మరో అర శాతం ‘వడ్డింపు'? | Sakshi
Sakshi News home page

మరో అర శాతం ‘వడ్డింపు'?

Published Mon, Sep 23 2013 1:03 AM

మరో అర శాతం ‘వడ్డింపు'?

 ముంబై: ఆర్‌బీఐ వడ్డీరేట్ల పెంపుపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్న విశ్లేషకులు.. రానున్న రోజుల్లో మరింత కఠిన విధానం ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా(మార్చిలోపు) కీలకమైన రెపో రేటును ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మరో అర శాతం వరకూ పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తొలి పాలసీ సమీక్షలోనే అనూహ్యంగా రెపో రేటును పెంచి అటు మార్కెట్ వర్గాలను, ఇటు ఆర్థికవేత్తలు, విశ్లేషకులను కూడా రాజన్ అవాక్కయ్యేలా చేశారు. ‘తాజా రెపో పెంపును చూస్తే... కొత్త ఆర్‌బీఐ గవర్నర్ కూడా వృద్ధి రేటు కంటే ధరలకు కళ్లెం వేయడంపైనే దృష్టిసారిస్తున్నారనేది స్పష్టమవుతోంది.  వచ్చే ఏడాది మార్చిలోపు మరో రెండు పాలసీ సమీక్షల్లో చెరో పావు శాతం చొప్పున రెపో రేటు పెంపు ఉండొచ్చని భావిస్తున్నాం. దీంతో ఇది 8 శాతానికి చేరనుంది’ అని బ్రిటిష్ బ్యాంకింగ్ దిగ్గజం స్టాండర్డ్ చార్టర్డ్ ఆర్థికవేత్తలు పేర్నొన్నారు.
 
  జపాన్ బ్రోకరేజి సంస్థ నోమురా కూడా వచ్చే మార్చిలోపే మరో అర శాతం రెపో పెంపును అంచనా వేసింది. ఈ ఏడాది పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించవచ్చని, అదేవిధంగా వచ్చే సంవత్సరంలో ముప్పావు శాతం రెపో కోత ఉండొచ్చని గతంలో నోమురా అభిప్రాయపడింది. ఇప్పుడు ఆర్‌బీఐ అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయంతో తాము కూడా అంచనాలను మార్చుకున్నట్లు నోమురా పేర్కొంది. కాగా, రానున్న నెలల్లో మరో రెండు విడతల్లో రెపో పెంపు ఉండొచ్చని క్రెడిట్ సుసీ ఆర్థికవేత్తలు కూడా అంచనా వేశారు. అయితే, ఎంతమేరకు పెంచొచ్చనేది వెల్లడించలేదు.
 ద్రవ్యోల్బణంపైనే గురి...
 ఈ నెల 20న జరిపిన మధ్యంతర త్రైమాసిక పాలసీ సమీక్షలో రెపో(బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి తీసుకునే నిధులపై చెల్లించే వడ్డీరేటు) రేటును రెండేళ్ల తర్వాత మొదటిసారిగా పావు శాతం పెంచడం తెలిసిందే. దీంతో ఇది 7.5 శాతానికి చేరింది. మరోపక్క, బ్యాం కులకు ద్రవ్యసరఫరా(లిక్విడిటీ) పెంచేలా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్‌ఎఫ్)లో ముప్పావు శాతం తగ్గించి(9.5 శాతానికి) కాస్త ఊరట కల్పించారు. ధరల కట్టడే ప్రధాన లక్ష్యమని, రానున్న పాలసీల్లో కూడా ద్రవ్యోల్బణం గణాంకాలే ప్రభావం చూపుతాయని రాజన్ పేర్కొనడం గమనార్హం. ఆగస్టులో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఆరు నెలల గరిష్టానికి(6.1%) ఎగబాకగా... రిటైల్ ద్రవ్యోల్బణం కూడా అధిక స్థాయిలోనే(9.52%)గా నమోదైంది. ఈ ద్రవ్యోల్బణం ఆందోళనలే రెపో పెంపునకు ముఖ్య కారణమని రాజన్ పేర్కొన్నారు.
 
 ఆర్‌బీఐ చర్యలతో రుణ, డిపాజిట్ రేట్లను పెంచక తప్పదని ఎస్‌బీఐ చైర్మన్ ప్రతీప్ చౌదరి పాలసీ సమీక్ష అనంతరం వ్యాఖ్యానించడం తెలిసిందే. రూపాయి విలువ స్థిరీకరణ జరిగితే...  ఎంఎస్‌ఎఫ్‌ను గత స్థాయికి తగ్గించే అవకాశం ఉందని నోమురా అంటోంది. రూపాయికి చికిత్సలో భాగంగా జూలైలో ఎంఎస్‌ఎఫ్‌ను ఆర్‌బీఐ రెండు శాతం పెంచి 10.25 శాతానికి చేర్చింది. దీనిలో తాజాగా ముప్పావు శాతం తగ్గింపును రాజన్ ప్రకటించారు. రెపో, ఎంఎస్‌ఎఫ్ మధ్య వ్యత్యాసాన్ని 1 శాతానికి తీసుకురావాల్సి ఉందని కూడా ఆయన పాలసీ సందర్భంగా పేర్కొనడం విదితమే. ప్రస్తుతం ఈ వ్యత్యాసం 2 శాతంగా ఉంది.
 

Advertisement
Advertisement