Sakshi News home page

ఉచితంగా 21 విమానాల్లో 13 దేశాలకు....

Published Thu, Apr 9 2015 5:37 PM

ఉచితంగా 21 విమానాల్లో 13 దేశాలకు....

మెక్సికోలో టెంపరరీ ఉద్యోగం చేస్తున్న అమెరికా జాతీయుడు, రచయిత 28 ఏళ్ల స్కాట్ కేయస్... రెండు నెలల కాలంలో  21 విమానాల్లో 20 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి 13 దేశాలను సందర్శించారు. ఇదంతా తిరిగి రావడానికి బోలెడు డబ్బు ఖర్చయిందనుకుంటాం. ఐదు పైసలు కూడా ఖర్చు కాకుండా ఉచితంగానే ఇవన్ని చుట్టొచ్చానని, పోటీ కారణంగా వివిధ విమాన సర్వీసులు అందిస్తున్న స్కీములను, 25 క్రెడిట్ కార్డులపై వచ్చిన పాయింట్లను ఉపయోగించుకున్నానని పలు ఆంగ్ల పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో  చెప్పారు. తన ఈ ప్రయాణంలో మెక్సికో, నికరాగువా, ట్రినిడాడ్, సెయింట్ లూయీస్, గ్రెనడా, జర్మనీ, చెక్ రిపబ్లిక్, యుక్రెయిన్, బల్గేరియా, గ్రీస్, మెసెడోనియా, లూథియాన, ఫిన్‌లాండ్ దేశాలను సందర్శించానని తెలిపారు.

అంతేకాకుండా అన్ని దేశాల్లోనూ విమానయాన సంస్థల ద్వారా ఉచిత భోజనం, లగ్జరీ వసతి, వై-ఫై సౌకర్యాలను సద్వినియోగం చేసుకున్నానని చెప్పారు. విమాన సర్వీసుల మధ్య విరామ సమయాన్ని బట్టి ఆయా దేశాల్లో సైట్ సీయింగ్‌కు వెళ్లానని, వాటికి కూడా తక్కువే ఖర్చుపెట్టానని, మొత్తం టూర్‌లో ఎక్కడ బయట బస చేయలేదని, విమానయాన సంస్థలు కేటాయించిన హోటళ్లలోనే గడిపానని ఆయన చెప్పుకొచ్చారు. కొన్ని దేశాల్లో 'స్పా' సర్వీసులను కూడా అద్భుతంగా ఆనందించానని చెప్పారు. కొన్నిచోట్ల మాత్రం అతి తక్కువ చార్జీలు గల విమానాలు ఎక్కాల్సి వచ్చిందని, వాటికి కూడా ఒక్కో దానికి 20 డాలర్లకు మించి ఖర్చు చేయలేదని తెలిపారు.

తన మొత్తం టూర్‌ను ప్లాన్ చేసుకోవడానికి తనకు 10-12 గంటల సమయం పట్టిందని, తన తదుపరి పర్యటనలో 42 దేశాలు సందర్శించేందుకు ప్లాన్  చేస్తున్నానని చెప్పారు. విమాన సర్వీసుల స్కీములను, క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే పాయింట్లపై సరైన అవగాహన ఏర్పరుచుకొని వాటిని సరైన పద్ధతిలో సద్వినియోగం చేసుకుంటే ప్రపంచంలో ఎవరైనా తనలా ఉచితంగా ప్రపంచాన్ని చుట్టి రావచ్చని అన్నారు. 'హౌ టు ఫ్లై ఫర్ ఫ్రీ, హౌ టూ ఫైండ్ చీప్ ఫ్లైట్' అనే పుస్తకాలు రాస్తున్నానని, వాటిని త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నానని, వాటి ద్వారా తాను ఎలా టూర్‌లు ప్లాన్ చేసిందీ పూర్తిగా వివరిస్తానని ఆయన చెప్పారు.

Advertisement
Advertisement