‘బయ్యారం’ ఇప్పట్లో లేనట్లే! | Sakshi
Sakshi News home page

‘బయ్యారం’ ఇప్పట్లో లేనట్లే!

Published Fri, Aug 28 2015 1:42 AM

‘బయ్యారం’ ఇప్పట్లో లేనట్లే!

సాక్షి, హైదరాబాద్: ఏపీ పునర్విభజన చట్టం-2014 ప్రకారం ఇచ్చిన హామీ మేరకు ఖమ్మం జిల్లా బయ్యారంలో ప్రతిపాదించిన ఉక్కు కర్మాగార నిర్మాణం ఇప్పట్లో పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదు. పరిశ్రమ నిర్మాణం సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం ఏర్పాటైన జాయింట్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ముడి ఇనుము నిక్షేపాలున్నట్లు నివేదికలో పేర్కొంది. బయ్యారంలో లభిస్తున్న ముడి ఇనుములో 65 శాతం నాణ్యత ఉన్నట్లు గుర్తించారు.

ఈ నివేదికలో పేర్కొన్న అంశాలపై స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) కూడా దృష్టి సారించింది. 200 మిలియన్ టన్నుల ముడి ఇనుప ఖనిజం నిక్షేపాలుంటేనే ఉక్కు కర్మాగారం పెట్టడం సాధ్యమవుతుందని సెయిల్ చెబుతోంది. ఒకేచోట 200 మిలియన్ టన్నుల ముడిఇనుము లభించడం అసాధ్యమని టాస్క్‌ఫోర్స్ ప్రాథమిక నివేదిక వెల్లడించింది. మరోవైపు సెయిల్ ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ఇవ్వాల్సిన రాయితీలను కూడా నివేదికలో పొందుపరిచారు. ఎక్సైజ్ డ్యూటీ, కార్పొరేట్, కస్టమ్స్, సేవా పన్నుల మినహాయింపు, సెయిల్ తీసుకునే రుణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారంటీ ఇవ్వడం వంటి అంశాలను పేర్కొన్నారు.
 
ప్రాథమిక నివేదిక అసమగ్రం
నివేదికపై టాస్క్‌ఫోర్స్ సభ్యులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు 3 పర్యాయాలు సమావేశమయ్యాయి. నివేదికలోని అంశాలు అసంపూర్తిగా ఉన్నాయని, ముడి ఖనిజం లభ్యతపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని ఆదేశించాయి. కేవలం ఒకట్రెండు ప్రాంతాల్లో నమూనాలు తీసుకుని ముడి ఇనుము లభ్యతపై అంచనాకు రావడం శాస్త్రీయంగా లేదనే అభిప్రాయం వ్యక్తమైంది. కర్మాగారం ఏర్పాటుకు అవసరమైన రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

అయితే బయ్యారంలో నిక్షేపాల లభ్యత, నాణ్యత కర్మాగారం ఏర్పాటుకు అవసరమైనంత మేర ఉండకపోవచ్చని మైనింగ్ విభాగం అనుమానం వ్యక్తంచేస్తోంది. ఎక్కువ నమూనాలు విశ్లేషించి తుది నివేదిక సమర్పించేందుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలలు పట్టే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. పరిస్థితులన్నీ అనుకూలిస్తే కర్మాగారం నిర్మాణానికి కనీసం ఐదేళ్లు పడుతుందని సెయిల్ వర్గాలు ఇదివరకే చెప్పాయి. ఈ నేపథ్యంలో బయ్యారంలో సెయిల్ ఉక్కు కర్మాగారం ప్రతిపాదన ఇప్పట్లో కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు.
 
బయ్యారం నేపథ్యం ఇదీ...
బయ్యారంలో 3 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సమీకృత ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు గతంలో సెయిల్ సుముఖత వ్యక్తం చేసింది. తొలి దశలో రూ.వెయ్యి కోట్ల వ్యయంతో బెనిఫికేషన్, పెల్లెట్ ప్లాంటు, రెండో దశలో ఉక్కు తయారీ యూనిట్ ఏర్పాటును ప్రతిపాదించింది.

ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, కర్ణాటక తరహాలో పర్యావరణానికి హాని కలగని రీతిలో పరిశ్రమ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పన, ప్రోత్సాహకాలు ఇస్తామని సీఎం కేసీఆర్ గతంలోనే హామీ ఇచ్చారు. అయితే ఉక్కు కర్మాగారం ఏర్పాటులో టాస్క్‌ఫోర్స్ తుది నివేదిక కీలకం కానుంది.
 
మంత్రి హరీశ్ సమీక్ష
బయ్యారంలో ముడి ఇనుము లభ్యతపై టాస్క్‌ఫోర్స్ తుది నివేదికను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని నీటిపారుదల, మైనింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. క్షేత్రస్థాయి సర్వేలో కీలకంగా వ్యవహరిస్తున్న మైనింగ్, సింగరేణి, భూ భౌతిక పరిశోధన సంస్థ అధికారులతో గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

నమూనాల సేకరణకు అవసరమైన డ్రిల్లింగ్‌లో సింగరేణి సహకారం తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు జరిగిన సర్వే తీరుతెన్నులు, టాస్క్‌ఫోర్స్ ప్రాథమిక నివేదికపై చర్చించారు. సమావేశంలో సింగరేణి సీఎండీ శ్రీధర్, టీఎస్‌ఎండీసీ ఎండీ లోకేశ్ కుమార్, డెరైక్టర్ మంగీరాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement