హామీలు, ప్రత్యేక హోదా.. రెండూ హక్కే | Sakshi
Sakshi News home page

హామీలు, ప్రత్యేక హోదా.. రెండూ హక్కే

Published Sun, Oct 11 2015 4:46 PM

హామీలు, ప్రత్యేక హోదా.. రెండూ హక్కే - Sakshi

సాక్షి, హైదరాబాద్: కనీసం రాజధాని కూడా లేకుండా అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తున్నప్పుడు రాష్ట్రప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, నిరసన వ్యక్తమయినపుడు అన్యాయాన్ని పూర్తిగా కాకపోయినా కొంత మేరకైనా సరిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో పలు హామీలు చేర్చింది. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి విభజన చట్టంలో పేర్కొన్న హామీలు సరిపోవన్న ఆందోళనలు పెరగడంతో ప్రత్యేక హోదా కూడా ఇవ్వడం ద్వారా రాష్ట్రాన్ని ఆదుకుంటామని పార్లమెంట్‌లో సాక్షాత్తూ అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ హామీ ఇచ్చిన విషయం విదితమే.

అంటే చట్టంలో పేర్కొన్న హా మీలు అమలు చేయడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత. వాటిని పొందడం రాష్ట్ర ప్రజల చట్టబద్దమైన హక్కు. ప్రత్యేక హోదా కూడా అంతే. హోదాను పొందడం ఆంధ్రప్రదేశ్ హక్కు. రాష్ట్ర బంగరు భవిష్యత్‌కు ఈ రెండూ అత్యావశ్యకం. ఈ రెండిం టిని సాధిస్తే రాష్ట్ర ప్రజలకు సంజీవినిలా ఉపయోగపడతాయి. అలా కాకుండా.. ఏ ఒక్కటి విస్మరించినా రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుంది.

హామీలకు ప్యాకేజీ ముసుగు
పార్లమెంట్ సాక్షిగా చట్టం ద్వారా సంక్రమించిన హామీలు అమలు చేస్తేనే.. రూ. 2 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూరుతుంది. ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీ లాంటి జాతీయ స్థాయి విద్యాసంస్థల ఏర్పాటు, మెట్రోరైల్ ప్రాజెక్టులు మొదలు భారీ నౌకాశ్రయాలు, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, విమానాశ్రయాలు, ఇండస్ట్రియల్ కారిడార్లు, పారిశ్రామిక ప్రాంతాలు, రాజధాని అభివృద్ధి, ఆర్థిక లోటు భర్తీ.. లాంటి హామీలను విభజన చట్టంలో పొందుపరిచారు. తప్పకుండా అమలు చేయాల్సిన హామీలను గాలికి విడిచి, ఆ హామీల్లో కొంత భాగానికి ప్యాకేజీ ముసుకు తొడిగే ప్రయత్నం చేస్తున్నారు.

ఆశ, శ్వాస హోదానే
మరోవైపు.. రాష్ట్ర భవిష్యత్‌కు అపర సంజీవిని లాంటి  ప్రత్యేక హోదాను పూర్తిగా పక్కకు పెట్టే ప్రయత్నం సాక్షాత్తూ ముఖ్యమంత్రి చేయడం పట్ల రాష్ట్ర ప్రజల్లో విస్మయం వ్యక్తమవుతోంది. రెండూ హక్కులే అయినప్పుడు.. ముందుండి పోరాడాల్సిన ముఖ్యమంత్రి, ఆ పని చేయకపోగా, పోరాడుతున్న ప్రతిపక్ష నేత జగన్‌కు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారు. ప్రత్యేక హోదా వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదని ముఖ్యమంత్రి అంటున్నారు. ప్యాకేజీ ద్వారానే ఎక్కువ నిధులు వస్తున్నప్పుడు.. హోదా ఎందుకని ప్రశ్నిస్తోన్న ముఖ్యమంత్రి..  చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేస్తే అంతకంటే ఎక్కువే నిధులు వస్తాయనే విషయాన్ని తెలివిగా పక్కకు తప్పిస్తున్నారు. ఈ ప్యాకేజీ ఏదో కొత్తగా సాధిస్తున్నట్లు ప్రజలను మభ్య పెడుతూ.. హామీలు, హోదాను అటకెక్కించే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నారు.

తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా సాధిస్తామంటూ ఊరూవాడా ప్రచారం చేసిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ‘ఓటుకు కోట్లు’ కేసులో బయటపడటానికి కేంద్ర ప్రభుత్వం ముందు సాగిలపడి హోదా అంశాన్ని ఫణంగా పెట్టారు. ఇదే చంద్రబాబు.. గత ఏడాది తిరుపతి ఎన్నికల ప్రచార సభలో.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు సరిపోదని, కనీసం 15 సంవత్సరాలు ఉండాలని చెప్పడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనం.

విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుకు నిధులు తెచ్చి, ప్రత్యేక హోదా సాధించిన తర్వాతే.. ఆయన చెబుతున్న ప్యాకేజీ గురించి మాట్లాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హోదా కోసం ప్రయత్నించకపోవడం, చట్టబద్దమైన హామీలకు ప్యాకేజీ ముసుగేయడం.. రాష్ట్రానికి అన్యాయం చేయడమేనని మేధావులు హెచ్చరిస్తున్నారు.

హామీల అమలు చట్టబద్ద హక్కు
విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుకు రూ. 2 లక్షల కోట్లు అవసరమని అంచనా. ఈ హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. విభజన చట్టంలోని హామీల అమలు ఆంధ్రప్రదేశ్ ప్రజల చట్టబద్దమైన హక్కు. ఈమేరకు కేంద్రం నిధులు ఇచ్చి తీరాల్సిందే. కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా.. ఈ హామీలు అమలు కావాలనే ఉద్దేశంతోనే వాటికి చట్టబద్దత కల్పించారు. అప్పటి అధికార, విపక్షాలతో చంద్రబాబు కుమ్మక్కై అన్యాయంగా రాష్ట్రాన్ని విభజనకు కారకులయ్యారు. ప్రజల నుంచి అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో.. హామీలతో పాటు ప్రత్యేక హోదా కూడా కల్పించాలని పార్లమెంట్ సాక్షిగా హామీ లభించిన విషయం తెలిసిందే.

ప్రజా ప్రయోజనాలు ఫణంగా..
విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుకు ప్రయత్నించకుండా.. ప్రత్యేక హోదా సాధనకు పోరాడకుండా.. ప్యాకేజీని టీడీపీ ప్రభుత్వ పెద్దలు తెర మీదకు తీసుకొచ్చారు. ప్యాకేజీ పేరుతో కేంద్రం నుంచి కొన్ని నిధులు తెచ్చుకొని.. విభజన చట్టంలోని హామీలను గాలికి వదిలి.. భారీ ప్రచారంతో ప్రజల మెదళ్ల నుంచి హోదా ఆకాంక్షలను తొలగించడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే కేంద్రం నుంచి భారీగా నిధులు రానున్నాయని, ప్రత్యేక హోదాను మించి లబ్ది జరగనుందని అసత్య ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం హక్కులయిన హామీల అమలు, హోదా సాధన.. రెండింటినీ విస్మరించి ప్రజా ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారు.

హోదా వస్తే..
రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కితే.. పెద్ద మొత్తంలో పెట్టుబడులు ప్రవహిస్తాయి.  యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక హోదా చేయూతనిస్తుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఆకర్షించడానికి, పారిశ్రామికంగా ముందడుగు వేయడానికి, మౌలిక సదుపాయాల కల్పనకు దోహదం చేస్తుంది.  రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధికి, శాశ్వత ఉపాధి అవకాశాలకు మార్గం ఏర్పడుతుంది.

90 శాతం గ్రాంట్లు.. 10 శాతం లోన్లు
సాధారణ రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే గాంట్లు 30 శాతం దాటవు. మిగతా 70 శాతాన్ని రాష్ట్రాలే భరిం చాలి. కానీ పత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 90 శాతం గ్రాంట్లుగా కేంద్ర సాయం అందుతుంది. గ్రాంట్లుగా ఇచ్చే సహాయాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. మిగతా 10% రాష్ట్రం భరిస్తే సరిపోతుంది. చాలా పథకాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టులకు రాష్ట్రం భరించాల్సిన 10 శాతాన్ని కూడా కేంద్రం రుణంగా సమకూరుస్తుంది.

సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) కింద మంజూరైన ప్రాజెక్టులకూ ఇది వర్తిస్తుంది. 90 శాతం ఖర్చును కేంద్రమే భరిస్తుంది. పారిశ్రామిక యూనిట్లకు నూటికి నూరు శాతం ఎకై్సజ్ డ్యూటీ మినహాయింపు లభిస్తుంది. ఫలితంగా రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులు ముందుకు వస్తారు.

Advertisement
Advertisement