Sakshi News home page

ఇల్లు కొందామా..? అద్దెకుందామా?

Published Mon, Jan 18 2016 11:21 PM

ఇల్లు కొందామా..?  అద్దెకుందామా?

స్థిర నివాసానికైతే సొంతిల్లే బెటర్ సొంత చిరునామా; ఎనలేని మానసిక తృప్తి ఇల్లు కొనేందుకు రుణం తీసుకోవటమే నయం ఆదాయపు పన్ను మినహాయింపు, రాయితీలు కారణం ఇన్వెస్ట్‌మెంట్‌గా లెక్కిస్తే మాత్రం అద్దెకుండటమే ఉత్తమం ఇంటిపై కన్నా ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లోనే ఎక్కువ రాబడి ఇంగ్లీషులో ఓ సామెతుంది. ఫూల్స్ బిల్డ్ హౌసెస్ అండ్ వైజ్‌మెన్ లివ్ ఇన్ ఇట్... అని. తెలివిలేని వాళ్లు ఇల్లు కట్టుకుంటారని... తెలివైన వాళ్లు అందులో అద్దెకుంటారని అర్థం.

 

అన్ని సందర్భాల్లో ఇది నిజమని చెప్పలేం. ఏదైనా దరఖాస్తు నింపేటపుడు ‘మీ ఇంటి చిరునామా శాశ్వతమా.. లే క తాత్కాలికమా’ అనే ప్రశ్న ఎదురైతేనో... ఇంటి యజమాని అప్పటికప్పుడొచ్చి ఖాళీ చేసెయ్యాలని చెబితేనో, అద్దెకుంటారు కనక మీకు ఏ సౌకర్యాల గురించీ మాట్లాడే అర్హత లేదని అపార్ట్‌మెంట్ సంఘం చెబితేనో... అలాంటి సందర్భాల్లో సొంతింటి విలువకు వెల కట్టలేం. ముందు సొంతిల్లు... ఆ తరవాతే ఏదైనా... అనిపించే సందర్భాలు అలాంటివి చాలానే ఉంటాయి. అందుకే సొంతిల్లు, అద్దె ఇల్లు... ఈ రెండిట్లో ఏది బెటరనేది ముందుగా తెలుసుకోవాల్సిన అవసరముంది. అందుకే- ‘ఇల్లు కొనడమా.. అద్దెకుండటమా’ ఏది ఉత్తమమన్నది ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనంతో మీరే నిర్ణయించుకోండి మరి!!
 
మార్జిన్ మనీ ఉంటే సరిపోదు..

చేతిలో కొంత సొమ్ము ఎలాగూ ఉంది. అది మార్జిన్ మనీగా పనికొస్తుంది. మిగిలిన మొత్తాన్ని  బ్యాంకుల దగ్గరో... ఆర్థిక సంస్థల దగ్గరో గృహ రుణంగా తీసుకుంటే సరిపోతుందని చాలామంది అనుకుంటుంటారు. కాకపోతే ఈ విషయంలో కొంచెం ఆలోచించాల్సిన అవసరం  కూడా ఉంది. ఎందుకంటే సొంతింటికి మార్జిన్ మనీ కట్టాక ఇంకా చేతిలో ఎంత మిగులుతుందన్నది చూడాలి. ఎంత కొత్త ఇల్లయినా ఒకోసారి అనుకోని మరమ్మతులు రావచ్చు. అపార్ట్‌మెంట్లకయితే కామన్ వసతులపై ఎప్పటికప్పుడు అదనంగా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.

ఎంతో కష్టపడి దాచుకున్న సొమ్మును మార్జిన్ మనీగా చెల్లిస్తే అప్పటివరకు బ్యాంకు నుంచి వస్తున్న వడ్డీ కూడా ఆగిపోతుంది. పైగా ఇంటి రుణం ఈఎంఐ భారమూ మీద పడుతుంది. గృహ రుణం కాకుండా మార్జిన్ మనీ కూడా అప్పు తెచ్చే పరిస్థితి అయితే సొంతింటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. కాబట్టి ఇల్లు కొనేముందు ఈ లెక్కల్ని
 తప్పనిసరిగా చూసుకోవాలి.
 
మొదట్లో నష్టమనిపించినా.. తర్వాత లాభమే

నష్టభయం లేని పెట్టుబడి ఏదంటే.. స్థిరాస్తే. బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్‌కి కూడా ధరల పెరుగుదల అనే ద్రవ్యోల్బణం భయం ఉంటుంది. కానీ స్థిరాస్తికి అలాంటివేవీ ఉండవు. బ్యాంకుకు చెల్లించే ఈఎంఐ, ఇంటికి కట్టే అద్దెతో పోల్చుకుంటే సొంతిల్లు మొదట్లో నష్టంలాగే అనిపిస్తుంది. కానీ, కొన్నేళ్ల తర్వాత ఇంటి విలువ పెరగటంతో పాటు... సంపాదన కూడా పెరిగి చెల్లిస్తున్న ఈఎంఐ విలువ తగ్గుతుంది. అంటే ఈఎంఐ మొత్తం తగ్గకపోయినా దాని విలువ తగ్గినట్టే లెక్కించాలి. ఆ లెక్కన ఇంటి రుణం ఇల్లే తీర్చుకుంటుందంటారు కొందరు.

ఆ తర్వాత ఇంటిపై వచ్చే అద్దె పింఛనులాగా ఉపయోగపడుతుంది. ఇంటి రుణం కోసం దాచుకున్న డబ్బుపై ఆదాయానికి పన్ను లేకుండా చూసుకోవడానికి మార్గాలున్నాయి. ఒకవేళ పన్ను కట్టినా అది కొంతకాలమే!. సొంత డబ్బు ఉన్నా, ఇంటి రుణం తీసుకొని ఇల్లు కట్టడమే మేలు. ఇంటి రుణంపై వడ్డీ ఏడాదికి రూ.2 లక్షల వరకు, అసలుకు కట్టే మొత్తం రూ.1.50 లక్షల వరకు (ప్రస్తుత నిబంధనల మేరకు) ఆదాయపు పన్ను రాయితీ లభిస్తుంది. పెరిగే ధరలు, ఆదాయపు పన్ను రాయితీ లెక్కిస్తే ఇంటి రుణంపై మనం కట్టే వడ్డీ దాదాపు ఏమీ లేనట్టే. చాలా మంది ఇంటి రుణం తీసుకొని ఇల్లు కట్టుకోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఆదాయపు పన్ను రాయితీనే.
 
అధిక లాభాలకైతే అద్దె ఇల్లే బెటర్..

పాలు కావాలనుకుంటే గేదెనే కొనక్కర్లేదు. పాలమ్మే వాళ్ల దగ్గర కూడా కొనుక్కోవచ్చు. అలాగే మనక్కావల్సిన సౌకర్యాల కోసం సొంతిల్లే కొనక్కర్లేదు. అవి ఉండే ఇంట్లో అద్దెకున్నా చాలు. ఇంటి రుణానికి చెల్లించే ఈఎంఐ బదులు అదే సొమ్మును మంచి మ్యూచువల్ ఫండ్‌లో దీర్ఘకాలం పెట్టుబడి పెడుతూ వెళితే 12-15 శాతం వార్షిక రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఇంటి విలువైతే అంతగా పెరగదు. 20 ఏళ్ల పాటు ఈఎంఐలను కట్టుకుంటూ వెళ్తే ఇంటి విలువ కోటి రూపాయలు అయ్యిందనుకుందాం. బాగానే ఉంటుంది.

కానీ, అదే ఈఎంఐ మొత్తాన్ని మంచి రాబడి మార్గంలో పెడితే నాలుగు కోట్ల వరకూ నిధి సమకూరుతుంది. పదవీ విరమణ తర్వాత ఈ సొమ్మును 9 శాతం వడ్డీకి దాచుకున్నా నెలకు రూ.3 లక్షలు పింఛనులా పొందవచ్చు. మంచి పెట్టుబడి మార్గంలో నష్టభయం ఉన్నా.. అధిక లాభం వచ్చే అవకాశమూ ఉంటుంది. వీటితో పోలిస్తే ఇల్లు మాత్రం లాభసాటి కాదు.
 
సొంతింటికి పన్ను కట్టాల్సిందే..
షేర్ మార్కెట్లో ఏడాదికి పైగా పెట్టుబడిని కొనసాగించి కోటి రూపాయల లాభం పొందినా మన దేశంలో ఆదాయపు పన్ను కట్టక్కర్లేదు. కానీ, ఇల్లు కట్టుకోవటానికని రూ.2 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేసినా దానిపై వచ్చే వడ్డీకి 10 నుంచి 30 శాతం మధ్య ఆదాయపు పన్ను చెల్లించాలి.  స్థిరాస్తిలో పెట్టుబడిపై వచ్చే లాభానికి కూడా పన్ను కట్టాలి. కాకపోతే చాలామంది కట్టకుండా తప్పించుకుంటున్నారు. అది వేరే విషయం!!. కాబట్టి పెట్టుబడి పెట్టడానికి ఇంటిని వెతుక్కోవటం కంటే షేర్లు, ఎఫ్‌డీల్లో పెట్టుబడులు పెట్టడం ఉత్తమమన్నది నిపుణుల మాట.

అయితే ఇదంతా మంచి పెట్టుబడి కోసం చూసేవారికి మాత్రమే. ఎందుకంటే.. అద్దె ఇల్లు ఎప్పటికీ మన ఇల్లు కాదు. గోడలకు మేకులు కొట్టకూడదు. ఇంటి చుట్టూ యజమాని మొక్కలు పెంచుతుంటే మీకు ఇష్టం ఉన్నా లేకున్నా రోజూ నీళ్లు పెట్టాలి. యజమాని నిబంధనలు ఒకోసారి భరించలేని స్థాయిలో ఉంటాయి. పెపైచ్చు ఓనర్ ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు చేయాలి. తల దాచుకోవడానికి మనదంటూ ఒక సొంతిల్లు ఉండాలని చాలా మంది  కోరుకోవడానికి ఇదే కారణం కూడా.
 
కనీసం ఐదేళ్లు ఉండాలనుకుంటే..

ఇల్లు కొనాలన్నా.. అద్దెకుండాలన్నా ముందుగా నిర్ణయించుకోవాల్సింది అ ఇంట్లో ఎంత కాలం ఉంటామనేది. ఎందుకంటే దీర్ఘకాలం పాటు ఇంట్లో నివాసం ఉండాలనుకుంటే సొంతిల్లు కొనడమే మంచిది. ఇందుకు కనీసం ఐదేళ్ల కాలపరిమితి గీటురాయిగా పెట్టుకోవచ్చనేది   నిపుణుల సలహా. అదే ఐదేళ్ల లోపు గనక ఇల్లు మారే అవకాశం ఉంటే ఆ ఇంటిని కొనుగోలు చేయటం బదులు అద్దెకు ఉండటమే ఉత్తమం. అంటే ఇల్లు కొనుగోలు విషయంలో ముఖ్యంగా గమ నించాల్సింది ఉద్యోగ స్థిరత్వమన్నమాట. పని చేస్తున్న సంస్థలో ఎన్నాళ్లుంటారు? ట్రాన్స్‌ఫర్లు వంటివి అయ్యే అవకాశముందా? అనేవి పరిశీలించాల్సి ఉంటుంది.
 

Advertisement
Advertisement