ఏ నిబంధనల ప్రకారం తొలగించారు | Sakshi
Sakshi News home page

ఏ నిబంధనల ప్రకారం తొలగించారు

Published Thu, Sep 3 2015 3:11 AM

ఏ నిబంధనల ప్రకారం తొలగించారు - Sakshi

సాక్షి, హైదరాబాద్: శాసనసభ లాబీల్లో ఉన్న దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో తొలగింపుపై విపక్ష వైఎస్సార్‌సీపీ భగ్గుమంది. ఏ నిబంధనల ప్రకారం ఫొటోను తొలగించారని నిలదీసింది. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు సభ ప్రారంభమైన వెంటనే.. రైతుల ఆత్మహత్యలు, తాగునీటి ఎద్దడి మీద ప్రతిపక్షం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించి, ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. వాయిదా తీర్మానాన్ని అనుమతించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది.

దివంగత నేత వైఎస్సార్ ఫొటోలను ప్రదర్శిస్తూ ఆ పార్టీ సభ్యులు తమ స్థానాల్లో నిలబడి నిరనస వ్యక్తం చేశారు. వైఎస్సార్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. వ్యక్తిగత ఇష్టాఇష్టాలను సభలో ప్రతిబింబించకూడదని, ఫొటోల ప్రదర్శనను ఉపసంహరించుకోవాలని స్పీకర్ సూచించారు. అందుకు విపక్ష సభ్యులు అంగీకరించలేదు.చివరకు వైఎస్సార్‌సీపీ ఉప నేత జ్యోతుల నెహ్రూకు మాట్లాడే అవకాశం ఇచ్చారు.

రాష్ట్ర ప్రజలంతా మానవతావాదిగా గుర్తించిన వైఎస్... అని ఆయన కొనసాగిస్తుండగా మైక్ కట్ చేశారు. ‘‘కరువు మీద వాయిదా తీర్మానం ఇచ్చారు. వైఎస్‌పై మాట్లాడేందుకు కాదు. తగిన రూపంలో నోటీస్ ఇచ్చి మాట్లాడితే అభ్యంతరం లేదు’’ అని స్పీకర్ తెలిపారు. ‘‘ఆ మహనీయుడి దారిలో నడిచి ఉంటే రాష్ట్రంలో కరువు పరిస్థితులు వచ్చేవే కాదు. వైఎస్సార్ ఫోటోను అసెంబ్లీ లాబీల్లో నుంచి తొలగించడం ఆవేదనకు గురి చేసింది’’ అని జ్యోతుల స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు.

ఫొటో తొలగింపులో నిబంధనలు ఉల్లంఘించలేదని స్పీకర్ సమాధానం ఇచ్చారు.తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ విపక్ష సభ్యులు వైఎస్ ఫొటోలు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగారు. దీంతో  10 నిమిషాలపాటు సభ వాయిదా పడింది.
 
జీరో అవర్‌లోనూ.. : ప్రశ్నోత్తరాల తర్వాత మొదలైన జీరో అవర్‌లో ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. అసెంబ్లీ లాబీల్లో ఎవరో వైఎస్సార్ ఫొటోలు అంటించారని, వారి మీద చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీనికి జ్యోతుల నెహ్రూ స్పందిస్తూ.. అసెంబ్లీ లాంజ్‌లో ఉన్న వైఎస్సా ర్ ఫొటోను తీసేయడానికి ఏ నిబంధనలు అనుమతించాయని ప్రశ్నించారు. గత శాసనసభ ఆమోదం, అప్పటి స్పీకర్ నిర్ణయంతో ఏర్పాటు చేసిన ఫోటోను ఎలా తొలగిస్తారన్నా రు.

వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా లాంజ్‌లో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించామని వెల్లడించారు. స్పీకర్ జోక్యం చేసుకొని.. ఫొటో తొలగింపు నేపథ్యం వివరించారు. లాంజ్‌లో ఫొటో పెట్టాలంటే  సభ ఆమోదం, జనరల్ పర్పస్ కమిటీ తీర్మానం ఉండాలన్నారు. కమిటీ భేటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామనీ తెలిపారు.
 
అసెంబ్లీ లాంజ్‌లో ఎమ్మెల్యేల నివాళి
అసెంబ్లీలో నిరసన తెలిపి బయటకు వచ్చిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలందరూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటోలను చేతబట్టుకుని అసెంబ్లీ లాబీల్లో నుంచి లాంజ్‌కు వెళ్లారు. ఎక్కడి నుంచైతే వైఎస్సార్ ఫొటోను తొలగించారో అదే ప్రదేశంలో ఒక ఫొటోను అతికించారు. ఆ తరువాత ఒక బల్లపై వైఎస్సార్ ఫొటోను పెట్టి ఆయనకు పూలు చల్లి నివాళులర్పించారు.

Advertisement
Advertisement