మినీ సెక్రటేరియెట్‌గా సీఎం క్యాంపు ఆఫీసు | Sakshi
Sakshi News home page

మినీ సెక్రటేరియెట్‌గా సీఎం క్యాంపు ఆఫీసు

Published Thu, Oct 1 2015 9:06 AM

సీఎం క్యాంపు కార్యాలయం ఆధునీకరణ మార్పులు చేస్తున్న దృశ్యం - Sakshi

సాక్షి, విజయవాడ బ్యూరో: విజయవాడలోని జలవనరుల శాఖ ప్రాంగణంలో ఉన్న తన క్యాంపు కార్యాలయాన్ని మినీ సెక్రటేరియెట్‌గా మార్చాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు కృష్ణా జిల్లా టీడీపీ కార్యాలయాన్ని రాష్ట్ర పార్టీ కార్యాలయంగా తీర్చిదిద్దడానికి కూడా నిర్ణయం జరిగింది. సీఎం క్యాంపు ఆఫీసు సమీపంలో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు, ఇరిగేషన్ ఇంజనీరింగ్ చీఫ్ క్యాంపు కార్యాలయాలను ఇటీవలే ప్రారంభించారు.

వీటికి సమీపంలోని ఒక అపార్టుమెంటుకు సాధారణ పాలన విభాగం(జీఏడీ) తరలిరానుంది. మరికొన్ని శాఖలను కూడా ఈ ప్రాంతానికి తరలించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే సీఎం తన నివాసం తాడేపల్లిలోని కరకట్టపై ఉన్న భవనంలో ఏర్పాటు చేసుకున్నందున విజయవాడలోని క్యాంపు కార్యాలయాన్ని మినీ సెక్రటేరియేట్‌గా మార్చాలని నిర్ణయించారు. దీనిపై ఈనెల 1న విజయవాడలో జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

భద్రతా, నిఘా పెంపుపై కసరత్తు
రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలు, సమీక్షలు, సమావేశాలు విజయవాడ కేంద్రంగా నిర్వహిస్తుండటంతో రాజధాని అమరావతి ప్రాంతంలో పోలీసింగ్ వ్యవస్థను కట్టుదిట్టం చేసేలా ఏపీ హోంశాఖ దృష్టిసారించింది. విజయవాడతో పాటు, అమరావతి, తుళ్లూరు, మంగళగిరి ప్రాంతాల్లో సమర్థ పోలీస్ అధికారులను నియమించేలా కసరత్తు సాగుతోంది. సీఎం చంద్రబాబు కాన్వాయ్‌కు కూడా భద్రత పెంచనున్నారు.

గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి సీఎం క్యాంపు కార్యాలయం, తాడేపల్లిలోని సీఎం నివాసం వరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఇతర ఉన్నతాధికారుల భద్రత విషయంలోను ఇంటెలిజెన్స్ శాఖ అప్రమత్తంగా వ్యవహరించేలా చర్యలు చేపట్టారు. భద్రతా, నిఘా విషయాల్లో సమర్థ పోలీస్ అధికారులను ఇక్కడకు బదిలీ చేసేలా కసరత్తు సాగుతోంది. అక్టోబర్ 22న రాజధాని నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలోపే సమర్థులైన పోలీస్‌లను ఇక్కడికి తరలించనున్నారు.

Advertisement
Advertisement