ఇద్దరం కలిసి ఇండియా భరతం పడదాం.. | Sakshi
Sakshi News home page

ఇద్దరం కలిసి ఇండియా భరతం పడదాం..

Published Fri, Dec 2 2016 4:00 PM

ఇద్దరం కలిసి ఇండియా భరతం పడదాం..

- సంచలన ఆడియో టేప్ లో బుర్హాన్-హఫీజ్

ఎవరినైతే అమరుడంటూ దాయాది దేశం అంతర్జాతీయ వేదికలపై పొడిగిందో, ఎవరి ఎన్ కౌంటర్ తర్వాత కశ్మీర్ లోయలో, ఆ తర్వాత సరిహద్దు అంతటా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయో, ఎవరి చావు మరో 100 మంది చావులకు, 4000 మంది గాయాలకు కారణమైందో ఆ హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీకి సంబంధించిన సంచలన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. జులై 8న ఎన్ కౌంటర్ కావడానికి కొద్ది గంటల ముందు బుర్హాన్.. లష్కరే తాయిబా చీఫ్ హఫీజ్ సయీద్ తో ఫోన్లో మాట్లాడాడు.

'ఇప్పటికే ఇండియన్ ఆర్మీపై పై చేయి సాధించాం. ఇక ముందు కూడా మన ఆధిపత్యాన్ని కొనసాగించాలి. అందుకోసం మీ ఆశీర్వాదాలు, ఆయుధాలు కావాలి. ఇక్కడున్న మీవాళ్ల సహకారం కూడా కావాలి..' అంటూ వనీ.. హఫీజ్ సయీద్ తో ఫోన్ లో మాట్లాడిన ఆడియో టేప్ ను ఓ జాతీయ వార్త సంస్థ బహిర్గతం చేసింది. ఇండియన్ ఇంటెలిజెన్స్ అధికారుల ఈ టేపులు నిజమైనవేనని ధృవీకరించినట్లుగా ఆ సంస్థ పేర్కొంది. ఆ సంవాదం ఇలా సాగింది..

ఫోన్ చేసిన వ్యక్తి: అస్సలామాలేకుం బుర్హాన్.. పీర్ సాహిబ్(హఫీజ్)తో మాట్లాడండి..
హఫీజ్: సలామ్ వాలెకుం..

బుర్హాన్: సలామ్ వాలెకుం.. ఎలా ఉన్నారు?
హఫీజ్: ఆ.. బాగున్నా. ఎవరు? బుర్హానేనా?

బుర్హాన్: అవును. నేను బుర్హాన్ నే. మీరు బాగున్నారుకదా!
హఫీజ్:  అంతా దేవుడి దయ. ఆ కృపామయుడే మనల్ని అన్ని విధాలా ఆశీర్వదిస్తున్నాడు. అతనికే మహిమ.

బుర్హాన్: మీతో మాట్లాడాలాని ఆశగా ఎదురు చూస్తున్నా. ఇన్నాళ్టికి మాట్లాడగలుగుతున్నా. మీ ఆరోగ్యం ఎలా ఉంది?
హఫీజ్: దేవుడి దయతో అంతా బాగుంది. అక్కడ(ఇండియాలో) మీరు చాలా కఠినమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. కానీ కలత వద్దు. మీకు ఎలాంటి సహాయం కావాలో చెప్పండి.. అందించడానికి సిద్ధంగా ఉన్నాం. శత్రువుతో పోరాటంలో మీరు విజయం సాధించాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాం. చెప్పండి ఏంకావాలో..

బుర్హాన్: ఇన్షా అల్లాహ్.. మీ లాంటి పెద్దల సహకారం ఉంటే ఏదైనా చెయ్యగలం. దేవుడు నా ప్రార్థనని అంగీకరించి, ఆశీర్వాదాలు కురిపించాడు గనుకే మీతో మాట్లాడగలుగుతున్నా.
హఫీజ్:  అయ్యయ్యో.. ఎంతమాట! నువ్వు మాకు చాలా కావాల్సినవాడివి. నీకు సంబంధించిన ప్రతి సమాచారం మాకు అందుతూనేఉంది. అక్కడ(కశ్మీర్)లో చాలా గొప్పగా పనిచేస్తున్నావ్.. చాలా సంతోషం.

బుర్హాన్: నాదో చిన్న విన్నపం.. కశ్మీర్ లోని మీవాళ్లు(లష్కరే సభ్యులు) స్తబ్ధుగా ఉన్నారు. మీ నుంచి సహకారం అందుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడంలేదు. ఒకవేళ వాళ్ల నెట్ వర్క్ బలహీనంగా ఉంటే నేను సహకరించగలను. నాకు చాలా సంబంధాలున్నాయి.
హఫీజ్: మంచిది. నువ్వు చెప్పినదాని గురించి చర్చిస్తాం. దేవుడు నీకు సహాయం చేయాలని ప్రార్థిస్తాం.

బుర్హాన్: ఇంకో విషయం చెప్పాలి.. ఇక్కడి శత్రువు(ఇండియన్ ఆర్మీ) మీద మనం దాదాపు పట్టు సాధించాం. మరిన్ని దాడులు చేసి మన ఆధిపత్యాన్ని కొనసాగించాలి. ఇందుకోసం  మీ నుంచి ఆయుధ సహకారం కావాలి. మనం(హిజ్బుల్, లష్కరే) కలిసి పనిచేస్తే బాగుంటుంది. ఇదే విషయాన్ని శ్రీనగర్ లో ఉన్న దుజానా(కశ్మీర్ లో లష్కర్ కమాండర్)తో కూడా మాట్లాడాను. మీరు సహకరిస్తే ఇండియన్ ఆర్మీని ఇక్కడి(కశ్మీర్) నుంచి పూర్తిగా వెళ్లగొట్టగలం..
హఫీజ్: ఇన్షా అల్లాహ్. మన సహోదరీ సహోదరులకు శుభాకాంక్షలు తెలియజేయి. నేను అందరి గురించీ ప్రార్థిస్తున్నానని చెప్పు.

బుర్హాన్: కృతజ్ఞతలు. లష్కర్ కు అవసరమైన ఎలాంటి సాయం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నా. వాళ్లు(లష్కర్లు) నా సహోదరులు. మా లక్ష్యం, శత్రువు కూడా ఒక్కటే.
హఫీజ్: మంచింది. ఇన్షాఅల్లాహ్..

బుర్హాన్: ఇక్కడి లష్కర్ వాళ్లు 'హఫీజ్ సాబ్ తో ఎప్పుడూ మాట్లాడలేద'ని చెబుతుంటారు.
హఫీజ్: వాళ్లు చెప్పింది నిజమే. నీ మెసేజ్ చూసిన తర్వాత నీతో మాట్లాడాలనుకున్నా. మా వాళ్లతో టచ్ లో ఉండు. నీ గురించి వాళ్లకు ఇప్పటికే చెప్పాం.

బుర్హాన్:  మీరు చెప్పనట్లే వాళ్లతో టచ్ లో ఉంటా. అవసరమైనమేరకు సాయం చేస్తా.
హఫీజ్:  సరే, ఉంటామరి.
బుర్హాన్: ఉంటామరి.

Advertisement
Advertisement