మదుపర్లకు తీపి‘మాత్ర’! | Sakshi
Sakshi News home page

మదుపర్లకు తీపి‘మాత్ర’!

Published Sat, Nov 23 2013 1:26 AM

మదుపర్లకు తీపి‘మాత్ర’!

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రానికి చెందిన ఫార్మా షేర్లు ఇన్వెస్టర్లకు సిరుల వర్షం కురిపించాయి. గడచిన నాలుగేళ్ళలో స్టాక్ మార్కెట్లు భారీ ఒడిదుడుకులకు గురైనప్పటికీ రాష్ట్రానికి చెందిన దాదాపు అన్ని ఫార్మా కంపెనీలు ఇండెక్స్‌లను మించి లాభాలను అందించాయి. ఈ సమయంలో కొన్ని కంపెనీల షేర్లు 12 నుంచి 19 రెట్లకు పైగా పెరిగాయి. అత్యధిక లాభాలను అందించిన షేర్లలో నాట్కో ఫార్మా అన్నిటికన్నా ముందుంది. 2008లో రూ.38 కనిష్ట స్థాయి నుంచి ఆగకుండా పెరుగుతూ ఇప్పుడు రూ.774 వద్ద ట్రేడ్ అవుతోంది. అంటే కనిష్ట స్థాయి నుంచి ఈ షేరు 19.36 రెట్లు పెరిగింది. ఆ తర్వాత అరబిందో ఫార్మా 12.43 రెట్లు, సువెన్ లైఫ్ 6.76 రెట్లు, డాక్టర్ రెడ్డీస్ 5.79 రెట్లు పెరిగాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 2008 గరిష్ట స్థాయి వద్ద కదులుతుంటే రాష్ట్రానికి చెందిన ఫార్మా కంపెనీల షేర్లు 2008 స్థాయికి అందనంత ఎత్తులో ట్రేడవుతున్నాయి. ఉదాహరణకు 2008లో మార్కెట్ పతనం కాకముందు రూ.700 (1:1 బోనస్ తర్వాత)గా ఉన్న డాక్టర్ రెడ్డీస్ షేరు  ఇప్పుడు రూ.2,500 స్థాయికి చేరింది.
 
 కలిసొచ్చిన అంశాలనేకం
 ఈ నాలుగేళ్లలో ఫార్మా షేర్ల దూకుడుకు అనేక అంశాలు కలిసొచ్చాయంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. సాధారణంగా మార్కెట్లు పడుతున్నప్పుడు ఇన్వెస్టర్లు డిఫెన్సివ్ సెక్టార్లయిన ఫార్మా, ఎఫ్‌ఎంసీజీలకేసి చూస్తారని, అయితే ఇదే సమయంలో రూపాయి పతనం ఈ రంగానికి మరింత కలిసొచ్చిందంటున్నారు. గత నాలుగేళ్లుగా దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయాల్లో సగటున 20 శాతానికిపైగా వృద్ధి నమోదయ్యింది. అంతే కాకుండా మన ఫార్మా కంపెనీలు విదేశీ వ్యాపారంపై అధికంగా దృష్టిసారించడం, అనేక పేటెంట్ కేసుల్లో విజయం సాధించాయి.
 
 ఈ నాలుగేళ్ళలో నాట్కో ఫార్మా  సాధించిన విజయాలే ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించేటట్లు చేసిందంటున్నారు మార్కెట్ నిపుణులు ఈ నాలుగేళ్లలో నాట్కో ఫార్మా రిజాట్రిప్టాన్ బెంజోయేట్ తదితర ఔషధాలను ప్రవేశపెట్టడం, స్లెరోసిస్ చికిత్సలో ఉపయోగపడే కొపాగ్జోన్ ఔషధం పేటెంటు వివాదంలో టెవా ఫార్మాపై విజయం,  క్యాన్సర్ ఔషధం నెక్సావర్ జనరిక్ వెర్షన్ విషయంలో కంపల్సరీ లెసైన్సు దక్కించుకోవడం వంటి అంశాలు షేరు పెరుగుదలకు కారణమయ్యయి.  ఇక డాక్టర్ రెడ్డీస్ విషయానికి వస్తే ఈ కాలంలో అధిక మార్జిన్లు ఉన్న కొత్త ఔషధాలను ప్రవేశపెట్టడం కలిసొచ్చింది. డోన్‌పెజిల్, డివాల్‌ప్రొయెక్స్ ఈఆర్ వంటి ఔషధాల్లో ఏకైక జనరిక్ సంస్థగా నిలబడటమే కాకుండా  పోటీ తక్కువగా ఉండి మార్జిన్లు అధికంగా ఉండే ఔషధాలపై సంస్థ ప్రధానంగా దృష్టి సారిస్తోంది. దీంతో ఈ షేరు ధర కొత్త రికార్డులను సృష్టిస్తోంది.
 
 చిన్న ఫార్మా షేర్లే ముద్దు
 ఇప్పటికే ఫార్మా షేర్లు బాగా పెరగడంతో వచ్చే రోజుల్లో  కూడా ఇదే స్థాయి లాభాలను ఆశించడం కష్టమేనని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడి స్టాక్ మార్కెట్లలో ర్యాలీ మొదలైతే డిఫెన్సివ్ సెక్టార్ అయిన ఫార్మా నుంచి ఇన్వెస్టర్లు వైదొలగుతారని, కానీ ఇప్పటికీ కొన్ని చిన్న ఫార్మా షేర్లు ఆకర్షణీయంగా  ఉన్నాయంటున్నారు. రూపాయి విలువ క్షీణత, ఎగుమతులు వంటి అంశాలు ఫార్మా కంపెనీలకు కలిసొచ్చే అంశాలు కావడంతో ఈ రంగంలో పెట్టుబడులను కొనసాగించనున్నట్లు ఇండియా ఇన్ఫోలైన్ తెలిపింది. ఈ సమయంలో పెద్ద ఫార్మా షేర్లలో కంటే చిన్న వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం బెటరని, ఎంపిక చేసిన చిన్న ఫార్మా కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించమని జెన్‌మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి సూచిస్తున్నారు.

Advertisement
Advertisement