బోగస్ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ సీట్లు | Sakshi
Sakshi News home page

బోగస్ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ సీట్లు

Published Thu, Oct 15 2015 3:00 AM

బోగస్ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ సీట్లు

విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): కొంతమంది విద్యార్థులు బోగస్ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ సీట్లు పొందిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ బుధవారం హెల్త్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇటీవల ముగిసిన మెడికల్ కౌన్సెలింగ్‌లో ఏడుగురు అగ్రకుల అభ్యర్థులు బీసీ బోగస్ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ సీట్లు పొందారు.

వీరిలో ఐదుగురు ఏపీ ఎంసెట్, మరో ఇద్దరు తెలంగాణ ఎంసెట్‌లో ర్యాంకులు పొంది సీట్లు దక్కించుకున్నారు. వారందరూ కర్నూలు జిల్లా కల్లూరు మండలం తహసీల్దార్ శివరాముడు జారీచేసినట్లు ఉన్న కుల ధ్రువపత్రాలు సమర్పించడంతో అనుమానం వచ్చినట్లు మంత్రి తెలిపారు. అనంతపురం, కాకినాడ, కరీంనగర్ జిల్లాల వారు కల్లూరు మండలంలో ఉంటున్నట్లుగా నివాస ధ్రువీకరణ పత్రాలు ఇచ్చినట్లు చెప్పారు.

ఈ ఏడుగురిలో ఆరుగురు బాలికలు కావడం విశేషం. వారందరికీ బీసీ వెల్ఫేర్ కమిషన్ ఇచ్చిన జాబితా ప్రకారం హెల్త్ యూనివర్సిటీలో జరిగిన కౌన్సెలింగ్‌లో అధికారులు సీట్లు కేటాయించారు. మిగిలిన కౌన్సెలింగ్ కేంద్రాల్లోనూ ఎవరైనా ఇలా చేరారేమో విచారణ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. డీజీపీ, ఇంటెలిజన్స్ డీజీ దృష్టికి తీసుకువచ్చామని, సీబీ సీఐడీ విచారణ జరిపి బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

విద్యార్థులపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు. ఈ విషయాన్ని ఎంసీఐ దృష్టికి తీసుకెళ్లి బీసీ విద్యార్థులకు చెందాల్సిన సీట్లు వారికే కేటాయించేలా ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. సదరు తహసీల్దార్ విషయమై కర్నూలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన అవినీతికి పాల్పడుతున్నాడని తెలిసి అక్కడి నుంచి వేరే చోటికి బదిలీచేసినట్లు చెప్పారని వివరించారు.

ఇదే విషయమై ప్రస్తుతం వెలుగోడులో తహసీల్దార్‌గా పనిచేస్తున్న శివరాముడును ‘సాక్షి’ వివరణ కోరగా... నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం ఇప్పుడే తెలిసిందన్నారు. తహసీల్దార్‌గా ఇప్పటి వరకు లక్షా 70వేల సర్టిఫికెట్లు జారీ చేశానని, వీటిలో నకిలీలు ఉన్నట్లు తెలియదన్నారు.  పరిశీలించిన తర్వాత వివరణ ఇస్తానని చెప్పారు.

Advertisement
Advertisement