ఐక్యంగా పోరాడండి: రాహుల్ | Sakshi
Sakshi News home page

ఐక్యంగా పోరాడండి: రాహుల్

Published Sun, Jan 19 2014 4:25 AM

ఐక్యంగా పోరాడండి: రాహుల్ - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే ఐక్యతతో పనిచేయాలని రాష్ట్రాల నుంచి వచ్చిన నాయకులకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. పార్టీలోని అంతర్గత కుమ్ములాటలపై స్పందిస్తూ, ‘కొన్ని అంశాల్లో మీలో మీకు విభేదాలు ఉంటే ఉండవచ్చు. అయినా, ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అంతా కలసి పనిచేయాల్సిందే’ అని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల కోసం ఇటీవల ప్రచారసారథ్యం చేపట్టిన రాహుల్, శనివారం తొలిసారిగా పీసీసీ అధినేతలు, ఏఐసీసీ ప్రతినిధులు సహా రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలతో భేటీ అయ్యారు. నిజమైన కార్యకర్తలకు ఆదరణ కరువైందంటూ పలువురు కిందిస్థాయి నాయకులు రాహుల్ వద్ద ఆక్రోశం వెళ్లగక్కారు.
 
 కింది స్థాయి కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపకుండా పార్టీని ముందుకు నడపాలంటే కష్టమేనని వారు కుండబద్దలు కొట్టారు. నాలుగేసి రాష్ట్రాలను ఒక గ్రూపుగా విభజించి, ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలతో చర్చలు జరిపారు. తొలుత ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, గోవా నేతలతో రాహుల్ సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్, కేంద్ర మంత్రులు జేడీ శీలం, పనబాక లక్ష్మితో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు సహా రాష్ట్రానికి చెందిన దాదాపు 50 మంది నాయకులు పాల్గొన్నారు. అయితే, పలువురు ఎంపీలు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తదితరులు ఢిల్లీలోనే ఉన్నా, ఈ భేటీకి రాలేదు. కాగా, ప్రతి రాష్ట్రం నుంచి ఏఐసీసీ, పీసీసీ, డీసీసీల తరఫున ఒక్కొక్కరు చొప్పున సభ్యులకు మాట్లాడే అవకాశమిచ్చారు. ఏపీ నుంచి పీసీసీ తరఫున మాదాసు గంగాధర్, ఏఐసీసీ తరఫున ఉప్పల శారద, మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్‌లకు మాట్లాడే అవకాశం లభించింది. రాష్ట్ర నేతలు చెప్పిన అంశాలు వారి మాటల్లోనే...
 
 పైరవీకారులను పక్కనపెట్టండి: ఒబెదుల్లా

 -    పార్టీలోకిందిస్థాయి కార్యకర్తలకు గుర్తింపు దక్కడం లేదు. ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసేవారికే ప్రాధాన్యమిస్తున్నారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు పదవులివ్వండి. పైరవీకారులను పక్కనపెట్టండి.
 -    కొత్తగా వస్తున్న వారిని పార్టీలో చేర్చుకోవడంలో తప్పులేదు. అయితే, కొత్తగా వచ్చిన వారికే టికెట్లు కట్టబెట్టి, పాతవారిని పక్కనపెడితే పూడ్చుకోలేని నష్టం వాటిల్లుతుంది.
 -   పార్టీ వారెవరో, కానివారెవరో గుర్తించలేని స్థితి కనిపిస్తోంది. శుక్రవారం నాటి సమావేశానికి పార్టీతో సంబంధం లేనివారు సైతం వచ్చారు. వారిని ఎలా రానిచ్చారో అర్థంకావడం లేదు.


 బడుగు వర్గాలకు గుర్తింపేదీ?:గంగాధర్
-   రాష్ట్ర కాంగ్రెస్‌లో ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గం చేతిలోనే పూర్తి అధికారం పెట్టి, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను పార్టీ చిన్నచూపు చూస్తోంది.
 -   ప్రస్తుతం సీమాంధ్ర ప్రాంతంలోని రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలంతా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. మర్రి చెన్నారెడ్డి హయాం నుంచి ఇదే తంతు సాగుతోంది. అధికారం అనుభవిస్తున్న రెడ్లు అవకాశవాదంతో పార్టీని వీడుతున్నా, పార్టీ వారికే ప్రాధాన్యమిస్తోంది.
- అడ్డుతగిలిన పొంగులేటి...రెడ్డి సామాజికవర్గంపై మాదాసు మాట్లాడుతున్నప్పుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి అడ్డుతగిలి ‘రాహుల్‌జీ! ఆయన తప్పు మాట్లాడుతున్నారు. ఒక సామాజికవర్గాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడటం సరికాదు. అదే సామాజికవర్గంలో అంకితభావంతో పనిచేస్తూ, ఆస్తులు పోగొట్టుకున్నవారూ, పదవులు పొందకున్నా నిజాయితీతో పనిచేస్తున్నవారూ ఉన్నారు. బలహీనవర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. దానిని కాదనం...’ అని చెబుతుండగా, రాహుల్ కల్పించుకుని మాదాసును ఉద్దేశిస్తూ ‘యే భీ రెడ్డి హై నా’ అని ముక్తాయించారు.
 
 మహిళా బిల్లును ఆమోదించాలి: శారద
 -   రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లుగా అధికారంలో ఉన్నా, మహిళలకు ప్రాధాన్యం దక్కలేదు.
-   యూపీఏ సర్కారు పలు కీలకమైన బిల్లులను తెచ్చినా, మహిళా రిజర్వేషన్ బిల్లు మాత్రం ఇంకా ఆమోదానికి నోచుకోలేదు. దీనిని ఆమోదిస్తే, మహిళలంతా కాంగ్రెస్ వైపే ఉంటారు.


 అవినీతిపై రాజీ వైఖరిని ఎత్తిచూపిన నేతలు...
 ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలు సైతం అంతర్గత కుమ్ములాటలను, పార్టీ కోసం పనిచేసే కిందిస్థాయి కార్యకర్తలకు గుర్తింపు దక్కకపోవడాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. కొందరు నేతలు అవినీతిపై పార్టీ రాజీవైఖరిని ఎత్తిచూపారు. జార్ఖండ్‌లో కళంకిత నాయకుడు శిబు సొరేన్ నేతృత్వంలోని జేఎంఎంతో పొత్తు పెట్టుకోవడాన్ని వారు ఉదహరించారు.
 -    బీజేపీతో పోలిస్తే ప్రచారానికి పార్టీ పెడుతున్న ఖర్చు నామమాత్రంగా ఉందంటూ గుజరాత్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలే దానిని భర్తీ చేయాలని, యూపీఏ సాధించిన విజయాలపై ప్రచారం చేయాలని రాహుల్ వారికి సూచించారు.
 -    ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇవ్వడంపై పలువురు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
 
 రాహుల్ ‘అశ్వ’జ్ఞానం
 రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలతో జరిపిన చర్చల్లో రాహుల్ ‘అశ్వ’జ్ఞానాన్ని ప్రదర్శించారు. ‘గుర్రాల్లో రెండు రకాలుంటాయి. ఒకరకం గుర్రాలు రేసుల్లో పరుగులు తీస్తాయి. మరోరకం గుర్రాలు ఊరేగింపులకు ఉపయోగపడతాయి. కొన్నిసార్లు ఒకరకం గుర్రాన్ని వేరేరకం పనికి వాడుకోవడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయి’ అని అన్నారు. 

Advertisement
Advertisement