పదవుల కోసం కాదు... బాబుపై పోరాడేందుకే: బొత్స | Sakshi
Sakshi News home page

పదవుల కోసం కాదు... బాబుపై పోరాడేందుకే: బొత్స

Published Mon, Jun 8 2015 2:24 AM

పదవుల కోసం కాదు... బాబుపై పోరాడేందుకే: బొత్స - Sakshi

బాబు పాలనపై పోరాటానికే..
* వైఎస్సార్‌సీపీలో చేరికపై బొత్స స్పష్టీకరణ
* ప్రజల తరఫున పోరాటానికి వైఎస్సార్‌సీపీయే వేదిక

సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు ప్రజాకంటక పాలన, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. బొత్స ఆదివారం తన అనుచరులతో వైఎస్సార్‌సీపీలో చేరిన అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో  మాట్లాడారు.

సీఎం చంద్రబాబు ఎన్నికలప్పుడు ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ విస్మరించారని, దీనిపై జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ సమర్థవంతమైన ప్రతిపక్షంగా పోరాడుతోందని, అందుకే ఆ పార్టీలో చేరాలని భావించానని బొత్స చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలకు, తనను నమ్ముకున్నవారికి స్థైర్యాన్ని, ధైర్యాన్ని కల్పించి వారికి అండగా నిలబడాలంటే  అందుకు సరైన వేదిక వైఎస్సార్‌సీపీయేనన్నారు. రూ.24 వేల కోట్ల మేరకు రైతు రుణాల మాఫీని చేసినట్లు బాబు అబద్ధాలు చెబుతున్నారని, కేటాయించింది రూ.9 వేల కోట్లే అయినపుడు ఇదెలా సాధ్యమైందని బొత్స ఆశ్చర్యం వెలిబుచ్చారు. తొలి ఐదు సంతకాలనూ అమలు చేయలేదన్నారు.
 
సింగపూర్ వాళ్లను తెచ్చి రాజధాని పేరుతో బాబు వ్యాపారం..
చంద్రబాబు చర్యలు రాష్ట్రాన్ని సింగపూర్ వ్యాపారులకు ధారపోసేలా ఉన్నాయని బొత్స తప్పుపట్టారు. సింగపూర్‌లో ఉన్న తన వ్యాపార భాగస్వాముల్ని తెచ్చి వారితో ఇక్కడ రాజధాని పేరిట వ్యాపారం చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘సింగపూర్‌కు చెందిన ఈశ్వరన్ ఏమైనా మదర్ థెరిసా ట్రస్టు కన్వీనరా? ఆ దేశం నుంచి తెచ్చి ఈ రాష్ట్ర రాజధానిని నిర్మించడానికి? సింగపూర్‌కు చంద్రబాబేమైనా తోడ బుట్టినవాడా? లేక అల్లుడా?’’ అని బొత్స ప్రశ్నించారు. రాజధానిపై కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను తిరస్కరించడం సరికాదన్నారు.రాష్ట్రప్రభుత్వం రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎలాంటి సమగ్ర నివేదిక(డీపీఆర్)ను రూపొందించకుండా కేంద్రాన్ని నిధులెలా అడుగుతుందన్నారు.

వైఎస్ పథకాలు జగన్‌ద్వారానే అమలవుతాయని విశ్వసిస్తున్నా..
వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రప్రజల ఆకలి తీర్చడమే ప్రాతిపదికగా తీసుకుని.. సంతృప్త స్థాయిలో అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల్ని అందజేశారని, ఇంకా మిగిలిపోయిఉన్న ఈ పథకాలు ఆయన కుమారుడు జగన్‌ద్వారా అమలవుతాయని విశ్వసిస్తున్నానని బొత్స చెప్పారు. గృహప్రవేశం ఉన్నందువల్లే ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు ఈ కార్యక్రమానికి రాలేకపోయారని బొత్స ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement