స్తంభించిన భద్రాద్రి | Sakshi
Sakshi News home page

స్తంభించిన భద్రాద్రి

Published Sat, Nov 16 2013 4:04 AM

స్తంభించిన భద్రాద్రి

భద్రాచలంను తెలంగాణలోనే ఉంచాలంటూ నిరసనలు  
 మొదటిరోజు బంద్ సంపూర్ణం

 
 భద్రాచలం, న్యూస్‌లై న్: భద్రాచలంను తెలంగాణ రాష్ట్రంలోనే ఉంచాలనే డిమాండ్‌తో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన డివిజన్ బంద్ మొదటి రోజైన శుక్రవారం సంపూర్ణంగా జరిగింది. తెలంగాణ జేఏసీ, రాజకీయ పార్టీలు, వివిధ కుల, ప్రజా సంఘాల వారు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. దీంతో భద్రాచలం వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. జర్నలిస్టు సంఘాల నాయకులు గోదావరి వంతెన సెంటర్‌లో బైఠాయించి భద్రాచలంకు వచ్చే వాహనాలను అడ్డుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు సారపాక వద్దే నిలిచిపోయాయి. దీంతో భద్రాచలం పరిసర ప్రాంతాలతో పాటు, రామాలయం దర్శనం కోసం వచ్చే భక్తులు సారపాక నుంచి మూడు కిలోమీటర్లు నడిచి వచ్చారు.
 
  పట్టణంలో ఆటోలు కూడా తిరగలేదు. బ్రిడ్జి సెంటర్లో రాస్తారోకో కారణంగా ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది. డివిజన్‌లోని ఎనిమిది మండలాల్లో కూడా బంద్ సంపూర్ణంగా జరిగింది. వాజేడులో మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వెంకటాపురంలో రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. వీఆర్ పురంలో రోడ్డుకు అడ్డంగా ఎడ్లబండ్లను నిలిపి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. టీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు ఆరోరోజుకు చేరాయి. ఎమ్మెల్యే కుంజా సత్యవతి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు దీక్షలను సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యవతి మాట్లాడుతూ భద్రాద్రి రాముడు లేని తెలంగాణ తమకు అవసరం లేదన్నారు. అవసరమైతే నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు.
 
 పాపికొండల విహారయాత్రకు బ్రేక్
 బంద్ నేపథ్యంలో పాపికొండల విహారయాత్రను నిలిపివేస్తున్నట్లు బోట్ యజమానుల సంఘం ప్రకటించింది. దూర ప్రాంతాల నుంచి భద్రాచలం వచ్చే వాహనాలను తెలంగాణవాదులు నిలిపివేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, బంద్‌తో భద్రాచలం రామాలయానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా తగ్గింది. ఆలయ సమీపంలోని విస్తా కాంప్లెక్స్ దుకాణాలన్నీ మూసేశారు.
 
 ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం
 భద్రాచలంను తెలంగాణలోనే ఉంచాలనే డిమాండ్‌తో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు పాదయాత్ర చేశారు. తెలంగాణపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా భద్రాచలం, ఇల్లెందు, ఖమ్మంలలో ఆయన దిష్టిబొమ్మలను ద హనం చేశారు.
 
 నేడు, రేపూ కొనసాగనున్న బంద్
 భద్రాచలంను ఆంధ్రలో కలపాలనే కుట్రలకు నిరసనగా శని, ఆదివారాల్లో కూడా బంద్ కొనసాగించనున్నట్లు జర్నలిస్టు సంఘాల వేదిక నేత బి.వి.రమణారెడ్డి తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి రామాలయానికి వచ్చే భక్తులు తమ ప్రయాణాన్ని విరమించుకోవాలని సూచించారు. బంద్‌కు అన్ని వర్గాల వారు సహకరించాలని ఆయన కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement