కొడుకైనా అరెస్టు చేయిస్తా.. డ్యూటీ ఫస్ట్! | Sakshi
Sakshi News home page

కొడుకైనా అరెస్టు చేయిస్తా.. డ్యూటీ ఫస్ట్!

Published Fri, Jan 20 2017 10:37 AM

కొడుకైనా అరెస్టు చేయిస్తా.. డ్యూటీ ఫస్ట్! - Sakshi

ఒక మహిళను దారుణంగా తొమ్మిది సార్లు కత్తితో పొడిచిన నేరంలో నిందితుడు స్వయంగా తన కన్న కొడుకని అతడికి తెలిసింది. బంధువులంతా ఆ నేరాన్ని జాగ్రత్తగా దాచిపెట్టి.. అతడు అరెస్టు కాకుండా చూడాలని కోరారు. కానీ, ఆ తండ్రి మాత్రం వినిపించుకోలేదు. విధి నిర్వహణలో కన్న కొడుకైనా సరే ఆగేది లేదని చెప్పి, అతడిని అరెస్టు చేయించాడు. ఆయన పేరు రాజ్‌ సింగ్ (52). ఢిల్లీలో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. ఆయన కొడుకు అమిత్ ఒక మహిళను దారుణంగా కత్తితో పొడిచాడు. ఈ కేసును ఛేదించడానికి ఆధారాలు దొరక్క ఢిల్లీ పోలీసులు తల పీక్కుంటున్న సమయంలో నజఫ్‌గఢ్ పోలీసుస్టేషన్‌లోకి రాజ్‌సింగ్ నడుచుకుంటూ వచ్చి, తన కొడుకును అరెస్టు చేయడానికి ఆ కేసును విచారిస్తున్న అధికారికి సాయం చేస్తానన్నారు. 
 
వేరే జిల్లాలో పనిచేస్తున్న రాజ్‌సింగ్ ఏడు రోజుల మెడికల్ లీవ్‌లో ఉన్నారు. అదే సమయంలో నజఫ్‌గఢ్‌లో జరిగిన కత్తిపోట్ల వెనక తన కొడుకు ఉన్న విషయం ఆయనకు తెలిసింది. కొద్ది గంటల్లోనే ఆయన ఆ కేసును విచారిస్తున్న పోలీసు అధికారులను సంప్రదించారు. దానికి ముందు తన బంధువులందరితో మాట్లాడి ఎవరూ అమిత్‌కు షెల్టర్ ఇవ్వద్దని హెచ్చరించారు. అతడు ఏం చేశాడో వాళ్లకు సరిగ్గా తెలియకపోవడంతో.. మహిళను పొడిచేశాడని చెప్పారు. రోషన్‌పురా ప్రాంతంలోని కొంతమంది బంధువుల ఇళ్లకు వెళ్లి, అమిత్ అక్కడ దాగున్నాడేమోనని తనిఖీ కూడా చేశారు. 
 
విధి నిర్వహణే ముందని, దాని కంటే ఏదీ ముఖ్యం కాదని రాజ్‌సింగ్ అన్నట్లు సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. తన కన్న కొడుకును కూడా ఇతర నిందితుల్లాగే చూడగలిగే పోలీసులు ఉండటం చాలా అరుదని జాయింట్ పోలీసు కమిషనర్ దీపేంద్ర పాఠక్ చెప్పారు. విధి నిర్వహణ పట్ల ఆయన చిత్తశుద్ధిని తాము గౌరవిస్తామని, ఆయన అందరికీ ఆదర్శప్రాయులని ప్రశంసించారు.

Advertisement
 
Advertisement