నేటి నుంచి ఏపీ అసెంబ్లీ.. | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ..

Published Mon, Mar 6 2017 5:16 AM

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ.. - Sakshi

తాత్కాలిక భవన సముదాయంలో ప్రారంభం కానున్న సమావేశాలు
సాక్షి, అమరావతి: ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి సుమారు మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో తొలిసారిగా తాత్కాలిక అసెంబ్లీలో శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం పక్కనే నిర్మించిన తాత్కాలిక శాసనసభా ప్రాంగణంలో సోమవారం తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి.

ప్రభుత్వం విస్మరించిన హామీలనే అస్త్రాలుగా మలుచుకుని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ శాసనసభా సమావేశాల్లో నిలదీయనుంది. రాష్ట్రానికి సంజీవని అయిన ప్రత్యేక హోదాను ప్యాకేజీల కోసం, ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుని పక్కన పడేసిన అంశంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గట్టిగా ప్రశ్నించనుంది. రైతు, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి ఇలా అంశాల వారీగా ప్రజాసమస్యలను లేవనెత్తేందుకు సిద్ధమవుతోంది. ప్రతిపక్షంపై ఎదురుదాడికి పాలకపక్షం సమాయత్తమైంది. 13న సభలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టాక, 28 వరకు అసెంబ్లీ కొనసాగించాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.

కొత్త రాష్ట్రం.. కొత్త అసెంబ్లీ..: 61 ఏళ్ల తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ప్రాంతం మారుతోంది. 1956 నవంబరు 1వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి హైదరాబాద్‌లోని ప్రస్తుత అసెంబ్లీ ప్రాంగణంలోనే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కూడా అదే ప్రాంగణంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, మండలి సమావేశాలు జరిగాయి. ఆఖరి సారిగా గత ఏడాది సెప్టెంబరు 8,9,10 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు అక్కడే కొనసాగాయి. ఈ ఏడాది అమరావతిలో తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Advertisement
Advertisement