ఏచూరికి విజయన్‌ షాక్‌! | Sakshi
Sakshi News home page

ఏచూరికి విజయన్‌ షాక్‌!

Published Tue, Jul 25 2017 5:00 PM

ఏచూరికి విజయన్‌ షాక్‌! - Sakshi

  • ఆయనను మరోసారి రాజ్యసభకు పంపే ప్రసక్తే లేదు
  • తేల్చిచెప్పిన కేరళ సీఎం
  • సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని మూడోదఫా రాజ్యసభకు పంపించే విషయమై ఆ పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగం కేంద్ర కమిటీ చర్చిస్తున్న సమయంలోనే కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో ఏచూరిని రాజ్యసభకు ఎన్నుకునే ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. 'కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో పార్టీ ప్రధాన కార్యదర్శిని రాజ్యసభకు పంపడం మా రాజకీయ వైఖరిరి విరుద్ధం' అని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తి పార్లమెంటేరియన్‌ బాధ్యతలకు న్యాయం చేకూర్చలేరని, పార్టీ బాధ్యతల్లో భాగంగా ఆయన దేశవ్యాప్తంగా పర్యటించాల్సి ఉంటుందని చెప్పారు.

    సీపీఎంలో రాజ్యసభ సభ్యత్వం అంశం రెండు గ్రూపుల మధ్య దూరాన్ని పెంచుతున్న సంగతి తెలిసిందే. రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికైన పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మూడోసారీ పెద్దలసభలో అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. పశ్చిమబెంగాల్‌ నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు ఆయన ప్రణాళికలు వేశారు. పార్టీలో మరో సీనియర్‌ నేత ప్రకాశ్‌ కారత్‌ వర్గం దీనిపై విముఖత వ్యక్తం చేస్తోంది. ఆగస్టు 8న జరగనున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌కు తుదిగడువు (జూలై 28) సమీపిస్తుండటంతో ఈ సమావేశాల్లోనే ఎవరు పోటీ చేస్తారనే దానిపై కేంద్ర కమిటీ స్పష్టతనివ్వాల్సి ఉంది.


    ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఏచూరి, మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కారత్‌ల మధ్య రాజ్యసభ విషయంలో తీవ్రమైన విభేదాలున్నాయనేది బహిరంగ రహస్యమే. గత నెలలో జరిగిన పార్టీ పొలిట్‌ బ్యూరో సమావేశంలోనే సీతారాం ఏచూరికి మూడోసారి రాజ్యసభ ఇవ్వటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. నేతలెవరైనా గరిష్టంగా రెండుసార్లు మాత్రమే రాజ్యసభకు వెళ్లే అవకాశం ఇవ్వాలని కేంద్ర కమిటీలో చర్చ జరిగింది. అయితే, పశ్చిమబెంగాల్, త్రిపుర సీపీఎం యూనిట్లు ఏచూరీని మరోసారి రాజ్యసభకు పంపాలని డిమాండ్‌ చేస్తున్నాయి. పార్లమెటులో వామపక్ష వాణిని బలంగా వినిపిస్తున్నారని ఏచూరికి మద్దతుగా నిలిచాయి. మిగిలిన రాష్ట్రాల యూనిట్లలో ఏచూరిపై భిన్నాభిప్రాయాలున్నాయి.

Advertisement
Advertisement