ఆర్టికల్ 370 పై చర్చ జరగాలి | Sakshi
Sakshi News home page

ఆర్టికల్ 370 పై చర్చ జరగాలి

Published Mon, Dec 2 2013 12:40 AM

ఆర్టికల్ 370 పై చర్చ జరగాలి - Sakshi

జమ్మూ: రాజ్యాంగంలోని ఆర్టికల్ 370.. జమ్మూ,కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే అధికరణం. దాన్ని రద్దు చేయాలనేది ఇప్పటివరకు బీజేపీ ప్రధాన డిమాండ్లలో ఒకటి. అయితే, ఆ డిమాండ్‌పై బీజేపీ కాస్త మెత్తబడుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రానికి ఆ అధికరణం వల్ల ప్రయోజనం చేకూరిందని తేలితే రద్దు డిమాండ్‌ను వదులుకోవడానికి సిద్ధమేనంటూ సూచనలిచ్చింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి హోదాలో నరేంద్రమోడీ మొట్టమొదటిసారి ఆదివారం జమ్మూలో ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఆర్టికల్ 370కి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరగాలని బీజేపీ కోరుకుంటోందన్నారు. సభలో మోడీ కన్నా ముందు ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు. ఆయన కూడా ఆర్టికల్ 370తో రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కలిగిందని నిర్ధారణ అయితే, అందుకనుగుణంగా తమ విధానాన్ని మార్చుకుంటామని స్పష్టం చేశారు.
 
 మోడీ తన ప్రసంగంలో ఆర్టికల్ 370ని ప్రస్తావిస్తూ..  దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగా జమ్మూ, కాశ్మీర్‌లో మహిళలకు సమానహక్కులు లేవన్నారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఉదాహరణగా తీసుకుంటూ ‘ఒమర్ అబ్దుల్లా కాశ్మీర్‌కు చెందని మహిళలను వివాహం చేసుకుంటే ఆయనకు రాష్ట్ర పౌరసత్వానికి సంబంధించిన హక్కులకు ఎలాంటి భంగం కలగదు. అదే వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిని పెళ్లాడిన ఆయన సోదరి సారా(కేంద్రమంత్రి సచిన్ పైలట్ భార్య) ఈ రాష్ట్ర పౌరసత్వ హక్కులను కోల్పోయింది. ఇది వివక్ష కాదా?’ అని ప్రశ్నించారు. మతతత్వవాదానికి ఒక కవచంలా ఆర్టికల్ 370 ఉపయోగపడిందని మోడీ ఆరోపించారు.
 
 రాష్ట్రప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, అవినీతి నిరోధక చట్టం దేశంలో ఇక్కడ మాత్రమే వర్తించదని ఆయన వ్యాఖ్యానించారు. టూరిజాన్ని పట్టించుకోవడంలేదని, ప్రత్యేక రాష్ట్రం పేరిట వేర్పాటువాదాన్ని ప్రోత్సహించారని ఆరోపించారు. కాశ్మీర్‌పై మాజీ ప్రధాని వాజ్‌పేయి రూపొందించిన ‘ఇన్సానియత్, జమ్హూరియత్, కశ్మీరియత్’ విధానాన్ని ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర సమస్యలపై బీజేపీ సిద్ధాంతకర్త శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ పేర్కొన్న విధానం సరైందని, మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అవలంబించిన విధానం సరైంది కాదని వివరించారు. మోడీ పర్యటన సందర్భంగా జమ్మూలో భారీగా భద్రతాఏర్పాట్లు చేశారు. సభ జరిగిన ఎంఏ స్టేడియం భారీగా తరలివచ్చిన ప్రజలతో నిండిపోయింది. స్టేడియం వెలుపల కూడా ప్రజలు భారీగా కనిపించారు.
 
 కాగా, రాష్ట్రంలో మహిళల హక్కుల విషయంపై మోడీ వ్యాఖ్యలు చేయడంపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ‘ఆయనకు నిజాలు తెలియదో, లేక అబద్ధాలు ఆడుతున్నారో తెలియదు’ అని ట్వీట్ చేశారు.
 

Advertisement
Advertisement