విభజన ‘బాధ్యత’ మీదే : కిరణ్కు దిగ్విజయ్ సింగ్ హితబోధ | Sakshi
Sakshi News home page

విభజన ‘బాధ్యత’ మీదే : కిరణ్కు దిగ్విజయ్ సింగ్ హితబోధ

Published Tue, Aug 13 2013 8:44 AM

విభజన ‘బాధ్యత’ మీదే : కిరణ్కు దిగ్విజయ్ సింగ్ హితబోధ - Sakshi

రాష్ట్ర విభజన ప్రక్రియను పూర్తిచేసే బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానం పూర్తిగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపైనే ఉంచింది. ఈ మేరకు ఆయనకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో పార్టీ గీత దాటవద్దని కూడా ముఖ్యమంత్రికి సున్నితమైన హెచ్చరిక జారీ చేసింది. విభజనకు సంబంధించి సీఎం ఇటీవల విలేకరుల సమావేశంలో వ్యక్తంచేసిన అంశాలపై అదిష్టానానికి పలు ఫిర్యాదులు అందటంతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ ఇటీవల సీఎం కిరణ్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
 
 రాష్ట్ర విభజన ప్రక్రియను పూర్తి చేసే బాధ్యతను తీసుకోవాలని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన మాటగా చెప్పమన్నారని దిగ్విజయ్ ఈ సందర్భంగా సీఎంకు స్పష్టం చేసినట్లు అత్యున్నత స్థాయి విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సీఎం సందేహాలు వ్యక్తం చేసిన సాగునీరు, విద్యుత్, ఉద్యోగాలకు సంబంధించిన అంశాలను పార్టీ కోర్ కమిటీకి ఇప్పటికే తెలియజేసినందున మళ్లీ కొత్తగా అవే అంశాలను బహిరంగంగా వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని.. ఆ అంశాలను ఆంటోనీ కమిటీ పరిశీలిస్తుందని దిగ్విజయ్ పేర్కొన్నట్లు సమాచారం. సాగునీరు, విద్యుత్, ఉద్యోగుల అంశాలు తేలకుండా విభజన జరగటానికి వీల్లేదని కిరణ్ పేర్కొనటంపై ఇప్పటికే అధినేత్రికి పలు ఫిర్యాదులు అందాయని దిగ్విజయ్ పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పార్టీ అదిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ఉల్లంఘించేలా ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని, పార్టీ గీత దాటవద్దని, విభజన ప్రక్రియ సజావుగా సాగేలా చూడాల్సిన బాధ్యత సీఎందేనని ఆయన  స్పష్టంచేసినట్లు ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. సాధారణ పరిపాలన విషయాలపై దృష్టి సారించాలని, పాలనను స్తంభింపచేయరాదని కూడా దిగ్విజయ్ ముఖ్యమంత్రికి సూచించినట్లు తెలిపాయి.
 
 13 రోజుల తర్వాత సచివాలయానికి సీఎం
 ఇదిలావుంటే.. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం సచివాలయానికి రాకుండా కేవలం క్యాంపు కార్యాలయానికే పరిమితమైన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం సచివాలయానికి వచ్చారు. దిగ్విజయ్ సూచనలు, నిర్దేశాల నేపథ్యంలో సీఎం 13 రోజుల అనంతరం సోమవారం మధ్యాహ్నం 1 గంటలకు సచివాలయానికి వచ్చి 3.30 గంటల వరకూ అక్కడే ఉన్నారు. మంగళవారం నుంచి వివిధ కార్యక్రమాల అమలు తీరుపై సీఎం సమీక్షలు నిర్వహిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.

Advertisement
Advertisement