అది ఉగ్రవాద దాడే.. ప్రధాని ఖండన! | Sakshi
Sakshi News home page

అది ఉగ్రవాద దాడే.. ప్రధాని ఖండన!

Published Mon, Jan 30 2017 12:52 PM

అది ఉగ్రవాద దాడే.. ప్రధాని ఖండన! - Sakshi

కెనడా: క్యుబెక్‌ నగరంలోని మసీదులో సాయుధులు  కాల్పులకు తెగబడిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఈ ఘటనను కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రుడో, క్యుబెక్‌ ప్రీమియర్‌ ఫిలిప్పె కోయిలార్డ్‌ తీవ్రంగా ఖండించారు. ఇది ఉగ్రవాద ఘటనేనని ట్రుడో స్పష్టం చేశారు. ఏడు ముస్లిం మెజారిటీ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిషేధం విధించిన నేపథ్యంలో కెనడాలో ఈ ఉగ్రవాద దాడి జరగడం గమనార్హం.

'ప్రార్థన మందిరంలో ముస్లింలపై జరిగిన ఈ ఉగ్రవాద దాడిని మేం ఖండిస్తున్నాం. అక్కడ మతిలేని హింసాత్మక ఘటన జరగడం గుండెల్ని పిండేస్తోంది. కెనడియన్లుగా భిన్నత్వమే మనం బలం. మత సహనం మన విలువ' అని ట్రుడో పేర్కొన్నారు. 'మన జాతి నిర్మాణంలో ముస్లిం-కెనడియన్లు ఒక కీలకమైన భాగం. మన కమ్యూనిటీలో, మన నగరాల్లో, దేశంలో ఇలాంటి మతిలేని దాడులకు తావులేదు' అని ఆయన అన్నారు. ఈ సాయుధ దాడికి పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేసి శిక్షిస్తారని, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు.

ఆదివారం రాత్రి 8  గంటల సమయంలో సాయంత్రం ప్రార్థనలు నిర్వహిస్తుండగా మసీదులో చొరబడిన సాయుధులు  విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సుమారు ముగ్గురు సాయుధ దుండగులు కాల్పులకు దిగినట్టు  తెలుస్తోంది. కాల్పులు జరిగిన సమయంలో మసీదు ఉన్న భవనంలో దాదాపు 40 మంది ఉన్నారు. ఫాయ్‌  స్ట్రీట్‌లో ఉన్న క్యుబెక్‌ సిటీ ఇస్లామిక్ కల్చరల్‌ సెంటర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో అలర్ట్‌ అయిన  కెనడా భద్రతా బలగాలు పెద్ద ఎత్తున చేరుకొని సంఘటనాస్థలిని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.  కాల్పులకు తెగబడిన ఇద్దరు సాయుధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కెనడా రేడియో  ప్రకటించింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement