విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డి అరెస్టు | Sakshi
Sakshi News home page

విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డి అరెస్టు

Published Fri, Sep 11 2015 2:05 AM

విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డి అరెస్టు - Sakshi

* డిపాజిట్లు సేకరించి మోసం చేశారనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్న పోలీసులు
* 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించిన న్యాయమూర్తి
* కేశవరెడ్డి రూ.547 కోట్ల డిపాజిట్లు సేకరించారు: ఎస్పీ వెల్లడి
కర్నూలు: డిపాజిట్ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలపై ప్రముఖ విద్యాసంస్థల యజమాని నాగిరెడ్డి కేశవరెడ్డిని కర్నూలు సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

నగర శివారులోని టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్న ఆయన్ను మధ్యాహ్నం జిల్లా ఎస్పీ రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో అదనపు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఎస్పీ హుస్సేన్ పీరాతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. నంద్యాల పట్టణం బాలాజీనగర్‌లో నివాసం ఉంటున్న కేశవరెడ్డికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యా సంస్థలు ఉన్నాయి. వాటికి అవసరమైన పెట్టుబడుల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి, వ్యాపారుల నుంచి డిపాజిట్లు సేకరించారు.

దాదాపు 11 వేలమంది విద్యార్థుల తల్లిదండ్రులు, 800 మంది ఇతర వ్యక్తుల నుంచి రూ.547 కోట్ల డిపాజిట్లు సేకరించారు. ప్రతిగా డిపాజిటర్లకు ప్రామిసరీ నోట్లు ఇచ్చారు. ఆయా మొత్తాలను విద్యాసంస్థల అభివృద్ధి, విస్తరణ నిమిత్తం ఉపయోగించారు. విద్యాసంస్థలకు సంబంధించిన ఆస్తులను తాకట్టు పెట్టి బ్యాంకుల్లో రూ.62 కోట్ల రుణం పొందారు. అయితే తాము చేసిన డిపాజిట్లను సరైన సమయంలో తిరిగి చెల్లించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలకు దిగడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

డిపాజిట్లపై అధిక మొత్తంలో వడ్డీ చెల్లిస్తానని నమ్మించి కేశవరెడ్డి మోసం చేసినట్లు బాధితులు ఆరోపించారు. ఈ మేరకు నంద్యాల 2, 3వ పోలీస్‌స్టేషన్లలో, పాణ్యం పోలీస్‌స్టేషన్‌లో.. పలు సెక్షన్ల కింద మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే గురువారం కేశవరెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఆయన నుంచి ఇన్నోవా వాహనంతో పాటు కొన్ని విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

అనంతరం కేశవరెడ్డిని పోలీసులు కర్నూ లు కోర్టులో హాజరుపరచడంతో న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించారు. కేశవరెడ్డిపై ఐపీసీ సెక్షన్లు 420 (చీటింగ్), 403 (దురుద్దేశపూరితంగా ఆస్తుల దుర్వినియోగం), 109 (నేరాన్ని ప్రోత్సహించడం), 149 (చట్టవిరుద్ధంగా గుమిగూడటం), 5 (ఐపీసీ పేర్కొనని నేరా లు) కింద, ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ అండ్ ఫైనాన్షియర్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి.
 
ఏడాది గడువిస్తే డిపాజిట్లు తిరిగి చెల్లిస్తా
ఉన్నత ఆశయంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాలయాలను ఏర్పాటు చేశానని కేశవరెడ్డి వెల్లడించారు. తన సంస్థలో డిపాజిట్ చేసిన వారందరికీ కచ్చితంగా తిరిగి చెల్లిస్తానని, అయితే ఆస్తులన్నీ బ్యాంకుల్లో తాకట్టులో ఉన్నందున ఏడాది గడువు కావాలని కోరారు. ఆస్తులు అమ్మి అప్పులు తీర్చడానికి కూడా సిద్ధమేనన్నారు.
 
డిపాజిట్ల సేకరణపై విచారణ

విద్యాశాఖ కార్యదర్శికి ఏపీ మంత్రి గంటా ఆదేశం
సాక్షి, హైదరాబాద్: కేశవరెడ్డి విద్యాసంస్థల డిపాజిట్ల సేకరణ వివాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. త్వరితగతిన విచారణ జరిపి నివేదికను సమర్పించాల్సిందిగా పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఆర్పీ సిసోడియాను మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఈ అంశంపై మంత్రి అధికారులతో చర్చించారు. ప్రభుత్వ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుతోనూ చర్చించారు.

కర్నూలు కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, డిపాజిట్లు చేసిన వారికి న్యాయం చేయిస్తామని పేర్కొన్నారు. అవసరమైతే సీఐడీ విచారణ కూడా చేయిస్తామన్నారు. కేశవరెడ్డి విద్యా సంస్థలను ఆ సంస్థ కొనసాగించలేకపోతే విద్యార్థులకు నష్టం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని సిసోడియా చెప్పారు.

Advertisement
Advertisement