మోదీ 50 రోజులన్నారు కానీ.. 4 నెలలు తప్పదు | Sakshi
Sakshi News home page

మోదీ 50 రోజులన్నారు కానీ.. 4 నెలలు తప్పదు

Published Mon, Nov 14 2016 6:25 PM

మోదీ 50 రోజులన్నారు కానీ.. 4 నెలలు తప్పదు - Sakshi

న్యూఢిల్లీ: ‘మరో 50 రోజులు ఓపిక పడితే ప్రజలు కోరుకున్న భారతాన్నిస్తా. నల్లధనం దాచుకున్న కుబేరులు తప్పించుకోలేరు’.. పెద్ద నోట్ల రద్దు తర్వాత సామాన్యుల కష్టాల గురించి ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాట ఇది. అయితే కరెన్సీ కష్టాలు పూర్తిస్థాయిలో తీరడానికి కనీసం నాలుగు నెలలు సమయం పట్టనుంది. రద్దయిన 500, 1000 రూపాయల నోట్ల స్థానంలో, ఈ నోట్ల మొత్తం విలువకు సరిపడా కొత్త నోట్లు చెలామణిలోకి రావడానికి 50 రోజులు కాదు 4 నెలల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఆర్థిక శాఖ నివేదిక ప్రకారం అక‍్టోబరు నెల చివరికి 17 లక్షలా 50 వేల కోట్ల రూపాయల విలువైన నోట్లు చెలామణిలో ఉన్నాయి. ఇందులో 84 శాతం అనగా 14 లక్షలా 50 వేల కోట్ల రూపాయల నగదు.. 500, 1000 రూపాయల నోట్ల రూపంలో ఉంది. గత మంగళవారం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నవంబర్‌ 10 నుంచి 13వ తేదీ వరకు అంటే ఆదివారానికి నాలుగు రోజుల్లో 50 వేల కోట్ల రూపాయలను మాత్రమే ప్రజలకు పంపిణీ చేశారు. బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఎంలతో విత్‌ డ్రా, నోట్ల మార్పిడి ద్వారా చెల్లించారు. 100, 2000 వేల రూపాయల నోట్లను అందించారు.

బ్యాంకులు, ఏటీఎంల ముందు ప్రజలు భారీ సంఖ్యలో బారులు తీరినా అవసరాలకు తగినట్టు నగదును ఇవ్వలేకపోయారు. సరిపడినంత కరెన్సీ అందుబాటులో ఉందని, బ్యాంకులు పంపిస్తామని రిజర్వ్‌ బ్యాంకు చెబుతున్నా ఆచరణ రూపం దాల్చడంలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డిసెంబర్‌ నెలాఖరు వరకు ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసే పెద్ద నోట్లు పోనూ.. డిపాజిట్‌ చేయని, మిగిలిపోయిన నల్లధనం ఎంత అన్నది తేలాల్సివుంది. ఇలా నిర్ధారించిన నల్లధనానికి అంతే మొత్తం విలువలో కొత్త నోట్లను ముద్రించాల్సి వుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి 116 రోజులు పడుతుందని ఆర్ధిక రంగ నిపుణులు చెప్పారు.

ప్రస్తుతం కొత్త 2 వేల రూపాయల నోట్లు అందుబాటులోకి వచ్చాయి. మహారాష్ట్రలో నాసిక్‌లోని కరెన్సీ నోట్‌ ప్రెస్‌ (సీఎన్‌పీ)లో ముద‍్రించిన 50 లక్షల కొత్త 500 రూపాయల నోట్లు రిజర్వ్‌బ్యాంకు చేరుకున్నాయి. రెండో విడతలో మరో 50 లక్షల 500 రూపాయల నోట్లను బుధవారం కల్లా ఆర్‌బీఐకు పంపుతామని సీఎన్‌పీ అధికారి ఒకరు చెప్పారు. అంతేగాక పెద్ద సంఖ‍్యలో 20, 50, 100 రూపాయల నోట్లను ముద్రించారు. ఆర్‌బీఐ ఈ నోట్లను బ్యాంకుల పంపనుంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా 40 కోట్ల 500 రూపాయల నోట్లను ముద్రించాలని సీఎన్‌పీకి ఆదేశాలు వచ్చాయి. దీన్ని బట్టి పూర్తి స్థాయిలో కరెన్సీ చెలామణిలోకి రావడానికి కనీసం 4 నెలలు పడుతుందని నిపుణులు అంచనా వేశారు.

Advertisement
Advertisement