గోరక్షకులపై మరోసారి మోదీ ఫైర్‌! | Sakshi
Sakshi News home page

గోరక్షకులపై మరోసారి మోదీ ఫైర్‌!

Published Sun, Jul 16 2017 2:13 PM

గోరక్షకులపై మరోసారి మోదీ ఫైర్‌! - Sakshi

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దంటూ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

న్యూఢిల్లీ: గో రక్షణ పేరిట దాడులకు తెగబడుతున్న మూకలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్‌ ఇచ్చారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దంటూ ఆయన తేల్చిచెప్పారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో గోరక్షక దాడులపై ఆయన మరోసారి స్పందించారు.

'గో రక్షణ పేరిట చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ రాష్ట్రాలకు సూచించారు. ఏ వ్యక్తి కానీ, గ్రూప్ కానీ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదు' అని ప్రధాని మోదీని ఉటంకిస్తూ కేంద్రమంత్రి అనంత్‌కుమార్‌ తెలిపారు. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్షం భేటీ అనంతరం ప్రధాని మోదీ, బీజేపీ సీనియర్‌ నేతల సమక్షంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గోరక్షణ పేరిట దాడులు, కొట్టిచంపడాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈమేరకు త్రీవంగా స్పందించారు.

గోరక్షణ పేరుతో హింసాత్మక దాడులకు తెగబడుతున్న వారిపై ప్రధాని మోదీ గతంలోనూ మండిపడ్డ సంగతి తెలిసిందే. ‘గో (ఆవుల) భక్తి పేరిట ప్రజలను చంపడం ఎంతమాత్రం ఆమోదనీయం కాదు. ఇలాంటి చర్యలను మహాత్మాగాంధీ  ఎంతమాత్రం ఆమోందించి ఉండేవారు కాదు. అహింసకు నెలవైన నేల మనది. మహాత్మాగాంధీ పుట్టిన నేల మనది. ఈ విషయాన్ని ఎందుకు మరిచిపోతున్నారు? చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అధికారం ఈ దేశంలోకి ఎవరికీ లేదు' అంటూ గుజరాత్‌ పర్యటన సందర్భంగా మోదీ స్వయంప్రకటిత గోరక్షకులకు వ్యతిరేకంగా గట్టి సందేశాన్ని ఇచ్చారు.

Advertisement
Advertisement