బదనాం కాకుండా టీటీడీపీ తంటాలు | Sakshi
Sakshi News home page

బదనాం కాకుండా టీటీడీపీ తంటాలు

Published Fri, Nov 6 2015 7:31 AM

బదనాం కాకుండా టీటీడీపీ తంటాలు - Sakshi

సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఉపఎన్నికపై తెలంగాణ టీడీపీ నాయకత్వం తర్జన భర్జన పడుతోంది. బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా కమలం నుంచి బరిలోకి దిగిన ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ దేవయ్య విజయం కోసం తెలంగాణ తమ్ముళ్లు కసర త్తు చేస్తున్నారు. తమ వైపు నుంచి ఎలాంటి పొరపాటు లేకుండా అభ్యర్థి గెలుపు కోసం శ్రమించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేసిన సూచన మేరకు టీ టీడీపీ నాయకులు వ్యూహరచనలో మునిగిపోయారు. అయితే, గత ఎన్నికల అనుభవం చేదుగా ఉండడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ ఎంపీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరకాల, పాలకుర్తిలో టీడీపీ గెలిచింది. కానీ, వరంగల్ లోక్‌సభ స్థానంలో ఉమ్మడి అభ్యర్థి (బీజేపీ) మూడో స్థానంలో నిలిచినా, కనీసం డిపాజిట్ దక్కలేదు. టీడీపీ శ్రద్ధపెట్టకపోవడంతోనే ఇలా జరిగిందని అప్పుడు బీజేపీ మండిపడింది. ఈనేపథ్యంలో మిత్రపక్షం నుంచి మాట రాకుండా చూసుకుంటున్నామని టీడీపీ నేత ఒకరు చెప్పారు.
 
ఉప ఎన్నిక కోసమే సర్వసభ్య భేటీ!
ప్రధానంగా ఉప ఎన్నికలపై చర్చించేందుకే శనివారం టీటీడీపీ రాష్ట్ర కమిటీ సర్వసభ సమావేశాన్ని ఏర్పాటు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త కమిటీ ఏర్పాటయ్యాక ఇప్పటిదాకా ఎలాంటి సమావేశం నిర్వహించలేదు. దీంతో కొత్త కమిటీతో భేటీ అయ్యేందుకు, అదే సమయంలో ఉప ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సమావేశం జరుపుతున్నారని అంటున్నారు.

Advertisement
Advertisement