‘విమానం’.. విషాదాంతం | Sakshi
Sakshi News home page

‘విమానం’.. విషాదాంతం

Published Wed, Dec 31 2014 12:45 AM

జావా సముద్ర జలాలపై తేలియాడుతున్న మృతదేహాన్ని హెలికాప్టర్ లోకి చేరవేసేందుకు యత్నిస్తున్న సిబ్బంది

* సముద్రంలో కూలిన ఎయిర్ ఆసియా విమానం
* తేలుతూ కనిపించిన మృతదేహాలు, విమాన శకలాలు
* మూడు మృతదేహాల వెలికితీత
* అలలతో గాలింపునకు ఆటంకం

జకర్తా/సింగపూర్: ఎయిర్ ఆసియా విమాన అదృశ్య ఉదంతం విషాదాంతమైంది. అందులో ప్రయాణిస్తున్నవారి కుటుంబ సభ్యులు, బంధువుల ప్రార్థనలు ఫలించలేదు. ఆ విమానం జావా సముద్రంలో కూలిపోయినట్లు మంగళవారం నిర్ధారణ అయింది. గాలింపు సిబ్బందికి జావా సముద్రజలాలపై బోర్నియోకు దగ్గరలో ఆ విమాన శకలాలు, ఉబ్బిపోయిన కొన్ని మృతదేహాలు కనిపించాయి.

ఆదివారం ఉదయం ఇండోనేసియా నుంచి సింగపూర్‌కు వెళ్తున్న ఎయిర్‌బస్ సురబయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన కాసేపటికే ఏటీసీతో సంబంధాలు తెగిపోయి అదృశ్యవడం తెలిసిందే. ఏడుగురు సిబ్బంది సహా మొత్తం 162 మంది ఆ విమానంలో ఉన్నారు. వారిలో 149 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఇండోనేసియా వారే.

అప్పటినుంచి మలేసియా, సింగపూర్, ఆస్ట్రేలియాల సహకారంతో ఇండోనేసియా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టింది. గాలింపులో 30 నౌకలు, 15 విమానాలు, 7 హెలికాప్టర్లు పాలు పంచుకున్నాయి. అయితే, ఇప్పటికీ ప్రమాద కారణం మిస్టరీగానే ఉంది. ఇప్పటివరకు 3 మృతదేహాలను(ఇద్దరు పురుషులు, ఒక మహిళ) మాత్రమే వెలికితీశామని, అంతకుముందు  ఇండోనేసియా నేవీ ప్రకటించినట్లుగా 40 మృతదేహాలను కాదని గాలింపు, సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్న ఇండోనేసియా గాలింపు, సహాయక సంస్థ చీఫ్ బాంబంగ్ సొలిస్టో  తెలిపారు. మరిన్ని మృతదేహాల కోసం గాలింపు కొనసాగిస్తున్నామన్నారు.

ప్రతికూల వాతావరణంతో పాటు 2, 3 మీటర్ల ఎత్తున ఎగుస్తున్న అలలు గాలింపు చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయన్నారు. మృతదేహాల వెలికితీత కోసం ఘటనాస్థలంలోకి  ఇండోనేసియా యుద్ధనౌక, అమెరికాకు చెందిన మరో విమాన విధ్వంసక నౌకలు వెళ్తున్నాయి.అంతకుముందు, ఇండోనేసియా వైమానిక దళ విమానం సెంట్రల్ కాళిమంథన్ సమీపంలోని కరిమట సంధి వద్ద జావా సముద్ర అడుగుభాగంలో విమాన ఆకారంలో ఉన్న ఒక నీడను గుర్తించింది.

అక్కడే విమాన శకలాలనూ గుర్తించడంతో దాంతో ఆ ప్రాంతంలో గాలింపును కేంద్రీకృతం చేశామని  తెలిపారు. అదే ప్రాంతంలో ఆదివారం ఉదయం భారీ శబ్దాన్ని, కొన్ని పేలుళ్లను విన్నామని స్థానిక జాలర్లు కూడా చెప్పారన్నారు.

విషాదంలో కుటుంబ సభ్యులు
ఏటీసీతో సంబంధాలు తెగిన సమయంలో విమానం ఉన్న ప్రాంతానికి దగ్గరలోని సముద్ర జలాల్లోనే విమాన శకలాలు కనిపించాయి. వాటిలో విమాన అత్యవసర ద్వారం,  కార్గో డోర్, లగేజ్ బ్యాగ్ ఉన్నాయి.

ఈ సమాచారం తెలియగానే మృతుల బంధువులు విషాదంలో మునిగిపోయారు. సాగరంపై తేలుతున్న మృతదేహాలను టీవీల్లో చూస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. వారికి ఇండోనేసియా అధ్యక్షుడు విడొడో, ఎయిర్ ఆసియా గ్రూప్ సీఈఓ ఫెర్నాండెజ్ సానుభూతిని వ్యక్తం చేశారు.

మరో విమానానికి తప్పిన ముప్పు
 కాగా, మనీలా నుంచి 159 మంది ప్రయాణికులతో ఫిలిప్పీన్స్‌లోని సెంట్రల్ ప్రావిన్స్‌కు వచ్చిన ఎయిర్‌ఆసియా జెస్ట్ విమానం మంగళవారం బలమైన గాలుల వల్ల రన్ వే నుంచి పక్కకు వెళ్లింది. అయితే ఎలాంటి ప్రమాద ప్రమాదం జరగలేదు. సోమవారం ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి హొబ్బర్ట్‌కు వెళ్తున్న ఓ చిన్న ఓ విమానం సముద్రంలో కూలిన ఘటనలో గల్లంతైన ఇద్దరి జాడ తెలియరాలేదు.

యుద్ధవిమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
జైపూర్: భారత వాయుసేన చెందిన ఓ యుద్ధవిమానం అత్యవసర పరిస్థితుల్లో మంగళవారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో సంగానర్ విమానాశ్రయంలో దిగింది. ఆగ్రా నుంచి జోధ్‌పూర్‌కు వెళుతున్న ఐఎల్-76 విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ ఏటీసీ అనుమతితో విమానాన్ని సంగానర్ విమానాశ్రయంలో సురక్షితంగా దించేశారు.

Advertisement
Advertisement