Sakshi News home page

బీఎండబ్ల్యు సీఈవో ఇలా పడిపోయారు..

Published Tue, Sep 15 2015 4:34 PM

బీఎండబ్ల్యు సీఈవో ఇలా పడిపోయారు.. - Sakshi

జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరుగుతున్న 'ఆటో మొబైల్ షో' సందర్భంగా మంగళవారం ఉదయం బీఎండబ్ల్యు  చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హరాల్డ్ క్రూగర్ కళ్లు తిరిగి పడిపోయారు. లగ్జరీ కార్ల ఉత్పత్తిలో పేరుగాంచిన బీఎండబ్ల్యు  కొత్తగా తయారు చేసిన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ 'ఐ8 సూపర్ కార్' ఆవిష్కరణ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

విలేకరుల సమావేశంలో మాట్లాడేందుకు కంపెనీ సీఈవో 49 ఏళ్ల  హరాల్డ్ క్రూగర్‌ను కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు స్టేజ్‌పైకి ఆహ్వానించారు. ఆయనకు స్టేజ్ ఎక్కగానే కళ్లు తిరిగాయి. ఎడమ చేతి మీదుగా కింద పడిపోయారు. తల నేలకు తగలకుండా రెండు చేతులు తల కింద పెట్టుకున్నారు. ఇంతలో ఇద్దరు కంపెనీ ఉద్యోగులు వచ్చి ఆయన్ని పక్కకు తీసుకెళ్లారు. విలేకరుల సమావేశాన్ని రద్దుచేసి తర్వాత నిర్వహిస్తామని ప్రకటించారు. హరాల్డ్‌ను డాక్టర్ వచ్చి పరీక్షించారని, కాస్త అస్వస్థత కారణంగా కళ్లు తిరిగాయని, ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు లేదని డాక్టరు తేల్చినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ రోజు ఉదయం నుంచే ఆయనకు ఒంట్లో నలతగా ఉండిదని ఆ వర్గాలు చెప్పాయి.

ఐ8 సూపర్ కార్ ఇంతకుముందు బీఎండబ్ల్యు విడుదలచేసిన కార్ల కంటే భిన్నమైనది. ఇందులో 1.5 లీటర్ మూడు సిలిండర్ల పెట్రోలు ఇంజన్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఇంజను కారు చక్రాలను తిప్పడానికి కాకుండా కారులోని లిథీయమ్ అయాన్ బ్యాటరీలను చార్జి చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.

Advertisement
Advertisement