల వ్యవహారంపై ఎమ్మెల్యే శరవణన్‌ను పన్నీర్‌ సెల్వం వివరణ కోరారు. అసెంబ్లీలో పళనిస్వామి విశ్వాసపరీక్ష సందర్భంగా అన్నాడీఎంకేతో ఒక్కో ఎమ్మెల్యేకు 2 కోట్లు ఆఫర్‌ చేశారని స్టింగ్‌ ఆపరేషన్‌లో శరవణన్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. కొందరికి రూ. 6 కోట్ల నుంచి 10 కోట్ల వరకు అందాయని చెప్పారు. ఓపీఎస్‌ కూడా ఒక్కో ఎమ్మెల్యేకు కోటి రూపాయలు ఇచ్చేందుకు ముందుకొచ్చారని తెలిపారు. ఓటుకు కోట్లు స్టింగ్ ఆపరేషన్‌పై ప్రతిపక్ష డీఎంకే తీవ్రంగా స్పందించింది. సీబీఐ విచారణ జరిపించాలని మద్రాస్‌ హౌకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టాలని డీఎంకే డిమాండ్‌ చేసింది.

నా గొంతు కాదు..
అన్నాడీఎంకే ఎమ్మెల్యే, స్టింగ్‌ ఆపరేషన్‌లో పట్టుబడ్డ శరవణన్ ఈ వ్యవహారంపై స్పందించారు. ఈ వీడియోలో వినిపించిన స్వరం తనది కాదని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలా మిక్సింగ్ చేసి విడుదల చేశారని అన్నారు. పాత వీడియోను ఇప్పుడు బయటపెట్టి తనను బజారుకీడ్చాలని చూస్తున్నారని శరవణన్ మీడియాకు వివరించారు.

Advertisement
Advertisement