ఐదుగురూ గెలిచారు! | Sakshi
Sakshi News home page

ఐదుగురూ గెలిచారు!

Published Mon, Jun 1 2015 7:07 PM

ఐదుగురూ గెలిచారు! - Sakshi

తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీచేసిన ఐదుగురు అభ్యర్థులూ విజయం సాధించారు. శాసన మండలిలోని ఆరు ఖాళీ స్థానాలకు సోమవారం నిర్వహించిన ఎన్నికల్లో.. టీఆర్ఎస్ ఐదు స్థానాలను, కాంగ్రెస్ పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి ఓడిపోయారు. టీడీపీ - బీజేపీ ఎమ్మెల్యేల ఓట్లలో ఐదు 'నోటా'కు పడ్డాయి. అయితే ఇవి బీజేపీ ఎమ్మెల్యేలు వేసినవా, టీడీపీ వాళ్లు వేసినవా అనేది తెలియడంలేదు. కాంగ్రెస్ నుంచి మొత్తం 18 ఓట్లు ఆకుల లలితకే పడ్డాయి.

వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీకి నలుగురు అభ్యర్థులను మాత్రమే గెలిపించుకునేందుకు తగినంత బలం ఉంది. కానీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.. ఎలాగైనా ఐదుగురినీ గెలిపించాల్సిందేనని, లేకపోతే అసెంబ్లీని సైతం రద్దుచేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్తానని కూడా పార్టీ అంతర్గత సమావేశాల్లో హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈలోపు నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటును కొనుగోలు చేసేందుకు వెళ్లిన టీ-టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి దొరికిపోవడం లాంటి సంచలన విశేషాలు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగానే జరిగాయి.

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు..
కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, బి.వెంకటేశ్వర్లు, నేతి విద్యాసాగర్‌, కె.యాదవ్రెడ్డి (టీఆర్‌ఎస్‌)
ఆకుల లలిత (కాంగ్రెస్‌)


తెలంగాణ అసెంబ్లీలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేతో కలిపి మొత్తం 120 మంది సభ్యులున్నారు. వీరిలో ఇద్దరు వామపక్ష సభ్యులు ఓటింగుకు దూరంగా ఉన్నారు. మొత్తం 118 మంది (రేవంత్రెడ్డి సహా) తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement