నివేదిక ప్రకారమే ‘వాద్రా’పై చర్య | Sakshi
Sakshi News home page

నివేదిక ప్రకారమే ‘వాద్రా’పై చర్య

Published Sat, Apr 29 2017 2:58 AM

నివేదిక ప్రకారమే ‘వాద్రా’పై చర్య - Sakshi

చండీగఢ్‌: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా కంపెనీలకు భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ధింగ్రా కమిటీ నివేదిక ప్రకారమే చర్యలు తీసుకుంటామని హరియాణా సీంఎ మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ స్పష్టం చేశారు.  నివేదికలోని అంశాలు బహిర్గతమయ్యాయన్న కాంగ్రెస్‌ ఆరోపణలను తోసిపుచ్చారు. 2008లో జరిగిన భూ కేటాయింపుల వ్యవహారంలో వాద్రాపై కమిటీ నేరాభియోగాలు మోపిందని మీడియాలో వార్తలు రావడంతో ఆయనస్పందించారు.

వాద్రా కంపెనీలకు లబ్ధిచేకూర్చడానికి కుట్ర జరిగిందని కమిటీ నిర్ధారించినట్లు ఓ దిన పత్రికలో కథనం ప్రచురితమైంది. వాద్రా కొన్న ఆస్తులపైనా విచారణ జరపాలని కమిటీ నిర్ణయించినట్లు వెల్లడించింది. మరోవైపు, తన భర్త వ్యాపార లావాదేవీలతో తనకేం సంబంధంలేదని వాద్రా భార్య ప్రియాంక గాంధీ ప్రకటించారు. డీఎల్‌ఎఫ్‌ నుంచి స్వీకరించిన సొమ్ము నుంచి తన భార్య ఫరీదాబాద్‌లో ఆస్తులు కొన్నారా అని వాద్రాను విలేకర్లు ప్రశ్నించడంపై ప్రియాంక కార్యాలయం స్పందించింది.

వాద్రా కంపెనీ స్కైలైట్‌ హాస్పిటాలిటీకి భూ కేటాయించడానికి ఆరేళ్ల క్రితమే ప్రియాంక ఫరీదాబాద్‌లోని అమీపూర్‌ గ్రామంలో రూ.15 లక్షలకు 5 ఎకరాలు కొన్నారంది. నివేదిక ‘లీక్‌’పై కాంగ్రెస్, బీజేపీ విమర్శలు గుప్పించుకున్నాయి. వాద్రాపై రాజకీయ కక్షతోనే కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉద్దేశపూర్వకంగానే నివేదికలోని కొన్ని విషయాలని లీక్‌ చేస్తోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ ఆరోపణలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఖట్టర్‌ తోసిపుచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement