ఎవరూ రాకున్నా.. నేనున్నా | Sakshi
Sakshi News home page

ఎవరూ రాకున్నా.. నేనున్నా

Published Sun, Aug 16 2015 12:36 AM

ఎవరూ రాకున్నా.. నేనున్నా - Sakshi

‘ఎట్‌హోం’కు కేసీఆర్, చంద్రబాబు గైర్హాజరుపై గవర్నర్ తీవ్ర అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్:
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో శనివారం నిర్వహించిన ‘ఎట్‌హోం’ కార్యక్రమానికి తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు హాజరుకాలేదు. దీంతో గవర్నర్ నరసింహన్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఏటా ఆనవాయితీగా నిర్వహించే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరుకావడం సంప్రదాయంగా వస్తోంది. రాష్ట్ర విభజన తరువాత నరసింహన్ ఇరు రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరిస్తున్నందువల్ల.. ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబులకు రాజ్‌భవన్ నుంచి ఆహ్వానం వెళ్లింది. సాధారణంగా సీఎం ఎంత బిజీగా ఉన్నా ‘ఎట్‌హోం’ కార్యక్రమానికి హాజరవుతుంటారు.

కానీ శనివారం కార్యక్రమానికి ఇద్దరు సీఎంలు రాకపోవడం చర్చనీయాంశమైంది. కార్యక్రమం ముగింపు దశలో గవర్నర్ కొద్దిసేపు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సీఎంల గైర్హాజరుపై ప్రశ్నించగా... ‘‘ఎవరూ రాకున్నా.. నేనున్నాను. మీరున్నారు కదా. నేనుంటే చాలదా...’’ అని గవర్నర్ వ్యాఖ్యానించారు. ఆతిథ్యం ఇచ్చేది మీరే కాబట్టి మీరు ఎలాగూ ఉంటారు అని మీడియా ప్రతినిధులు అనగానే.. ‘‘వారి ద్దరు రాకపోవడానికి కారణం ఉండి ఉంటుంది. ఆ కారణాలు ఏంటో నాకు తెలియదు. చంద్రబాబు పట్టిసీమలో బిజీగా ఉన్నారు.

కేసీఆర్ వేరే పనుల వల్ల బిజీగా ఉన్నారేమో! నేను ఇద్దరు సీఎంలకు ఆమోదయోగ్యమైన గవర్నర్‌ను. హైదరాబాద్‌లో ఉండే చివరి రోజు వరకు ఆమోదయోగ్యంగానే ఉంటా. సీఎంలిద్దరూ ఎందుకు రాలేదన్న విషయంలో కారణాలు వెదకొద్దు. ఓ నిర్ణయానికి రావొద్దు..’’ అని గవర్నర్ పేర్కొన్నారు. ఇదే సందర్భంలో ఒక చిన్న ఉదాహరణను ప్రస్తావించారు. ‘‘చిన్నప్పుడు మా మనవళ్లు అలిగేవారు. ఎందుకు అలిగేవారో తెలియదు. అలగడం మాత్రం నిజం. ఇప్పుడు ఇద్దరు సీఎంలు రానిది నిజం.. ఎందుకు రాలేదో మాత్రం తెలియద’’న్నారు. ఇద్దరు సీఎంలతో తన మనవళ్లు ఫొటో దిగుదామనుకున్నారని, వారు రాకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారని చెప్పారు.

కాగా.. ‘ఎట్‌హోం’ కార్యక్రమానికి ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు, ప్రముఖులు హాజరయ్యారు. గవర్నర్ దంపతులు ప్రతీ టేబుల్ వద్దకు వెళ్లి అతిథులను పలకరించారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి బొసాలే, మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని, లక్ష్మారెడ్డి, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, సుజనాచౌదరి, సీఎల్పీ నేత జానారెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, షబ్బీర్ అలీ, పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఇద్దరు సీఎంల గైర్హాజరుతో ‘ఎట్ హోం’ కార్యక్రమం పేలవంగా ముగిసింది.

Advertisement
Advertisement