29 వరకు అసెంబ్లీ | Sakshi
Sakshi News home page

29 వరకు అసెంబ్లీ

Published Sat, Mar 12 2016 2:03 AM

29 వరకు అసెంబ్లీ

► 16 రోజులపాటు సభ నిర్వహణకు బీఏసీ నిర్ణయం
► శని, ఆదివారాల్లోనూ శాసనసభ సమావేశాలు
► అవసరమైతే మరో రెండు రోజులు పొడిగింపు
► నేడు, రేపు గవర్నర్ ప్రసంగంపై చర్చ
► 14న ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఈటల
► 15, 23, 24, 25 తేదీల్లో సెలవులు
► బీఏసీ భేటీకి టీటీడీఎల్పీ నేత రేవంత్ గైర్హాజరు
► మార్చి 31 వరకు జరగనున్న మండలి సమావేశాలు


సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 16 రోజుల పాటు జరగనున్నాయి. శని, ఆదివారాలు కూడా అసెంబ్లీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ నెల 29వ తేదీ వరకు (16 పని దినాలు) సమావేశాలు నిర్వహించాలని శాసనసభ సలహా సంఘం (బీఏసీ) నిర్ణయించింది. ఈ నెల 14న మంత్రి ఈటల రాజేందర్ సభలో ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. సభ ఎజెండా, పనిదినాలు ఖరారు చేసేందుకు స్పీకర్ ఎస్.మధుసూదనాచారి అధ్యక్షతన శుక్రవారం బీఏసీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, బీజేపీ శాసనసభా పక్షం నేత డాక్టర్ లక్ష్మణ్ ఇందులో పాల్గొన్నారు.

ఈ నెల 31వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని లక్ష్మణ్ కోరగా.. మరోమారు బీఏసీ నిర్వహించి ఈ అంశాన్ని పరిశీలిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ నెల 14న బడ్జెట్ అనంతరం 15న ఒకరోజు, హోలీ, గుడ్‌ఫ్రైడే సందర్భంగా మార్చి 23, 24, 25 తేదీల్లో సెలవులు ప్రకటించారు. ఈ నాలుగు రోజులు మినహా.. శని, ఆదివారాలతో సంబంధం లేకుండా వరుసగా మార్చి 12 నుంచి 29వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు.

గవర్నర్ ప్రసంగంపై నేడు, రేపు చర్చ
గవర్నర్ ప్రసంగంపై శని, ఆదివారాల్లో ధన్యవాద తీర్మానాలపై సభ్యులు ప్రసంగిస్తారు. 14న బడ్జెట్ తర్వాత 16, 17, 18, 19 తేదీల్లో సాధారణ చర్చ నిర్వహిస్తారు. 19న ఆర్థిక మంత్రి సమాధానంతో బడ్జెట్‌పై చర్చను ముగిస్తారు. తర్వాత 20 నుంచి 28వ తేదీ వరకు ఆరు రోజుల పాటు రెండు విడతల్లో బడ్జెట్ పద్దులపై చర్చ నిర్వహించి, ఓటింగ్ జరుపుతారు. సమావేశాల చివరి రోజు మార్చి 29న ద్రవ్య వినిమయ బిల్లుతోపాటు, ఇతర ప్రభుత్వ బిల్లులను సభ ముందు ప్రవేశపెట్టనున్నారు. ఒకవేళ మరో రెండు రోజుల పాటు.. అంటే మార్చి 30, 31 తేదీల్లో సభను నిర్వహించాల్సి వస్తే సాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు చర్చను ప్రారంభిస్తారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు శాసనమండలి సభ్యులను కూడా ఆహ్వానించాలని కొందరు ఎమ్మెల్సీలు మంత్రి హరీశ్‌రావును కోరినట్లు సమాచారం.

బీఏసీ సమావేశానికి రేవంత్ స్థానంలో సండ్ర
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో.. బీఏసీ సమావేశంలో పార్టీ ప్రతినిధిగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హాజరయ్యారు. పార్టీ శాసనసభా పక్ష నేతగా ఇటీవల నియమితులైన రేవంత్‌రెడ్డి.. తనకు బదులుగా ఎమ్మెల్యే సండ్ర బీఏసీ సమావేశానికి హాజరవుతారని సీఎంకు లేఖ ఇచ్చారు. అసెంబ్లీ ఆవరణలోనే ఉన్నా రేవంత్‌రెడ్డి బీఏసీ సమావేశానికి గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలంటూ సీఎం చేసిన విజ్ఞప్తికి.. విపక్షాలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. టీటీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేయడంపై సభ బయట అసంతృప్తి వ్యక్తం చేసిన టీడీపీ, కాంగ్రెస్.. బీఏసీ సమావేశంలో మాత్రం ఈ అంశాన్ని ప్రస్తావించలేదని తెలిసింది.

మార్చి 31 వరకు మండలి
రాష్ట్ర శాసన మండలి సమావేశాలను మార్చి 31 వరకు నిర్వహించాలని చైర్మన్ స్వామిగౌడ్ నిర్ణయించారు. శాసనమండలి ఆవరణలో శుక్రవారం జరిగిన బీఏసీ సమావేశంలో మండలి సమావేశ తేదీలను ఖరారు చేశారు. ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు మండలి సమావేశాలు నిరవధికంగా జరుగుతాయి. 20న ఆదివారం సెలవుదినంగా పాటించి తిరిగి 21, 22 తేదీల్లో సమావేశం నిర్వహిస్తారు. 23 నుంచి 26వ తేదీ వరకు హోలీ, గుడ్‌ఫ్రైడే సందర్భంగా సెలవులు ప్రకటించారు. తిరిగి 27న ప్రారంభమయ్యే మండలి సమావేశాలు 31తో ముగియనున్నాయి. మండలి సమావేశాలు మార్చి 31 వరకు జరగనున్న నేపథ్యంలో.. అసెంబ్లీ సమావేశాలను కూడా 29 నుంచి 31వ తేదీ వరకు పొడిగించే అవకాశాలు ఉన్నాయి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement