తెలంగాణ ఇవ్వాల్సిందే : రాజ్‌నాథ్ | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఇవ్వాల్సిందే : రాజ్‌నాథ్

Published Sun, Jan 19 2014 4:32 AM

తెలంగాణ ఇవ్వాల్సిందే : రాజ్‌నాథ్

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో పాటు సీమాంధ్రుల సమస్యలకు సముచిత రీతిలో పరిష్కారం చూపిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇందుకు తమ వద్ద కార్యాచరణ ప్రణాళిక సిద్ధంగా ఉందన్నారు. శనివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాలను ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అగ్రనేత ఎల్‌కే అద్వానీ, బీజేపీ ప్రధాని అభ్యర్ధి, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ, ఉభయసభల విపక్ష నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, మాజీ జాతీయ అధ్యక్షులు ఎం.ఎం.జోషి, ఎం.వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీలు పాల్గొన్నారు.
 
  హామీ ఇచ్చి ఐదేళ్లు  పూర్తికావస్తున్నా.. యూపీఏ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయలేకపోయిందని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షంగా తాము తెలంగాణకు మద్దతు ఇస్తామని చెప్పినప్పటికీ, కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలతో ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజించాల్సిందేనని, సీమాంధ్రుల సమస్యలను పరిష్కరించాల్సిందేనని రాజ్‌నాథ్ అన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనేది బీజేపీ ఆకాంక్ష అని  అన్నారు. సమస్యను పరిష్కరించకుండా రాజకీయ సమీకరణాలను కూడగట్టడంలో అత్యుత్సాహాన్ని చూపిస్తున్నదని విమర్శించారు. యూపీఏ విదేశాంగ విధానం ఘోరంగా ఉందన్నారు. ఇరుగుపొరుగు దేశాలు భారత్‌తో ఆడుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. కాగా, జాతీయ కౌన్సిల్‌లో రాజ్యసభ విపక్ష నేత అరుణ్ జైట్లీ ఆర్థిక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అవినీతి, కుంభకోణాలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రూపాయి విలువ పతనం, అనాలోచిత నిర్ణయాలతో దేశం సంక్షోభంలోకి వెళ్లిందని విమర్శించారు. తీర్మానంపై సీనియర్ నేత ఎం.ఎం. జోషీ, గడ్కరీలు చర్చించగా, శ్రీరాం వెదిరే, మురళీధరన్ సహా పలువురు నేతలు సవరణలు చేశారు. అనంతరం తీర్మానాన్ని కౌన్సిల్ ఆమోదించింది.
 
 నరేంద్రమోడీపై కాంగ్రెస్ దుష్ర్పచారం
 నిస్సహాయస్థితిలో పడిన కాంగ్రెస్ పార్టీ తమ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై దుష్ర్పచారానికి పాల్పడుతోందని రాజ్‌నాథ్ ధ్వజమెత్తారు. ముస్లింల ఓట్లకోసం కాంగ్రెస్ పార్టీయే ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. మోడీ ప్రధాని అయితే దేశానికే వినాశకరం అని ప్రధాని మన్మోహన్ అనడం ఆ ప్రచారంలో భాగమేనని విమర్శించారు. రాజ్‌నాథ్ ప్రసంగంలో ముఖ్యాంశాలు...
 
 ళీ    అధికారంలోకి వచ్చాక భారత్‌ను బలీయమైన దేశంగా తీర్చిదిద్దుతాం.
 ళీ    విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కు తెస్తాం.
 ళీ    కరెంట్ ఖాతా లోటు, ద్రవ్యలోటును నియంత్రిస్తాం. పన్నుల విధానంలో సంస్కరణలు తెస్తాం.
 ళీ    ఉద్యోగులకు, మధ్యతరగతి వర్గాలకు ఇన్‌కమ్‌ట్యాక్స్‌లోఊరటనిచ్చే చర్యలు చేపడతాం.
 ళీ    రైతులకోసం పంటల ఆదాయ బీమా పథకం అమలు చేస్తాం. రైతు కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పిస్తాం.
 ళీ    గనుల కేటాయింపుల్లో పారదర్శక విధానాలు అమలు చేస్తాం.  
 ళీ    పొరుగుదేశాలతో సత్సంబంధాలు  కొనసాగిస్తాం.
 ళీ    కుంభకోణాలు, అనాలోచిత నిర్ణయాలు, అధిక ధరలతో యూపీఏ భారత్‌ను పతనం చేసింది.
 ళీ    మోడీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం ఏర్పడకుండా కాంగ్రెస్ మిత్రపక్షాలు, విదేశీ శక్తులు కుట్రలు పన్నుతున్నాయి.
 ళీ    పాకిస్థాన్ నుంచి ‘మోస్ట్ ఫేవర్ నేషన్’గా పతకం తీసుకోడానికి కేంద్రం అశపడుతోంది.
 
 370 అధికరణపై అభ్యంతరం లేదు
 జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేకప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370 అధికరణపై తమకు అభ్యంతరం లేదని రాజ్‌నాథ్ తెలిపారు. కాశ్మీర్ ప్రగతికి ఆర్టికల్ 370 దోహదపడితే మంచిదేనన్నారు. అలాకాకుండా ఆ రాష్ట్రాన్ని జాతీయ జీవనస్రవంతిలో కలవకుండా అది అడ్డుపడుతుంటే మాత్రం దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. కాంగ్రెస్ అనుసరించిన తప్పుడు విధానాల వల్ల స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి దేశం ఎదుర్కొంటున్న కీలకమైన సమస్యల్లో కాశ్మీర్ ఒకటని రాజ్‌నాథ్ అన్నారు. జాతివ్యతిరేకశక్తులకు అలుసు ఇవ్వడానికి బీజేపీ వ్యతిరేకమన్నారు. కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని ఆయన చెప్పారు. ఆర్టికల్ 370 తొలగించాలని బీజేపీ చాలాకాలంగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. మీడియాకు అందజేసిన ఆయన ప్రసంగపాఠంలో ఈ వ్యాఖ్యలు లేకపోవడం గమనార్హం.

Advertisement
Advertisement