‘అజ్మీర్‌’ దోషులకు జీవితఖైదు | Sakshi
Sakshi News home page

‘అజ్మీర్‌’ దోషులకు జీవితఖైదు

Published Thu, Mar 23 2017 2:30 AM

‘అజ్మీర్‌’ దోషులకు జీవితఖైదు - Sakshi

నిర్దోషులుగా అసీమానంద్, సాధ్వీ
జైపూర్‌/సాక్షి, హైదరాబాద్‌: అజ్మీర్‌ దర్గాలో పేలుళ్లకు పాల్పడిన కేసులో భవేశ్‌ పటేల్‌(39), దేవేంద్ర గుప్తా(41)లకు జీవిత ఖైదు విధిస్తూ ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం తీర్పునిచ్చింది. పటేల్‌కు రూ.10వేలు, గుప్తాకు రూ.5వేల జరిమానా విధించింది. స్వామి అసీమానంద్, ప్రజ్ఞా సాధ్వీలను నిర్దోషులుగా విడుదల చేసింది. 2007 అక్టోబర్‌ 11న అజ్మీర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్‌ చిస్తీ దర్గాలో పేలుళ్లలో ముగ్గురు చనిపోగా, 15 మంది గాయపడ్డారు.

 ఈ కేసులో విచారణ ప్రారంభించిన రాజస్తాన్‌ ఏటీఎస్‌ తర్వాత కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు(ఎన్‌ఐఏ) బదిలీ చేసింది. కోర్టు మార్చి 8న పటేల్, గుప్తా, సునీల్‌ జోషీలను దోషులుగా నిర్ధారించింది. పేలుళ్లలో ఇంద్రేశ్‌ కుమార్, ప్రజ్ఞా సాధ్వీ, జయంత్‌ భాయ్, ప్రిన్స్, రమేశ్‌ గొహిల్, స్వామీ అసీమానంద్‌ పాత్రపై సరైన ఆధారాలు లేవని ఎన్‌ఐఏ తన తుది నివేదికలో కోర్టుకు తెలిపింది. దేవేంద్రగుప్త.. హైదరాబాద్‌లోని మక్కా మసీదులో పేలుడు కేసులో నింది తుడు. 2007 మే 18న మక్కా మసీదులో పేలిన బాంబు, అజ్మీర్‌ దర్గాలో పేలింది ఒకే తరహాకు చెందినవని నిపుణులు తేల్చారు. ఈ రెండు విధ్వంసాలకు ఒడిగట్టింది ఒకే ఉగ్రవాద మాడ్యుల్‌ అని గుర్తించారు. ప్రస్తుతం మక్కా మసీదులో బాంబు పేలుడు కేసు కోర్టు విచారణలో ఉంది.

‘అజ్మీర్‌’ మృతుల్లో హైదరాబాద్‌వాసి..
అజ్మీర్‌ దర్గా పేలుడులో మరణించిన వారిలో హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ సలీమ్‌ (42) ఉన్నారు. టోలిచౌకిలోని నదీమ్‌కాలనీకి చెందిన ఆయన అజ్మీర్‌ దర్గా సమీపంలో ఉన్న దర్గా బజార్‌లో గాజుల వ్యాపారం నిర్వహించేవాడు. ఆయన కుటుంబం మాత్రం నగరంలోనే ఉండేది. పేలుడు జరిగిన రోజు సాయంత్రం ప్రార్థనల కోసం దర్గాకు వెళ్ళారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement