‘ఆధార్’ పనికిమాలిన విధానం | Sakshi
Sakshi News home page

‘ఆధార్’ పనికిమాలిన విధానం

Published Thu, Nov 14 2013 1:26 AM

AP High court slams center on Aadhar project

సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆధార్ ప్రాజెక్ట్ ఒక పనికిమాలిన విధానమంటూ రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆధార్ పొందేందుకు వృద్ధులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయం కేంద్రానికి అర్థంకానట్లుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ‘ఆధార్’తీసుకోవాలన్న నిబంధన ఎంత మాత్రం సరికాదని అభిప్రాయపడింది. ‘ఆధార్’ నిబంధనలను సవాలు చేస్తూ హైదరాబాద్, సరూర్‌నగర్‌కు చెందిన టి.ఎస్.ఆర్.శర్మ దాఖలుచేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది.
 
  పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది చల్లా సీతారామయ్య వాదనలు వినిపించారు. కేంద్రం తన అధికార పరిధిని అతిక్రమించి మరీ బయోమెట్రిక్ విధానం ద్వారా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమే కాక, మానవ హక్కుల పరిరక్షణ చట్టం-1993 నిబంధనల ఉల్లంఘనేనని నివేదించారు. పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 14ఎ ప్రకారం దేశ పౌరులందరి పేర్లను నమోదుచేసి, జాతీయ గుర్తింపు కార్డు ఇవ్వాలని,  ఇందులో భాగంగానే జనన, మరణాల రిజిస్టర్‌ను నిర్వహిస్తున్నారని తెలిపారు.
 
  ఇప్పటికే కేంద్రం దేశ పౌరులందరికీ పలు రకాల గుర్తింపు కార్డులు ఇచ్చిందని, వాటన్నింటిని పౌరులు తమ హక్కులు పొందడానికి వాడుకుంటున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇవిలా ఉండగానే 2010లో కేంద్రం ‘నేషనల్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఇండియా బిల్లు’ను తీసుకొచ్చి ఆధార్ కార్డుల జారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందన్నారు. వాస్తవానికి ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టలేదని, అయినప్పటికీ ఆధార్‌ను  తప్పనిసరిగా తీసుకోవాలని పౌరులపై ఒత్తిడి చేస్తోందని తెలిపారు.  ఆధార్‌కూ గ్యాస్ సిలిండర్‌కూ ముడిపెడుతూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఆధార్ గుర్తింపు కోసమే తప్ప మరో ప్రయోజనానికి కాదని చెబుతూనే,  దాన్ని ఇతర ప్రయోజనాల కోసం వర్తింపచేయడం  తగదన్నారు. భారీ ప్రజాధనంతో బయోమెట్రిక్ విధానంతో పౌరుల వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారని, ఇలాచేసే అధికారం కేంద్రానికి లేదనిు నివేదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘ఇప్పటికే పౌరులకు ఎన్నో గుర్తింపు కార్డులున్నాయి. వాటిని వివిధ సేవలకు వాడుకుంటున్నారు.
 
  మళ్లీ కొత్తగా మరో కార్డు ఎందుకు? వివిధ పథకాలకు ప్రభుత్వం ఎన్నో ఏళ్ల నుంచి సబ్సిడీలు ఇస్తోంది. ఎప్పుడూ ఇబ్బందులొచ్చిన దాఖలాల్లేవు. అయినా ప్రజలు ముందస్తుగా పూర్తి మొత్తం చెల్లించడమేంటి? ఆ తర్వాత ప్రభుత్వం సబ్సిడీని తిరిగి ఇవ్వడమేంటి? ఈ కార్డు కోసం 80 ఏళ్లవారూ గంటలపాటు బారులు తీరాల్సి వస్తోంది. వారి ఇబ్బందులు కేంద్రానికి అర్థంగాకుండా ఉన్నట్లుంది. వయసుతో పని లేకుండా అందరూ ఆధార్ పొందాలన్న నిబంధన ఏమాత్రం సరికాదు. 50-60 ఏళ్ల వారివద్దనున్న అనేక రకాల గుర్తింపు కార్డులను బట్టి వారి వివరాలన్నీ ప్రభుత్వం వద్ద ఉంటాయి. మళ్లీ వాటిని సేకరించాలని నిర్ణయించడంలో ఆంతర్యమేమిటో అర్థం కావట్లేదు. అసలు ఈ ప్రాజెక్టు ఓ పనికిమాలిన విధానం. దీనివల్ల ఏం ప్రయోజనం కలుగుతుందో కేంద్రానికే తెలియాలి’ అని వ్యాఖ్యానించింది.  వ్యాజ్యంపై పూర్తిస్థాయిలో వాదనలు వింటామంటూ విచారణను గురువారానికి వాయిదా వేసింది.
 

Advertisement
Advertisement