నోట్ల రద్దు విషయాన్ని అంత సీక్రెట్గా ఎలా ఉంచారు? | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దు విషయాన్ని అంత సీక్రెట్గా ఎలా ఉంచారు?

Published Thu, Nov 10 2016 1:51 PM

నోట్ల రద్దు విషయాన్ని అంత సీక్రెట్గా ఎలా ఉంచారు? - Sakshi

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం రాత్రి ప్రకటించిన షాకింగ్ న్యూస్ పెద్ద నోట్ల రద్దు. కేబినెట్ మంత్రులతో భేటీ అయిన అనంతరం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అసలు ఆ విషయం ఎంత రహస్యంగా ఉందంటే.. భేటీ అనంతరం ప్రధాని వెల్లడించే వరకు ప్రజలెవరికీ కొంచెమైనా బయటికి పొక్కలేదు. భేటీలో పాల్గొన్న వారికి కూడా ఆ విషయం అప్పుడే తెలిసింది. సమావేశ అనంతరం మంత్రులు బయటికి వస్తే, మీడియాకు కాని మరెవరికైనా లీక్ అవుతుందేమోనని ప్రధాని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

జాతినుద్దేశించి తను ప్రకటన చేసేంతవరకు మంత్రులెవరూ సమావేశ మందిరం నుంచి బయటికి రాకూడదని ఆదేశించారు. దీంతో ప్రధాని ప్రసంగం అయ్యేంతవరకు మంత్రులందరూ మీటింగ్ హాల్లోనే ఉన్నారు. వారు ఒక్కలే కాదు, రిజర్వు బ్యాంకు బోర్డు సభ్యులు కూడా మోదీ ప్రసంగం అయ్యాకే బయటికి వచ్చారు. దీంతో ఈ విషయం చాలా సీక్రెట్గా ఉండగలిగింది. నోట్ల రద్దు లీక్ కాకుండా ఉండటానికి ప్రధాన కారణం మరొకటి కూడా ఉంది.
 
అదేమిటంటే, కేబినెట్ సమావేశ మందిరంలోకి సెల్ఫోన్లను అనుమతించకపోవడం. కొన్ని వారాల కిందటే, మంత్రుల వ్యక్తిగత సిబ్బందికి, మంత్రులకు కేబినెట్ సెక్రటరీ  ఓ సర్క్యూలర్ జారీచేశారు. కేబినెట్ సమావేశాల్లో సెల‍్ఫోన్లను తీసుకురాకూడదని ఆ సర్క్యూలర్లో పేర్కొన్నారు. దీంతో సమాచారం బయటికి రావడానికి ఎలాంటి అవకాశం లేదని అధికార ప్రతినిధులు పేర్కొన్నారు. మరోవైపు కేబినెట్ మీటింగ్ సమయంలోనే ఆర్బీఐ బోర్డు సభ్యులు భేటీ నిర్వహించారు. రెండూ సమావేశాలు ఒకేసారి జరుగడంతో, ఆ విషయం బయటికి పొక్కలేదు. కేబినెట్ భేటీ ప్రారంభానికి 10 నిమిషాల ముందు ఓ కీలకమైన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోబోతుందని తెలిసింది.

అందరూ జపాన్, భారత్ల మధ్య ఏదో మోసపూరితమైన ఒప్పందం జరుగబోతుందని భావించారు. కానీ వారి అంచనాలకు భిన్నంగా బ్లాక్ మనీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తూ, 500,1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మంగళవారం సాయంత్రం 6.45 నిమిషాలకు సమావేశం ప్రారంభమైంది. రాత్రి 7.30 కల్లా ముగిసింది. అనంతరం కేబినెట్లో తీసుకున్న నిర్ణయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి  తెలుపడానికి ప్రధాని మోదీ వెళ్లారు. ఆ సమయంలోనూ అందరు మంత్రులు మీటింగ్ హాల్లోనే ఉన్నారు. ప్రణబ్ దగ్గర్నుంచి వచ్చిన తర్వాత ప్రధాని మరోసారి ముగ్గురు సీనియర్ మంత్రులతో మీటింగ్ నిర్వహించారు. ఎట్టకేలకు ఎలాంటి లీకేజీలు లేకుండా చాలా పకడ్భందీగా ఈ విషయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. 

Advertisement
Advertisement