నల్లడబ్బును దర్జాగా బ్యాంకులే మార్చేస్తున్నాయి | Sakshi
Sakshi News home page

నల్లడబ్బును దర్జాగా బ్యాంకులే మార్చేస్తున్నాయి

Published Wed, Dec 21 2016 6:30 PM

నల్లడబ్బును దర్జాగా బ్యాంకులే మార్చేస్తున్నాయి - Sakshi

మీడియా ‘స్టింగ్‌’ ఆపరేషన్‌లో వెలుగుచూసిన నిజం

న్యూఢిల్లీ: ఓపక్క నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నోట్లను మార్చుకునేందుకు లేదా సొంత సొమ్మును తీసుకునేందుకు సామాన్యులు అష్టకష్టాలు పడుతుంటే మరోపక్క నల్లకుబేరులు దొడ్డిదోవన దర్జాగా నల్లడబ్బును తెల్లడబ్బుగా మార్చుకుంటున్న సంఘటనలు వింటున్నాం. కంటున్నాం.

అసలు ఇది ఎలా జరుగుతుందో కూపీ లాగడం కోసం ‘ఇండియా టుడే’ మీడియా గ్రూప్‌ ప్రత్యేక జర్నలిస్టుల బందాన్ని దేశవ్యాప్తంగా ఉన్నా వివిధ బ్యాంకుల వివిధ బ్రాంచ్‌లకు పంపించి మేనేజర్లు, అసిస్టెంట్‌ మేనేజర్లు, ఇతర సీనియర్‌ అధికారులపై ‘స్టింగ్‌’ ఆపరేషన్‌ నిర్వహించగా సంచలన విషయాలు వెలుగుచూశాయి. ‘ఏం ఫర్వాలేదు. రోజుకు పది లక్షల రూపాయలను కొత్త నోట్లతో మార్చి ఇచ్చేస్తాం. ఇలా 50 లక్షల రూపాయల వరకు మారుస్తాం. అలా ఎంతో మందికి ఇప్పటి వరకు మార్చి ఇచ్చాం. మీకు కూడా ఇస్తాం. ఈ పని చేసినందుకు  20 శాతం కమిషన్‌ ఇవ్వాలి. మీరు చేయాల్సిందిల్లా మేము సూచించిన బ్యాంక్‌ ఖాతాల్లో వేయాలి. ఆ ఖాతాలు మా కనుసన్నల్లోనే ఉంటాయి’ అని ఓ బ్యాంకు అధికారి భరోసా ఇచ్చారు.

‘20 లక్షల రూపాయల వరకు మారుస్తాం. ఏం ఫర్వాలేదు. మా సహచరులకు ఈ బ్యాంకుల్లో చాలా ఖాతాలు ఉన్నాయి. కొంత మంది నిజమైన ఖాతాదారులు కూడా మేము చెప్పినట్లు వింటారు. ఎందుకంటే వారు ఖాతాలు తెరవడానికి మేమే సహకరించాం కదా. వారి ఖాతాల్లో రెండు నుంచి రెండున్నర లక్షల రూపాయల వరకు రద్దయిన నోట్లను వేయండి. ఆ మేరకు కొత్త నోట్లను తీసుకెళ్లండి. ఇంతవరకు అలాగే నాలుగైద కోట్ల రూపాయలను మార్చి ఇచ్చాం. అయితే 30 శాతం కమిషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది.....మేం ఊరూరా ఇటీవలనే కొత్త ఖాతాలను తెరిచాం. మేమిచ్చే ఏ ఖాతాల ద్వారానైనా రెండున్నర లక్షల రూపాయలకు మించకుండా పాత నోట్లను డిపాజిట్లు చేయండి. ఆ మేరకు కొత్త నోట్లను ఇస్తాం. ఆ, పది పదేహేను లక్షలంటే వంద నోట్లను కూడా ఇవ్వగలం. ఇక్కడే కాదు, రాష్ట్రంలోని మా అన్ని బ్యాంకుల్లో ఏ బ్యాంకు నుంచైనా మీరు ఎప్పుడైనా డబ్బును విత్‌డ్రా చేసుకునే వెసలుబాటు కల్పిస్తాం. ఆ పూచీ మాది. అయితే 20 శాతానికి తగ్గకుండా కమిషన్‌ ఇవ్వాలి’ అని మరో బ్యాంక్‌ అధికారి ఆఫర్‌.

‘కమిషన్‌ ముందుగా ఇస్తేనే పాత నోట్లను మార్చిస్తాం. దానికి చేయాల్సిందల్లా మీరు 8 నుంచి 10 బ్యాంకు ఖాతాలను తెరవాలి. అందుకు మేమే సహకరిస్తాం. రెండు లక్షల చొప్పున ఈ ఖాతాల్లో డిపాజిట్‌చేసి మీకు ఇష్టం ఉన్నప్పుడు విత్‌ డ్రా చేసుకోవచ్చు....మా సహచరలకే ఒక్కొక్కరి ఇదే బ్యాంకులో నాలుగైదు అకౌంట్లు ఉన్నాయి. మీమంతా కలసి మీకు సహకరిస్తాం. 30 శాతం కమిషన్‌ ఇస్తే మీ పాత నోట్లను వీలైనంత ఎక్కువగా మార్చి పెడతాం. ఆదాయం పన్ను శాఖ భయం అవసరం లేదు. అన్ని జాగ్రత్తలు మేము తీసుకుంటాం. ఎవరికి అనుమానం రాకుండా అంత సవ్యంగా నడిచిపోతుంది’ అంటూ మరో బ్యాంక్‌ ఉన్నతాధికారి ‘స్టింగ్‌’ అపరేషన్‌లో దొరికి పోయారు.

జర్నలిస్ట్‌ బందం స్టింగ్‌ ఆపరేషన్‌లో దొరికి పోయిన వారిలో ప్రతిష్టాకరమైన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ లాంటివి ఉన్నాయి. ఈ కుంభకోణం ఒక్క ప్రాంతానికో ఒక్క బ్రాంచీకో పరిమితం కాలేదు. ఢిల్లీ, అహ్మదాబాద్, గజియా బాద్‌తోపాటు దేశమంతటా విస్తరించింది. ఇలాంటి అవినీతి ప్రభుత్వ  బ్యాంకుల్లో చాలా తక్కువుండగా, ప్రైవేటు బ్యాంకుల్లోనే ఎక్కువగా ఉంది. ఇలాంటి కుంభకోణం కారణంగానే యాక్సిస్‌ బ్యాంక్‌ ఢిల్లీ బ్రాంచిపై సీబీఐ అధికారులు ఇటీవల దాడులు చేసి అక్రమార్కులను అరెస్ట్‌ చేసిన విషయం తెల్సిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement