బీసీల కోసం రాజకీయ పార్టీ | Sakshi
Sakshi News home page

బీసీల కోసం రాజకీయ పార్టీ

Published Mon, Aug 24 2015 2:21 AM

బీసీల కోసం రాజకీయ పార్టీ

* చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లకు ఉద్యమం
* జాతీయ స్థాయి సదస్సులో ఆర్.కృష్ణయ్య

సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టేలా దేశవ్యాప్తంగా ఐక్య ఉద్యమాన్ని నిర్మించనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చెప్పారు. ఇందు కోసం జాతీయ స్థాయిలో కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. బిల్లుకు మద్దతుగా పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, వివక్ష నేతలతో భేటీలు నిర్వహించి, ఆయా అసెంబ్లీలలో ఏకగ్రీవ తీర్మానాల కోసం ప్రయత్నిస్తామన్నారు.

దీని కోసం ముందస్తుగా ఆయా రాజకీయ పార్టీల నుంచి లేఖలు కోరతామని తెలిపారు. బిల్లుకు మద్దతు ఇవ్వని పార్టీలను బీసీ వ్యతిరేక పార్టీలుగా ముద్రవేసి, వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే బీసీల కోసం జాతీయ స్థాయిలో తానే స్వయంగా ఓ రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు. విస్తృత ప్రచారం కోసం ప్రజల భాగస్వామ్యంతో టీవీ చానల్ సహా దినపత్రిక ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం అబిడ్స్ తాజ్‌హోటల్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అధ్యక్షతన జరిగిన ‘బీసీ జాతీయ మేధోమథనం’ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

జాతీయస్థాయి నిపుణులతో పది కమిటీలు ఏర్పాటు చేసి 29 రాష్ట్రాల్లో పర్యటించి బీసీ బిల్లుకోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సదస్సు తీర్మానించింది. ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతాంగంలో మెజారిటీగా బీసీ సామాజిక వర్గాల రైతులే ఉన్నారని, ఇలాంటి మరణాలు పునరావృతం కాకుండా వ్యవసాయ శాస్త్రవేత్తలతో ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఫిక్కీ, డిక్కీ తరహాలో బీసీ పారిశ్రామిక వేత్తలతో జాతీయ స్థాయి వాణిజ్య, పారిశ్రామిక, కాంట్రాక్టర్ల మండలి ఏర్పాటుకు ఒత్తిడి చేయాలని తీర్మానించారు.

ఈ సదస్సులో ఆచార్య ప్రమోద్ తిర్ తుళ్, కలైష్ బాపు భుజ్‌బల్(మహారాష్ట్ర), ఆచార్య యోగేంద్రనాథ్(న్యూఢిల్లీ),రమణ్‌సింగ్(జార్ఘండ్), ఆచార్య బీరేంద్రయాదవ్(యూపీ), డా. అశ్విన్‌గురు(కేరళ), డా.వల్లభనన్(తమిళనాడు), డా.రెవణప్ప (కర్ణాటక), బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు, సదస్సు సమన్వయకర్త గుజ్జ కృష్ణ, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ వివిధ ఉద్యోగ, ప్రజా సంఘాల ప్రతినిధులు ఆచార్యులు సుబ్బాచారి, మన్య చెన్నప్ప, ప్రజాశక్తి పూర్వ సంపాదకుడు విన య్‌కుమార్, కాలువ మల్లయ్య, కత్తి వెంకటస్వామి, శారదా గౌడ్, ప్రసాద్, భూపతి వెంకటేశ్వర్లు, కత్తి కవిత, న్యాయవాది జనార్ధన్ మాట్లాడారు.   

జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు. బీసీల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సాంస్కృతిక, భావ జాల ఉద్యమాన్ని... తెలంగాణ పోరాటంలా చేపట్టాలన్నారు. ఈ సదస్సులో 10 రాష్ట్రాల నుంచి 200 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement