రెట్రోస్పెక్టివ్ పన్నులపై వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌కు ఒత్తిడి చేయం | Sakshi
Sakshi News home page

రెట్రోస్పెక్టివ్ పన్నులపై వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌కు ఒత్తిడి చేయం

Published Mon, Mar 28 2016 12:51 AM

రెట్రోస్పెక్టివ్ పన్నులపై   వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌కు ఒత్తిడి చేయం

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ



న్యూఢిల్లీ: రెట్రోస్పెక్టివ్ పన్ను(పాత లావాదేవీలకూ పన్ను వర్తింపు) కేసులకు సంబంధించి వొడాఫోన్, కెయిర్న్ ఎనర్జీ వంటి కంపెనీలను వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కోసం ఒత్తిడి చేయబోమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఒకపక్క, ఇలాంటి కేసుల్లో ఆర్బిట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుండటం, ప్రభుత్వం కూడా రెట్రోస్పెక్టివ్ చట్టం ప్రకారం కొత్తగా ఎలాంటి నోటీసులూ జారీచేయదని చెబుతున్నప్పటికీ.. వొడాఫోన్, కెయిర్న్‌లకు గత నెలలో తాజాగా పన్ను నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ... ఇప్పటికే పన్ను అసెస్‌మెంట్ ఆదేశాలు పంపిన కంపెనీలకు నిబంధనల ప్రకారం నోటీసుల జారీ కొనసాగుతుందని జైట్లీ స్పష్టం చేశారు. లేదంటే గతంలో నోటీసులు పంపిన అధికారులను కాగ్, సీబీఐలు ప్రశ్నించే అవకాశం ఉందన్నారు. ‘నోటీసులు అందుకున్న కంపెనీలు ప్రభుత్వం ప్రకటించిన వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ఆఫర్(పన్ను అసలు మొత్తాన్ని కడితే, వడ్డీ, జరిమానాలను మాఫీ చేయడం)కు ఓకే చెప్పొచ్చు. ఈ స్కీమ్ ప్రభుత్వం కల్పించిన ఒక ప్రత్యామ్నాయ మార్గం మాత్రమే. దీన్ని ఆమోదించడం తప్పనిసరేమీకాదు. కావాలంటే, సంబంధిత కంపెనీలు తమ న్యాయపరమైన చర్యలను(లిటిగేషన్) కొనసాగించవచ్చు’ అని జైట్లీ తేల్చిచెప్పారు.

 
2006లో భారత్‌లోని వ్యాపార పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి ఆర్జించిన మూలదన లాభాలపై రూ.29,000 కోట్లమేర(దీనిలో వడ్డీయే రూ.18,000 కోట్లు)  చెల్లించాలంటూ ఆదాయపు పన్ను శాఖ గత నెలలో కెయిర్న్ ఎనర్జీకి తుది నోటీసులు జారీచేయడం తెలిసిందే.  2007లో హచిసన్ నుంచి 67 శాతం వాటా కొనుగోలుపై మూలధన లాభాల పన్ను కింద(వడ్డీ, జరిమానా కలిపి) రూ.14,200 కోట్లు చెల్లించాల్సిందిగా వొడాఫోన్‌కు కూడా ఐటీ శాఖ నోటీసులు పంపింది.

 
జువెలర్స్‌పై వేధింపులు లేకుండా చర్యలు...

పన్ను అధికారులు ఆభరణాల వర్తకులను వేధించకుండా ప్రభుత్వం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటుందని జైట్లీ హామీనిచ్చారు. అయితే, జువెలరీ లాంటి విలాసవంతమైన ఉత్పత్తులను పన్నుల జాబితాలో లేకుండా వదిలిపెట్టడం కుదరదని ఆర్థిక మంత్రి తేల్చిచెప్పారు. అని జైట్లీ వ్యాఖ్యానించారు. కాగా, ఆభరణాలపై సుంకం ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకునేవరకూ సమ్మెను విరమించే ప్రసక్తే లేదని ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ; ఆల్ ఇండియా బులియన్ జువెలర్స్-స్వర్ణకార్ ఫెడరేషన్(ఏఐబీజేఎస్‌ఎఫ్) ఆదివారం స్పష్టం చేశాయి. కొన్ని జువెలరీ సంఘాలు కొనసాగిస్తున్న దేశవ్యాప్త సమ్మె 26వ రోజుకు చేరింది.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement