నేతాజీ అదృశ్యం ఫైళ్లను బయటపెట్టాలి | Sakshi
Sakshi News home page

నేతాజీ అదృశ్యం ఫైళ్లను బయటపెట్టాలి

Published Sun, Apr 12 2015 1:58 AM

నేతాజీ అదృశ్యం ఫైళ్లను బయటపెట్టాలి - Sakshi

- ప్రధాని మోదీని కోరతానన్న నేతాజీ మనవడు సూర్యకుమార్
- విదేశాలతో సంబంధాలు దెబ్బతింటాయన్న వాదన కుంటిసాకు అని విమర్శ

కోల్‌కతా: స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్‌చంద్రబోస్ అదృశ్యానికి సంబంధించిన ఫైళ్లను బహిర్గతపరచాలని ఆయన మనవడు సూర్యకుమార్‌బోస్ ప్రధాని నరేంద్ర మోదీని కోరనున్నారు. ఆయన జర్మనీ పర్యటనలో ఉన్న మోదీని సోమవారం కలసి విజ్ఞప్తి చేయనున్నారు.

జర్మనీలోని హంబర్గ్‌లో నివసిస్తున్న సూర్యకుమార్ అక్కడి ఇండో-జర్మన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోదీ జర్మనీ పర్యటన సందర్భంగా బెర్లిన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అక్కడి భారతీయ ఎంబసీ సూర్యకుమార్‌ను ఆహ్వానించింది. ఈ సందర్భంగా 1945లో నేతాజీ అదృశ్యానికి సంబంధించిన ఫైళ్లను బహిర్గతం చేయాల్సిందిగా మోదీని కోరనున్నట్లు సూర్యకుమార్ వెల్లడించారు. ‘సుభాష్ ఒక్క మా కుటుంబానికి చెందినవారు మాత్రమే కాదు. ఆయన దేశం ఆస్తి.

ఆయన అదృశ్యానికి సంబంధించిన ఫైళ్లను బయటపెట్టాలని కోరాల్సిన బాధ్యత ఒక్క కుటుంబానిదే కాదు  దేశ ప్రజలది కూడా. మోదీని కలిసే అవకాశం వస్తే.. ఈ విషయాన్ని ప్రస్తావిస్తాను...’ అని సూర్యకుమార్ చెప్పారు. ఆ ఫైళ్లను బయటపెట్టడం వల్ల విదేశాలతో సంబంధాలు దెబ్బతింటాయన్న వాదన కేవలం ఒక కుంటిసాకు మాత్రమేనని నేతాజీ మరో మనవడు చంద్రబోస్ వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం పారదర్శకత గురించి మాట్లాడుతూ ఉంటుందని, ఇప్పుడు నేతాజీ అదృశ్యం ఫైళ్లను బయటపెట్టి పారదర్శకతను నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. కాగా నేతాజీ సుభాష్‌చంద్రబోస్ అదృశ్యం అనంతరం ఆయన కుటుంబసభ్యులపై నిఘా పెట్టిన అంశంలో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కోరారు.

ఈ విషయంపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లతో మాట్లాడుతానని చెప్పారు. నేతాజీ కుటుంబ సభ్యులపై ఎందుకు నిఘాపెట్టారు, ఎవరి హయాంలో ఇది జరిగింది, దీనికి ఎవరు బాధ్యత వహించాలనేది ప్రజలకు తెలియాలని వెంకయ్య పేర్కొన్నారు. మరోవైపు నేతాజీ అదృశ్యానికి సంబంధించిన ఫైళ్లను బహిర్గతం చేయడంలో కాంగ్రెస్, బీజేపీలు దొందూ దొందేనని సీపీఎం నేత సూర్జాకాంత మిశ్రా విమర్శించారు.

Advertisement
Advertisement