బాబాయ్‌ నేమ్‌ ప్లేట్‌ను పీకేశారు | Sakshi
Sakshi News home page

బాబాయ్‌ నేమ్‌ ప్లేట్‌ను పీకేశారు

Published Sun, Jan 1 2017 5:18 PM

బాబాయ్‌ నేమ్‌ ప్లేట్‌ను పీకేశారు

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌-రాంగోపాల్‌ యాదవ్‌, ములాయం సింగ్‌ యాదవ్‌-సోదరుడు శివపాల్‌ యాదవ్‌ గ్రూపుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకోవడంతో లక్నోలోని సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఆదివారం అఖిలేష్ మద్దతుదారులు భారీ సంఖ్యలో పార్టీ కార్యాలయానికి తరలిరాగా, ములాయం వర్గీయులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అక్కడ పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.

అఖిలేష్‌ మద్దతుదారులు కార్యాలయంలోకి ప్రవేశించి ఆయన బాబాయ్‌ శివపాల్‌ యాదవ్‌ ఆఫీసు బయట ఉన్న ఆయన నేమ్‌ ప్లేట్‌ను తొలగించారు. ములాయం, శివపాల్‌ యాదవ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అఖిలేష్‌ ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అయినందుకు ఆయన మద్దతుదారులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. కాగా అఖిలేష్ పోలీసుల సాయంతో పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని శివపాల్‌ మద్దతుదారులు ఆరో్పించారు.

అఖిలేష్ గ్రూపు ఈ రోజు జాతీయ స్థాయ సమావేశం నిర్వహించి ములాయం సింగ్‌ స్థానంలో ఆయన్ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకుంది. యూపీ ఎస్పీ అధ్యక్షుడిగా ఉన్న శివ్‌పాల్‌ యాదవ్‌ను పదవి నుంచి తొలగించి, ములాయంకు సన్నిహితుడైన అమర్‌సింగ్‌పై వేటు వేశారు. యూపీ పార్టీ శాఖ అధ్యక్షుడిగా నరేష్‌ ఉత్తమ్‌ పటేల్‌ను నియమించారు. ఈ నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్‌ యాదవ్‌ను ములాయం సింగ్‌ పార్టీ నుంచి మళ్లీ బహిష్కరించారు. అఖిలేష్‌కు మద్దతు తెలిపిన పార్టీ సీనియర్‌ నేతలు నరేష్‌ అగర్వాల్‌, కిరణ్మయి నందాలపై కూడా వేటు వేశారు.

Advertisement
Advertisement