మండుతున్న ఎండలు | Sakshi
Sakshi News home page

మండుతున్న ఎండలు

Published Fri, May 1 2015 12:35 AM

Blazing sunshine

  • రెండు రోజులుగా పెరుగుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు
  • మేలో మరింత వేడి తప్పదంటున్న వాతావరణ శాఖ
  • సగటున గతం కంటే 1 డిగ్రీ మేర పెరిగే అవకాశం
  • తీవ్ర వడగాలులు.. ఉరుములు, మెరుపులతో వర్షాలు
  • రాజధాని భగభగ.. తీవ్రంగా ఉక్కపోత
  • సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు రోజురోజుకూ ముదురుతున్నాయి. మూడు రోజులుగా భగభగలాడుతున్న భానుడు.. మే నెలలో మరింత ఉగ్రరూపం దాల్చనున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా రెండు రోజులుగా ఈ సీజన్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజధాని హైదరాబాద్‌లో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. ఈసారి గతంతో పోల్చితే ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మే నెలలో ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య కొనసాగుతాయని, కొన్నిరోజులు ఇంతకంటే ఎక్కువ వేడి ఉండే అవకాశముందని పేర్కొంటున్నారు. గతేడాది కంటే కనిష్టంగా ఒక డిగ్రీ ఎక్కువగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భావిస్తున్నారు. ఇదే సమయంలో వడగాడ్పులు వీస్తాయని.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.
     
    దడ పుట్టించేలా వడగాడ్పులు..

    రాష్ట్రం దక్షిణ పీఠభూమి ప్రాంతంలో విస్తరించి ఉన్నందున వేసవిలో వడగాలులు అధికంగా వీస్తాయి. ఈ ఏడాది వీటి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ భావిస్తోంది. మే రెండో వారం నుంచి వడగాడ్పులు పెరిగే అవకాశముంది. రాష్ట్రంలో ఎండలు, వడగాలుల కారణంగా వడదెబ్బకు గురై గతేడాది అనేక మంది వృద్ధులు, రోగులు మరణించారు. ఈ నేపథ్యంలో ఈసారి మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని వాతావారణ శాఖ సూచిస్తోంది.
     
    రాజధాని భగభగ..

    భానుడి ప్రకోపానికి రెండు రోజులుగా రాజధాని హైదరాబాద్ భగభగలాడిపోతోంది. సీజన్‌లో తొలిసారిగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. బుధ, గురువారాల్లో వరుసగా 40.6, 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉక్కపోత కారణంగా నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. మధ్యాహ్న సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. నగరంలో ఈసారి గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.
     
    రాష్ట్రంలో ఈ ఏడాది సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. కనిష్టంగా 1 డిగ్రీ మేర ఎండలు పెరుగుతాయి. మే నెలలో వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కొన్ని సార్లు  వేగంగా గాలులు వీస్తాయి. క్యుములోనింబస్ మేఘాల కారణంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. మొత్తంగా ఈ ఏడాది వేసవిలో ఎండలు, గాలులు, వానలు గతం కంటే అధికంగా ఉంటాయి.
     - వై.కె.రెడ్డి, వాతావరణ శాఖ
     హైదరాబాద్ విభాగం
     ఇన్‌చార్జి డెరైక్టర్

Advertisement
Advertisement