వీసాల కోసం దొంగ పెళ్లిళ్లు:దంపతులు అరెస్టు | Sakshi
Sakshi News home page

వీసాల కోసం దొంగ పెళ్లిళ్లు:దంపతులు అరెస్టు

Published Thu, Feb 13 2014 9:11 PM

Australian court grants bail to Indian-origin couple

మెల్‌బోర్న్:ఆస్ట్రేలియా వీసాల కోసం స్థానిక మహిళలతో దొంగ పెళ్ళిళ్లు ఏర్పాటు చేసిన కేసులో భారత సంతతి దంపతులను స్థానిక ఫెడరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబైకి చెందిన మైగ్రేషన్ ఏజెంట్ చేతన్ మోహన్‌లాల్ మష్రూ, పెళ్ళిళ్ల వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన అతని భార్య, ఆస్ట్రేలియూలోనే జన్మించిన దివ్య క్రిష్ణె గౌడలకు బ్రిస్బేన్ మేజిస్ట్రేట్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను మార్చి 14వ తేదీకి వాయిదా వేసింది. గత ఏడాది ఏప్రిల్‌లో వెలుగు చూసిన ఈ కేసులో నేరం రుజువైతే నిందితులకు పదేళ్ల వరకు జైలు శిక్ష, సుమారు కోటి రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
 
 నైరుతి బ్రిస్బేన్‌లోని ఆక్స్‌లీ నివాసంలో మష్రూ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా.. 30 మందికి పైగా పురుషులు, మహిళలకు వీరు దొంగ పెళ్ళిళ్లు ఏర్పాటు చేసినట్టుగా ప్రాసిక్యూషన్ అభియోగాలు మోపింది. 2011 మార్చి-2012 మార్చి మధ్యలో ఏర్పాటు చేసిన పెళ్ళిళ్లకు గాను మష్రూ దంపతులు 10 వేల నుంచి 20 వేల అమెరికన్ డాలర్లు వసూలు చేసినట్లు కామన్వెల్త్ ప్రాసిక్యూటర్ ఎయిమీ ఎస్తోర్ప్ ఆరోపించారు. వారిపై ఆరోపణలకు సాక్ష్యంగా కొన్ని బ్యాంకు స్టేట్‌మెంట్లు, మ్యారేజీ సర్టిఫికెట్లు కోర్టు ముందుంచారు. ఈ మొత్తం వ్యవహారంలో గౌడ ఎక్కువ లబ్ది పొందినట్టు ఆమె చెప్పారు. న్యాయవిద్యార్థి అరుున మష్రూ తన మైగ్రేషన్ ఏజెంట్ లెసైన్స్ గడువు గత ఏడాదిలో ముగిసినప్పటికీ రెన్యువల్ చేసుకోలేదని సమాచారం.
 

Advertisement
Advertisement