ఆంటోనీ నివేదిక సిద్ధం | Sakshi
Sakshi News home page

ఆంటోనీ నివేదిక సిద్ధం

Published Thu, Sep 26 2013 2:03 AM

ఆంటోనీ నివేదిక సిద్ధం - Sakshi

* కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ వెల్లడి
* టీడీపీ మనుగడ కోసమే కాంగ్రెస్‌పై బాబు విమర్శలు
* జగన్‌కు కోర్టు ద్వారా వచ్చిన బెయిల్‌ను కాంగ్రెస్‌కు అంటగట్టడం దారుణం

సాక్షి ప్రతినిధి, బెంగళూరు: రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత ప్రజల అభిప్రాయాలు, వారి సమస్యలను తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీ తన నివేదికను సిద్ధం చేసిందని కమిటీ సభ్యుడు, కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. కమిటీ నివేదికను కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీకి సమర్పిస్తామని, ఆమె ఓ మంచి నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. బుధవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ మేరకు వెల్లడించారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్‌ రావడానికి కాంగ్రెస్‌ పార్టీ కారణమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న ఆరోపణలను మొయిలీ ఖండించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జరిగిన వ్యవహారాన్ని కూడా కాంగ్రెస్‌కు అంటగట్టడం దారుణమన్నారు. తెలుగుదేశం పార్టీ మనుగడ కోసమే చంద్రబాబు.. కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. భవిష్యత్తులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు ఉంటుందా అని విలేకరులు అడగ్గా.. ‘‘ఉండవచ్చు.. ఉండకపోవచ్చు’’ అని బదులిచ్చారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు విధిగా ‘ఆధార్‌’ కార్డును కలిగి ఉండాలనే నిబంధన సరికాదని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. ఆధార్‌ ఆవశ్యకతను, ప్రయోజనాలను కోర్టుకు వివరిస్తామని మొయిలీ తెలిపారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, వ్యక్తిగత గుర్తింపు కచ్చితత్వానికి ఎంతో అవసరమని తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement