Sakshi News home page

రిప్లై ఇచ్చి వుంటే నా ఫ్రెండ్‌ బతికేవాడు!

Published Tue, Sep 6 2016 11:44 AM

రిప్లై ఇచ్చి వుంటే నా ఫ్రెండ్‌ బతికేవాడు! - Sakshi

న్యూఢిల్లీ: 'ఆమిటీ యూనివర్సిటీ ఫౌండర్‌- ప్రెసిడెంట్‌ డాక్టర్‌ అశోక్‌ చౌహాన్‌కు నా స్నేహితుడు గత మే నెలలో లేఖ రాశాడు. తను పరీక్షలు రాసేందుకు దయచేసి అనుమతించాలని కోరాడు. అంతేకాకుండా ఆయనకు ఓ ఈమెయిల్‌ కూడా పంపించాడు. ఒక సంవత్సరం చదువును నిలిపేస్తే తన జీవితం నాశనమవుతుందని పేర్కొన్నాడు. దానిని తాను మానసికంగా తట్టుకోలేనని పేర్కొన్నాడు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. నా స్నేహితుడి ఈమెయిల్‌కు సమాధానం ఇచ్చి ఉంటే ఈ రోజు నా స్నేహితుడు బతికి ఉండేవాడు'..  ఢిల్లీలోని ఆమిటీ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న సుశాంత్‌ రోహిల్లా (20) స్నేహితుడు రాఘవ శర్మ ఆవేదన ఇది. ఈ ఘటనపై రాఘవ శర్మ రాసిన లేఖను సుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. న్యాయశాస్త్ర విద్యార్థి సుశాంత్‌ రోహిల్లా ఆత్మహత్యకు వేధింపులే కారణమన్న అనుమానం ఉందని పేర్కొంది. ఈ కేసులో తనకు సహాయం అందించడానికి ప్రఖ్యాత న్యాయకోవిదుడు ఫాలి నారీమన్‌ను సుప్రీంకోర్టు నియమించింది.

ఆమిటీ వర్సిటీ లా స్కూల్‌లో చదువుతున్న సుశాంత్ రోహిల్లా గతనెల తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. తగినంత హాజరుశాతం లేదనే కారణంతో మూడో సంవత్సరం పరీక్షలు రాయనిచ్చేందుకు వర్సిటీ అధికారులు సుశాంత్‌ను అనుమతించలేదు. దీంతో తాను వైఫల్యం చెందిన భావన కలిగిందని సుశాంత్‌ తన ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు.

ప్రొఫెసర్ల వేధింపుల కారణంగానే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడని సహచర విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇందుకు కారణమైన ప్రొఫెసర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఇటు సోషల్‌ మీడియాలోనూ, అటు క్యాంపస్‌లో నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ వివాదంలో ఇప్పటికే ఇద్దరు ప్రొఫెసర్లు రాజీనామా చేశారు.

ఈ నేపథ్యంలో సుశాంత్‌ ఆత్మహత్యకు కారణమైన ఆమిటీ వర్సిటీపై విచారణ జరుపాలని కోరుతూ అతని స్నేహితుడు, సహచర విద్యార్థి అయిన రాఘవ శర్మ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌కు లేఖ రాశారు. అతని లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌)గా స్వీకరించిన సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. క్యాంపస్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రైవేటు యూనివర్సిటీ అయిన ఆమిటీకి సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.

 

Advertisement

What’s your opinion

Advertisement