పుష్కరఘాట్లను తనిఖీ చేసిన ఏపీ సీఎం | Sakshi
Sakshi News home page

పుష్కరఘాట్లను తనిఖీ చేసిన ఏపీ సీఎం

Published Sun, Jul 12 2015 2:01 AM

AP cm chandrabbu naidu to checking of puskara ghats

పారిశుద్ధ్య లోపంపై ఆగ్రహం
శానిటరీ ఇన్‌స్పెక్టర్, మేస్త్రీల సస్పెన్షన్

 
సాక్షి, రాజమండ్రి, కొవ్వూరు: గోదావరి పుష్కరాల ఏర్పాటు పనులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం తనిఖీ చేశారు. పారిశుద్ధ్య లోపం, అడ్డదిడ్డంగా బ్యారికేడ్ల ఏర్పాటుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాజమండ్రి 30వ వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్ సతీశ్, మేస్త్రీని అక్కడికక్కడే సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అవసరం లేకున్నా పుష్కర ఘాట్ మార్గాల్లో బ్యారికేడ్లను ఏర్పాటు చేయడమేమిటని అసహనం వ్యక్తం చేశారు. రాజమండ్రి అర్బన్ ఎస్పీ హరికృష్ణపై సీరి యస్ అయ్యారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న ఏపీ సీఎం నేరుగా ఘాట్ల పరి శీలనకు బయల్దేరారు. మధ్యలో  ఆగుతూ  కోటిలింగాల ఘాట్‌ను, పుష్కరాల ఘాట్‌లను పరిశీలించారు. తర్వాత పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్, జిల్లా ఆర్యవైశ్య సంఘం యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన ప్రాంగణాలను పరిశీలించారు.
 
 అనంతరం గోష్పాద క్షేత్రంలో పనులను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ పుష్కర సాన్నాలకు వీలుగా 5 అడుగుల నీటి నిల్వలు  ఉండేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రతి 3 గంటలకు నీటిని శుభ్రం చేయటానికి శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేశామని సీఎంకు వివరించారు. ఘాట్లను, యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, బ్యారికేడ్లను సీఎం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వెల్‌డన్ అంటూ.. కలెక్టర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. తిరిగి సాయంత్రం 6 గంటలకు రాజమండ్రి చేరుకున్నారు. ఆర్ అండ్ బీ అతిథిగృహంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమై పుష్కరాల ఏర్పాట్ల్లపై సమీక్షించారు.  కొవ్వూరు పర్యటనలో సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు కె.నారాయణ, పీతల సుజాత, ఎంపీ మురళీమోహన్ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement